మహా సన్నాహం
ఖైరతాబాద్‌లోని మహాగణపతి
దర్శనానికి భక్తులు పోటెత్తారు.
శుక్రవారం ఒక్క రోజే సుమారు
3 లక్షల మంది దర్శించుకున్నారు.
గణనాథుడి నిమజ్జన వేడుకలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. ఆదివారం నిర్వహించనున్న వినాయకుని శోభాయాత్రలో అన్ని ప్రభుత్వ విభాగాలు పాలు పంచుకుంటున్నాయి. హుస్సేన్ సాగర్‌తో పాటు నగరంలోని వివిధ పెద్ద చెరువుల్లో చిన్నవి, పెద్దవి కలిపి సుమారు లక్ష విగ్రహాలు నిమజ్జనం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రూ.10 కోట్లు కేటాయించారు. వేడుకలు తిలకించేందుకు వెళ్లే వారి కోసం గ్రేటర్ ఆర్టీసీ 400 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
సిటీబ్యూరో: మహానగరంలో అంగరంగ వైభవంగా జరిగే గణనాథుడి నిమజ్జన వేడుకలకు భాగ్యనగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆదివారం జరిగే గణేష్ శోభాయాత్రకు అన్ని ప్రభుత్వ విభాగాలు ఏర్పాట్లు పూర్తిచేశాయి. జీహెచ్‌ఎంసీ, పోలీసు, పీసీబీ, జలమండలి, ఆర్టీసీ, రవాణా, వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ శాఖలు ఏర్పాట్లలో ఎక్కడా ఆటంకం తలెత్తకుండా సన్నాహాలు చేశాయి. కాగా ఈసారి హుస్సేన్‌సాగర్‌తోపాటు నగరం నలుమూలల ఉన్న 24 చెరువుల్లో సుమారు లక్ష వరకు భారీ,చిన్న గణేష్ ప్రతిమలు నిమజ్జనం జరిగే అవకాశాలున్నట్లు పీసీబీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆయా విభాగాల ఆధ్వర్యంలో పూర్తిచేసిన ఏర్పాట్లు ఇలా ఉన్నాయి.
పీసీబీ... హైకోర్టు ఆదేశాల ప్రకారం హుస్సేన్‌సాగర్‌తో పాటు నిమజ్జనం జరిగే మరో పది పెద్ద చెరువుల్లో కాలుష్య మోతాదును అంచనా వేసేందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నడుం బిగించింది. ఆయా జలాశయాల్లో నిమజ్జనానికి ముందు, నిమజ్జనం జరిగిన రోజులు, నిమజ్జనం తర్వాత నీటిలో పెరిగే కాలుష్య ఆనవాళ్లను వేర్వేరుగా లెక్కించాలని నిర్ణయించింది.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం గ్రేటర్ ఆర్టీసీ 400 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ ఎ.పురుషోత్తమ్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. బషీర్‌బాగ్-కాచిగూడ, బషీర్‌బాగ్-రాంనగర్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్ట్-దిల్‌షుఖ్‌నగర్, వనస్థలిపురం, మిధాని తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతారు. ఉప్పల్, సికింద్రాబాద్, రిసాలాబజార్, ఈసీఐఎల్, మల్కాజిగిరి, జామై ఉస్మానియా స్టేషన్‌ల నుంచి ఇందిరాపార్కు వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి. బీహెచ్‌ఈఎల్, కొండాపూర్, రాజేంద్రనగర్,టోలిచౌకి,జీడిమెట్ల,జగద్గిరిగుట్ట,గాజుల రామారం, బోరబండ, కూకట్‌పల్లిహౌసింగ్‌బోర్డు, లింగంపల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల నుంచి లక్డికాఫూల్/ఖైరతాబాద్ వరకు, కోఠి నుంచి ఆల్ ఇండియా రేడియో వరకు బస్సులు నడుపుతారు. అదేవిధంగా బస్సులను సమర్ధవంతంగా నడిపేందుకు అన్ని చోట్ల డిపోమేనేజర్‌లు, డీవీఎంలు, సూపర్‌వైజర్లు, మెకానిక్‌లు విధులు నిర్వహిస్తారు.
భారీ గణనాథుల తరలింపునకు 5000లకు పైగా వాహనాలు...
వినాయక నిమజ్జనం కోసం రవాణా శాఖ 5000లకు పైగా వాహనాలను సిద్ధం చేసింది. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి డిమాండ్‌కు అనుగుణంగా లారీలు, ట్రేలర్లు అందజేయనున్నట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల వద్ద సంబంధిత అధికారుల నుంచి భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు వాహనాలను పొందవచ్చన్నారు. మరోవైపు హయత్‌నగర్, ఆరాంఘర్, పటాన్‌చెరులలో మరిన్ని వాహనాలను సేకరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందు కోసం వంద మంది ఎంవీఐలు పని చేస్తున్నారని తెలిపారు.
వాహనాల అద్దెలు....
ట్రేలర్లకు రూ.18,700, భారీ వాహనాలకు రూ.3,630, ఆరు టైర్ల లారీలకు రూ.2,200 చొప్పున, డీసీఎం స్థాయి వాహనాలకు రూ.1430,లైట్‌గూడ్స్ వెహికిల్స్‌కు రూ.1210, టాటా ఏస్‌లకు రూ.820 చొప్పున అద్దె నిర్ణయించినట్లు తెలిపారు. డ్రైవర్, క్లీనర్‌లకు బత్తా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.