సాక్షి, హైదరాబాద్: ‘గంగా జమునా తహజీబ్’ నానుడితో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మిశ్రమ సంస్కృతికి ప్రతిరూపంగా నిలుస్తోన్న భాగ్యనగరం వేతన జీవులు, వలస కూలీల పాలిట కల్పవృక్షంగా మారుతోంది. జనగణన శాఖ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2001–11 మధ్య కాలంలో గ్రేటర్ హైదరాబాద్ నగరానికి వలస వచ్చిన వారి సంఖ్య 39 శాతంగా నమోదైంది. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే వలసల విషయంలో రాజధాని అగ్రభాగాన నిలిచింది. 2021 జనాభా లెక్కల్లో నగరంలో 40 శాతానికిపైగా వలసలు నమోదవుతాయని నిపుణుల అంచనా. కాగా, దేశ రాజధాని ఢిల్లీ.. వలసల్లో పెరుగుదల ఒక్క శాతానికే పరిమితమై 6వ స్థానం దక్కించుకుంది.
హైదరా‘బాద్‌షా’..
ఐటీ, ఫార్మా, బల్క్‌డ్రగ్, నిర్మాణ రంగం, హెల్త్‌కేర్, విద్యా రంగాలకు కొంగు బంగారమై నిలుస్తోన్న హైదరాబాద్ నగరానికి ఏటేటా వలసలు పెరుగుతున్నాయి. వివిధ రకాల వృత్తి, విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం ఉత్తర, దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల నుంచి కూలీలు, విద్యా వంతులు నగరానికి భారీగా వలస వస్తున్నారు. వీరందరికీ వారి అనుభవం, అర్హతలను బట్టి ఉపాధి అవకాశాలు లభ్యమవుతున్నాయి. మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబైల్లో రోజువారీ కనీస జీవన వ్యయం అనూహ్యంగా పెరగడం, మరోవైపు హైదరాబాద్‌లో కనీస జీవన వ్యయం వాటి కంటే సగానికి పరిమితం కావడంతో వలసలు వెల్లువెత్తుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వలసలకు కారణాలివే..
► నగరంలోని ఉత్తర, దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల మిశ్రమ సంస్కృతి వేర్వేరు ప్రాంతాల ప్రజలను ఆకర్షిస్తుండటం.
► అల్పాదాయ, మధ్యాదాయ, వేతన జీవులు, దినసరి కూలీలకు అందుబాటులో కనీస జీవన వ్యయం.
► నగరంలో శరవేగంగా పురోగమిస్తున్న నిర్మాణ రంగం, బల్క్‌డ్రగ్, ఫార్మా, ఐటీ రంగాల్లో వేలాది మందికి ఉపాధి లభిస్తుండటం.
► ఉత్తరాది రాష్ట్రాల వారికి నగరంలో భాషాపరమైన ఇబ్బందులు లేకపోవడం.
► అందరికీ అందుబాటులో ఇంటిఅద్దెలు, రవాణా ఖర్చులు.
Comments
Please login to add a commentAdd a comment