ఆయిల్‌ఫెడ్‌లో 2.53 కోట్లు పక్కదారి
- లోకాయుక్త విచారణలో వెల్లడి... ఎండీకి తెలియకుండా ఇది జరగదు
- ఒక కంపెనీకి అక్రమంగా క్రూడ్ ఆయిల్ సరఫరా చేసినట్లు ఆరోపణ
- 33 చెక్‌లు బౌన్స్ అయినా సరఫరా చేయడంపై అక్రమాలు
సాక్షి, హైదరాబాద్: ఆయిల్‌ఫెడ్‌లో రూ.2.53 కోట్లు పక్కదారి పట్టినట్లు లోకాయుక్త విచారణలో తేలింది. అప్పటి ఎండీకి తెలియకుండా ఇది జరిగే అవకాశం లేదని, పలువురు ఉద్యోగులపై అభియోగాలు నిజమేనని తేల్చింది. ఆయిల్‌ఫెడ్ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు ఆర్.నర్సింహారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త డైరెక్టర్ కె.నర్సింహారెడ్డి విచారణ చేపట్టారు. అనంతరం విచారణ నివేదికను లోకాయుక్త రిజిస్ట్రార్‌కు అందజేశారు. 2014 సెప్టెంబర్ 11 నుంచి అదే ఏడాది అక్టోబర్ 9 వరకు పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీ నుంచి 50 లారీల (528 టన్నులు) క్రూడాయిల్‌ను పలు దఫాలుగా ఒక ప్రైవేటు కంపెనీకి విక్రయించారు.
ఆ మేరకు సంబంధిత కంపెనీ నుంచి విడతల వారీగా చెక్‌లు తీసుకున్నారు. కంపెనీ ఇచ్చిన మొదటి రెండు మూడు చెక్‌లు బౌన్స్ అయినా.. ఆ కంపెనీకే క్రూడాయిల్‌ను ఆయిల్‌ఫెడ్ సరఫరా చేసింది. చివరకు 33 చెక్‌లు ఇచ్చినా, అవీ బౌన్స్ అయ్యాయి. అలా రూ.2.53 కోట్ల విలువైన చెక్‌లు బౌన్స్ అయినట్లు నిర్ధారణయింది. ఈ చెక్‌ల బౌన్స్‌ల వెనుక, ఇప్పటివరకు ఆ సొమ్ము రికవరీ కాకపోవడంలో ఆయిల్‌ఫెడ్ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినట్లు లోకాయుక్త విచారణలో తేలింది. ఆ సమయంలో క్రూడాయిల్ సరఫరా కమిటీలో ఉన్న ఆయిల్‌ఫెడ్ సీనియర్ అధికారులు కె.వి.రంగారెడ్డి, ఎన్.ఎస్.ఎన్.మూర్తి, ఎం.తిరుపతిరెడ్డి, డి.అచ్యుతరావు బాధ్యులని ఉద్యోగుల సంఘం నేత లోకాయుక్తకు విన్నవించారు. అందులో కొందరు రిటైరయ్యారు. చెక్‌బౌన్స్ పేరుతో కోట్లల్లో జరిగిన అక్రమాలు అప్పటి ఎండీ వి.ఎన్.విష్ణుకు తెలియకుండా ఉండదని లోకాయుక్త పేర్కొంది. కాగా, పక్కదారి పట్టిన రూ.2.53 కోట్లు ఇప్పటివరకు సంబంధిత కంపెనీ నుంచి రికవరీ కాలేదని ఆయిల్‌ఫెడ్ ఎండీ వీరబ్రహ్మయ్య ‘సాక్షి’కి తెలిపారు.
నాకు తెలియకుండానే జరిగింది: వి.ఎన్.విష్ణు, మాజీ ఎండీ, ఆయిల్‌ఫెడ్
క్రూడాయిల్ సరఫరా, చెక్‌లు బౌన్స్ కావడం నాకు తెలియకుండా కింది స్థాయిలో జరిగింది. ఆయిల్‌ఫెడ్ బోర్డు నిర్ణయాల ప్రకారం కింది స్థాయిలో సహజంగానే ఇలా జరిగిపోతుంటాయి. పైగా నా సంతకం కూడా ఎక్కడా లేదు. అక్రమాలు జరిగినట్లు నా దృష్టికి వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించా. క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి.