
2011 గ్రూప్1 పరీక్షల హాల్‌టికెట్లు విడుదల
- ఈనెల 13 నుంచి 23 వరకు పరీక్షలు
- ఏపీపీఎస్సీ కార్యదర్శి సాయి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 13 నుంచి నిర్వహించనున్న 2011 గ్రూప్1 మెయిన్స్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం నుంచి హాల్‌టికెట్లను విడుదల చేసింది. మెయిన్స్‌కు క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను www.psc.ap.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి సాయి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 13 ఉదయం 8 గంటల వరకు వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ఈ పరీక్షలు 13 నుంచి 23 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరగనున్నాయి. ఇదే తేదీల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా 2011 గ్రూప్1 మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తోంది.
13వ తేదీ పరీక్ష యథాతథం..
గ్రూప్1 పరీక్షలు 13 నుంచి ప్రారంభమవుతాయని ఏపీపీఎస్సీ ఇదివరకే షెడ్యూల్ విడుదల చేసింది. అయితే 13న బక్రీద్ పండగ ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం ఆ రోజున జరగాల్సిన జనరల్ ఇంగ్లిష్‌ను 24కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఏపీపీఎస్సీ పరీక్షలు మాత్రం యథాతథంగా 13 నుంచే ప్రారంభమవుతాయని ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ ‘సాక్షి’తో బుధవారం పేర్కొన్నారు. పరీక్ష తేదీల్లో, సమయాల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టంచేశారు. మరోవైపు ఏపీపీఎస్సీ ఈ పరీక్షలకు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలతో పాటు హైదరాబాద్ ప్రాంతంలో పరీక్ష కేం ద్రాలు ఏర్పాటు చేసింది. తెలంగాణలోని అభ్యర్థులందరికీ హైదరాబాద్ కేంద్రాలను కేటాయించింది. పరీక్షల్లో సాధారణ కాలిక్యులేటర్లను అనుమతిస్తామని నోటిఫికేషన్లో పేర్కొని ఇపుడు హాల్‌టికెట్లలో మాత్రం అనుమతించబోమని ఏపీపీఎస్సీ పేర్కొందని అభ్యర్థులు చెబుతున్నారు. దీనివల్ల మేథమెటి క్స్‌కు సంబంధించి జనరల్ అభ్యర్థులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.