
4.24 లక్షల ఎకరాల్లో పంట నష్టం
- జిల్లాల్లో పర్యటించిన బృందాల ప్రాథమిక నివేదిక
- 222 మండలాల్లో.. దాదాపు రూ.1,000 కోట్ల నష్టం
సాక్షి, హైదరాబాద్: కుండపోత వర్షాలతో ఓవైపు రబీపై ఆశలు నెలకొనగా.. మరోవైపు ఇవే వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడం, చెరువులు, కుంటలు మత్తడి దూకడంతో లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 4.24 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారుల బృందాలు ప్రాథమిక అంచనా వేశాయి. పూర్తి స్థాయి నష్టం అంచనాకు కసరత్తు చేస్తున్నాయి.
ప్రాథమిక నివేదిక ఇచ్చిన బృందాలు
భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ శాఖ ప్రతి జిల్లాకు ఒక రాష్ట్రస్థాయి అధికారుల బృం దాన్ని పంపింది. ఆ బృందాలు 3 రోజుల పాటు పర్యటించి.. ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించాయి. ఆ నివేదిక మేరకు రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల్లో 4.24 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఖమ్మం మినహా 8 జిల్లాల్లోని 222 మండలాల్లో పంటలకు ఎక్కువ నష్టం జరిగింది. సోయాబీన్, వరి, పత్తి, కంది, మొక్కజొన్న, జొన్న పంటలు బాగా దెబ్బతిన్నాయి. అత్యధికంగా సోయాబీన్ పంటకు 1.79 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. పత్తి 98,025 ఎకరాల్లో దెబ్బతింది. 78,351 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. కంది 20,578 ఎకరాల్లో, మొక్కజొన్న 23,101 ఎకరాల్లో, జొన్న 11,273 ఎకరాల్లో నీటి పాలయ్యాయి. ఇక అక్కడక్కడా పెసర, మిరప, చెరకు, ఆముదం, పొగాకు పంటలు కూడా దెబ్బతిన్నాయి.
రూ. 1,000 కోట్లకుపైగా నష్టం..
వ్యవసాయ నిపుణులు వేస్తున్న అంచనాల ప్రకారం రైతులకు దాదాపు రూ.1,000 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అత్యధికంగా నిజా మాబాద్ జిల్లాలో 1.83లక్షల ఎకరాల్లో, రంగారెడ్డి జిల్లాలో 44,182 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పంటలు పూర్తిగా దెబ్బతినడంతోపాటు నీటిలో ఎక్కువ రోజులు ఉండడంతో జరిగే దిగుబడి నష్టం కలిపి ఈ స్థాయి లో నష్టం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీనిపై ఇంకా పూర్తిస్థాయి అంచనా వేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.
వాస్తవానికి ఈ ఏడాది బ్యాంకులు ఖరీఫ్ రుణాలు ఇవ్వడంలో మీనమేషాలు లెక్కించడం, ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేయకపోవడంతో రైతులు అప్పు లు చేసి పంటలు వేశారు. కానీ చేతికొచ్చే పంట నీట మునగడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.