ప్రజలను కలవడానికే మహాపాదయాత్ర
* సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
* ప్రభుత్వ విధానాలతో అభివృద్ధి సాధ్యంకాదు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక, సామాజిక రంగాల్లో రాష్ట్ర సమగ్రాభివృద్ధికోసం తమ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ నుంచి 4 వేల కిలోమీటర్ల మహాపాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో సమగ్రాభివృద్ధి సాధ్యం కానందున, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు, ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు పాదయాత్రను చేపట్టాలని రాష్ట్ర నిర్మాణ ప్లీనం నిర్ణయించిందన్నారు.
అన్నిజిల్లాలు, మండలాల్లోని ప్రజలను కలుస్తూ సాగే సుదీర్ఘపాదయాత్రకు సన్నాహాలు చేయాలని రాష్ట్ర కమిటీని ప్లీనం ఆదేశించిందన్నారు. వచ్చే 10, 15 రోజుల్లో రాష్ట్ర కమిటీ సమావేశమై నిర్దిష్టంగా పాదయాత్ర మార్గం, ఇతర అంశాలను ఖరారు చేస్తుందని చెప్పారు. మూడురోజుల పార్టీ ప్లీనం ముగింపు సందర్భంగా పార్టీ నాయకులు బి.వెంకట్, జాన్‌వెస్లీ, రమలతో కలసి గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాకు పార్టీ తుదిరూపునిస్తోందన్నారు. 20న కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిలపక్షానికి సీపీఎం తరఫున తాను, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హాజరవుతామని చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనలను వెంటనే అన్ని పార్టీలకు పంపించాలని ఆయన డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా గోసంరక్షణ ముసుగులో దళితులు, మైనారిటీలపై ఆరెస్సెస్, బీజేపీ చేస్తున్న దాడులను ఖండిస్తూ ఈ నెల 22న రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలు, కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, ఇతర రూపాల్లో నిరసనలు చేపట్టాలని సీపీఎం ప్లీనం పిలుపునిచ్చింది. దళితులపై పాలకవర్గాలు కపట ప్రేమను చూపుతున్నాయని తమ్మినేని విమర్శించారు. రాష్ర్టంలో 92 శాతమున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టంలో లోపాలు సవరించి, సమగ్రమైన రూల్స్ రూపొందించాలని, బీసీ, మైనారిటీలకు సబ్‌ప్లాన్ చట్టాలు తేవాలని డిమాండ్ చేస్తూ ప్లీనం తీర్మానాలను ఆమోదించిందని చెప్పారు.