ఏడాదికి వడ్డీ మూడు శాతమే... | 10 lakh loan cheated to Cyber Gang | Sakshi
Sakshi News home page

ఏడాదికి వడ్డీ మూడు శాతమే...

Published Wed, Apr 27 2016 12:21 AM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM

పోలీసుల అదుపులో నిందితులు

పోలీసుల అదుపులో నిందితులు

* ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే డబ్బు మీ అకౌంట్లోకి..
* రూ.10 లక్షల రుణమంటూ రూ.2.5 లక్షలు స్వాహా
* ఢిల్లీ కేంద్రంగా కథ నడిపిన సైబర్ గ్యాంగ్
* ఇద్దరిని అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: నగరవాసికి మారు పేర్లతో ఫోన్లు చేశారు... రూ.10 లక్షల రుణం ఇస్తామంటూ ఎర వేశారు... వివిధ చార్జీల పేరుతో రూ.2.55 లక్షలు స్వాహా చేశారు... ఈ పంథాలో దేశ వ్యాప్తంగా అనేక మందికి టోకరా వేసిన ఢిల్లీ గ్యాంగ్ గుట్టును సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు.

ముఠాకు చెందిన రేణు పాండే, అమర్‌చంద్ కేసరిలను అరెస్టు చేసినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ డాక్టర్ టి.ప్రభాకరరావు మంగళవారం వెల్లడించారు. ఢిల్లీకి చెందిన మధువేందర్ సింగ్, రేణు పాండే, అమర్‌చంద్ కేసరి ఓ ముఠాగా ఏర్పడ్డారు. న్యూఢిల్లీలో సోను వరల్డ్ విజన్ లిమిటెడ్, సిగ్నేచర్ హెల్త్ మేనేజ్‌మెంట్ పేర్లతో సంస్థలు ఏర్పాటు చేశారు. అందినకాడికి దండుకోవాలని కుట్ర పన్నిన ఈ త్రయం ఇవే పేర్లతో బ్యాంకు ఖాతాలు సైతం తెరిచారు. తమ కార్యాలయంలో టెలీకాలర్లను నియమించుకుని దేశవ్యాప్తంగా అనేక మంది వినియోగదారుల ఫోన్ నెంబర్లకు కాల్స్ చేయిస్తున్నారు.

వివిధ బ్యాంకు నుంచి సాలీనా మూడు శాతం వడ్డీకి రుణాలు ఇప్పిస్తామంటూ టెలీకాలర్స్ ఎర వేస్తారు. గత ఏడాది సెప్టెంబర్‌లో గాజులరామారం ప్రాంతానికి చెందిన జె.కుమారస్వామికి ఓ ఫోన్ వచ్చింది. ఐఎన్‌జీ వైశ్యా బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నట్లు రాజీవ్‌కుమార్ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. తక్కువ వడ్డీకి రుణం అని చెప్పడంతో రూ.10 లక్షలు తీసుకునేందుకు కుమారస్వామి అంగీకరించాడు. దీంతో ప్రాసెసింగ్ చార్జీల పేరు చెప్పిన రాజీవ్ తన సంస్థ పేరిట ఉన్న ఖాతాలోకి రూ.1.2 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు.

ఆపై వాసుదేవ్ పండిట్ పేరుతో కాల్ చేసిన వ్యక్తి తాను ఆదాయపు పన్ను శాఖ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. రూ.10 లక్షల రుణానికి సంబంధించి ఆదాయపు పన్నుగా రూ.1.35 లక్షలు చెల్లించాలంటూ నమ్మబలికి బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. కొన్ని రోజులు రుణం కోసం వేచి చూసిన కుమారస్వామి రాజీవ్, వాసుదేవ్‌లుగా చెప్పుకున్న వ్యక్తులు కాల్ చేసిన నెంబర్లకు సంప్రదించే ప్రయత్నించారు. అవన్నీ స్విచ్ఛాఫ్‌లో ఉన్నట్లు తేలడంతో మోసపోయినట్లు గుర్తించి సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు ఏసీపీ కేసీఎస్ రఘువీర్ నేతృత్వంలో దర్యాప్తు చేశారు.

సాంకేతిక ఆధారాలను బట్టి నిందితులు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. ఇన్‌స్పెక్టర్ కేవీఎం ప్రసాద్, కానిస్టేబుళ్లు సతీష్, రమేష్, హరిప్రసాద్, సత్యవేణిలతో కూడిన బృందం ఢిల్లీ వెళ్లి రేణు పాండే, అమర్‌చంద్ కేసరిలను అరెస్టు చేసింది. ఈ ముఠా దేశ వ్యాప్తంగా అనేక మందికి రుణాల పేరుతో ఫోన్లు చేసి, ప్రాసెసింగ్ ఫీజులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, ఆర్బీఐ చార్జీలు, ఇన్‌కమ్‌ట్యాక్స్ చార్జీల పేరుతో రూ.25 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు దండుకున్నట్లు గుర్తించారు. మొత్తమ్మీద రూ.3 కోట్ల మేర మోసాలు చేసిన ఈ ముఠాకు చెందిన మిగిలిన వారి కోసం సైబర్ క్రైమ్ పోలీసులు గాలిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement