వరుసగా 5వ సారి సమర్పిస్తున్న ‘సురుచి ఫుడ్స్’
తాపేశ్వరం (మండపేట): వినాయకచవితి సందర్భంగా ప్రసిద్ధ ఖైరతాబాద్ గణనాథుని చెంత ఉంచేందుకు తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం సురుచి ఫుడ్స్‌లో 5,600 కేజీల భారీ లడ్డూ తయారుకానుంది. 2010 నుం చి ఖైరతాబాద్ గణనాథునికి ఉచితంగా లడ్డూను అందిస్తున్నామని సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబు సోమవారం తెలిపారు. లడ్డూ తయారీ నిమిత్తం సెప్టెంబర్ 9న తనతోపాటు 16 మంది సిబ్బంది గణేష్ మాలధారణ చేస్తామని, 12న లడ్డూ తయారీ ప్రారంభించి, 14కి పూర్తి చేస్తామని చెప్పారు.
15న లడ్డూకు తుదిమెరుగులు దిద్దుతామని, ప్రముఖ కళాకారుడు వీరబాబు లడ్డూ పైభాగంలో జీడిపప్పు పౌడర్‌ను ఉపయోగించి చేసిన స్వీట్ పేస్టుతో త్రిశక్తిమయ విద్యాగణపతి రూపాన్ని తీర్చిదిద్దుతారని తెలిపారు. 16న ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ పంపుతామన్నారు. లడ్డూ తయారీలో చక్కెర 2,425 కిలోలు, శనగపప్పు 1,565 కిలోలు, నెయ్యి 1,100 కిలోలు, జీడిపప్పు 380 కిలోలు, బాదంపప్పు 100, యాలకులు 33, పచ్చ కర్పూరం 11 కిలోలు ఉపయోగించనున్నట్టు తెలిపారు.
ఖైరతాబాద్ గణేశుడికి 5,600 కిలోల లడ్డూ
Published Tue, Aug 25 2015 8:52 AM | Last Updated on Sun, Sep 3 2017 8:03 AM
Advertisement
Advertisement