suruchi foods
-
Tapeswaram Kaja: శర్వానంద్, రష్మికలకు బాహుబలి కాజా
మండపేట(తూర్పుగోదావరి): సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన సినీతారలను తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్ బాహుబలి కాజాతో సత్కరించింది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం షూటింగ్ ఆదివారం రాజమహేంద్రవరంలో జరిగింది. షూటింగ్లో పాల్గొన్న హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మికలకు సురుచి పీఆర్ఓ వర్మ బాహుబలి కాజాలను అందజేశారు. శర్వానంద్ మాట్లాడుతూ తనకు మడత కాజా అంటే చాలా ఇష్టమని, గతంలో తాను సురుచిని సందర్శించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారని వర్మ తెలిపారు. చదవండి: పూరి జగన్నాథ్ కన్నీళ్లు పెట్టుకున్నారు : డైరెక్టర్ -
మోహన్‌బాబును కలిసిన సురుచి ఫుడ్స్ ప్రతినిధి
హైదరాబాద్: త్వరలో జరిగే వినాయక చవితి కి ఫిలింనగర్ దైవసన్నిధానంలో ఏర్పాటు చేసే గణనాధుడికి 600 కిలోల మహాలడ్డూ సమర్పించనున్నట్లు తాపేశ్వరం కాజా మాతృసంస్థ సురుచి ఫుడ్స్ అధినేత పొలిశెట్టి మల్లిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు దైవసన్నిధానం చైర్మన్ మోహన్‌బాబుతో తమ ప్రతినిధి సమావేశమై ఈ మేరకు హామీ ఇచ్చారని వెల్లడించారు. గతేడాది కూడా దైవసన్నిధానం వినాయక చవితి ఉత్సవాలకు 500 కిలోల లడ్డూను అందజేసినట్లు తెలిపారు. తమ ప్రతినిధి వర్మ మోహన్‌బాబుతో కలిసినప్పుడు ఇందుకు సంబంధించిన లడ్డూ డిజైన్‌ను, ఎప్పుడు లడ్డూను సమర్పించే తదితర వివరాలు వెల్లడించారన్నారు. 2010 నుంచి ఖైరతాబాద్ గణేషుడికి మహాలడ్డూను సమర్పిస్తూ వచ్చిన తాము భద్రతా కారణాల వల్ల నిలిపివేశామన్నారు. -
‘సురుచి’ గిన్నిస్ రికార్డు
తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్ సంస్థ గాజువాకలోని గణనాథునికి సమర్పించిన29,465 కిలోల లడ్డూ సరికొత్త గిన్నిస్ రికార్డును నెలకొల్పింది. గుజరాత్‌లోని అంబాలాలో అరసూరి అంబాజీ మాత దేవస్థానం ట్రస్టు తయారు చేసిన 11,115 కిలోల లడ్డూ ఇప్పటి వరకు గిన్నిస్ రికార్డుగా ఉండింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ నుంచి గురువారం మెయిల్ వచ్చిందని సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు మీడియాకు వెల్లడించారు. రూ.35 లక్షల విరాళాలతో తయారైన ఈ మహా లడ్డూను వినాయకుడి నిమజ్జనం తర్వాత దేశ విదేశాల్లోని సుమారు ఆరు లక్షల మందికి పంపిణీ చేశామని ఆయన పేర్కొన్నారు. ఇకపై తమ సంస్థ రికార్డు రేసుల్లో పాల్గొనబోదని, మహాలడ్డూల తయారీ చేపట్టబోదని స్పష్టం చేశారు. - మండపేట -
ఖైరతాబాద్ తరలిన తాపేశ్వరం లడ్డూ
తూర్పుగోదావరి: ఖైరతాబాద్ గణనాథునికి మహాలడ్డూను కానుకగా పంపించింది తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్ సంస్థ. అయిదేళ్లుగా వస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ ఏడాది సుమారు ఆరు వేల కిలోల లడ్డూను సిద్ధం చేసి బుధవారం సాయంత్రం ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ తరలించింది. సురుచి ఫుడ్స్ సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబుతోపాటు 15 మంది సంస్థ సిబ్బంది గణపతి మాలధారణతో ఐదు రోజులపాటు శ్రమించి ఈ లడ్డూను తయారుచేశారు. కాజూపేస్ట్ను ఉపయోగించి లడ్డూ పైభాగాన్ని దేవతామూర్తుల రూపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. క్రేన్ సాయంతో లడ్డూను అత్యంత జాగ్రత్తగా ప్రత్యేక వాహనంలోకి చేర్చారు. వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, బాణసంచా కాల్పుల మధ్య గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఖైరతాబాద్ తరలించారు. లడ్డూ తరలింపు ప్రక్రియను తిలకించేందుకు పెద్దఎత్తున స్థానికులు, పరిసర గ్రామాల వారు తరలివచ్చారు. ఐదేళ్లుగా ఆనవాయితీ వినాయక చవితి వేడుకలకు ప్రసిద్ధిచెందిన ఖైరతాబాద్ గణనాథునికి 2010 నుంచి మల్లిబాబు తమ సురుచి ఫుడ్స్ సంస్థ తరఫున లడ్డూను కానుకగా సమర్పిస్తున్నారు. 2010లో 500 కిలోలు, 2011లో 2,400 కిలోలు, 2012లో 3,500 కిలోలు, 2013లో 4,200 కిలోలు, 2014లో 5,200 కిలోల లడ్డూలను మల్లిబాబు కానుకగా సమర్పించారు. గణనాథుని చేతిలో ఈ లడ్డూను ఉంచడం విశేషం. ఖైరతాబాద్ గణనాథుని మహిమతో తమ వ్యాపారం అభివృద్ధిచెందుతూ వస్తోందని ఈ సందర్భంగా మల్లిబాబు తెలిపారు. -
ఖైరతాబాద్ గణేశుడికి 5,600 కిలోల లడ్డూ
వరుసగా 5వ సారి సమర్పిస్తున్న ‘సురుచి ఫుడ్స్’ తాపేశ్వరం (మండపేట): వినాయకచవితి సందర్భంగా ప్రసిద్ధ ఖైరతాబాద్ గణనాథుని చెంత ఉంచేందుకు తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం సురుచి ఫుడ్స్‌లో 5,600 కేజీల భారీ లడ్డూ తయారుకానుంది. 2010 నుం చి ఖైరతాబాద్ గణనాథునికి ఉచితంగా లడ్డూను అందిస్తున్నామని సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబు సోమవారం తెలిపారు. లడ్డూ తయారీ నిమిత్తం సెప్టెంబర్ 9న తనతోపాటు 16 మంది సిబ్బంది గణేష్ మాలధారణ చేస్తామని, 12న లడ్డూ తయారీ ప్రారంభించి, 14కి పూర్తి చేస్తామని చెప్పారు. 15న లడ్డూకు తుదిమెరుగులు దిద్దుతామని, ప్రముఖ కళాకారుడు వీరబాబు లడ్డూ పైభాగంలో జీడిపప్పు పౌడర్‌ను ఉపయోగించి చేసిన స్వీట్ పేస్టుతో త్రిశక్తిమయ విద్యాగణపతి రూపాన్ని తీర్చిదిద్దుతారని తెలిపారు. 16న ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ పంపుతామన్నారు. లడ్డూ తయారీలో చక్కెర 2,425 కిలోలు, శనగపప్పు 1,565 కిలోలు, నెయ్యి 1,100 కిలోలు, జీడిపప్పు 380 కిలోలు, బాదంపప్పు 100, యాలకులు 33, పచ్చ కర్పూరం 11 కిలోలు ఉపయోగించనున్నట్టు తెలిపారు. -
ఖైరతాబాద్ వినాయకుడిపై పూల వర్షం కురిపిస్తాం
-
ఖైరతాబాద్ గణపతికి తాపేశ్వరం లడ్డూ
-
ఖైరతాబాద్ గణపతికి తాపేశ్వరం లడ్డూ
ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం. ఇంకెక్కడో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్. అంత దూరం నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన భారీ లడ్డును శ్రీ కైలాస విశ్వరూప మహాగణపతికి అలంకరించారు. తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు నేతృత్వంలో రూపొందిన ఈ ఐదు టన్నుల లడ్డూను ప్రత్యేకంగా హైదరాబాద్ తీసుకొచ్చి.. ఇక్కడ గణపతి చేతుల్లో అలంకరించారు. వాస్తవానికి 2010 సంవత్సరం నుంచే ఖైరతాబాద్ గణేశుడి చేతిలో నిజమైన లడ్డూ అలంకరించడం మొదలైంది. అంతకుముందు వరకు మట్టిలడ్డూ పెట్టేవారు. కానీ, 2009లో మల్లిబాబు తన కూతురితో కలిసి ఖైరతాబాద్ గణపతిని సందర్శించుకున్నప్పుడు ఆయన మూడేళ్ల కూతురు మనస్వి దేవుడి చేతిలో మట్టి లడ్డూను చూసి ‘దేవుడికి ఎవరన్నా మట్టి లడ్డూ పెడతారా..!’ అని ప్రశ్నించింది. దాంతో ఆ తర్వాతి నుంచి అసలైన లడ్డూను తాను చేసి పంపుతానని మల్లిబాబు ఉత్సవ కమిటీ పెద్దలను ఒప్పించాడు. 2010లో 600 కిలోల లడ్డూను ప్రసాదంగా సమర్పించారు. అదే విధంగా 2011లో 2400 కిలోలు, 2012లో 3500 కిలోలు, 2013లో 4200 కిలోల లడ్డూను మహా గణనాథుడికి ప్రసాదంగా సమర్పించారు. ఇదే ఆనవాయితీని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది 5000 కిలోలు (ఐదు టన్నులు) లడ్డూను సమర్పించారు. -
దేవుడికి ఎవరన్నా మట్టి లడ్డూ పెడతారా..!
దేశ వ్యాప్తంగా మహా గణపతిగా పేరుగాంచిన ఖైరతాబాద్ గణపతి చేతిలో పెట్టే లడ్డూ ప్రసాదం తయారీ ఎంతో ప్రత్యేకమే కాదు.. పవిత్రం కూడా. ఈ లడ్డూ తయారీకి ఓ చిన్నారి కారణం కావడం విశేషం. ఈ మహా ప్రసాదాన్ని సమర్పించడం 2010 నుంచే ప్రారంభమైంది. అంతకు ముందు గణనాథుడి చేతిలో కృత్రిమంగా చేసిన ప్రసాదం ఉండేది. అయితే, తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత పి.వి.వి.ఎస్.మల్లికార్జురావు (మల్లిబాబు) 2009లో కుటుంబ సమేతంగా ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు వచ్చారు. అప్పుడు ఆయన మూడేళ్ల కూతురు మనస్వి దేవుడి చేతిలో మట్టి లడ్డూను చూసి ‘దేవుడికి ఎవరన్నా మట్టి లడ్డూ పెడతారా..!’ అని ప్రశ్నించింది. ఇది మల్లిబాబులో బలంగా ముద్రపడింది. దీంతో దేవుడికి నిజమైన లడ్డూనే ప్రసాదంగా సమర్పించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్, శిల్పి రాజేంద్రన్‌ను కలిసి తన ఆలోచనను వివరించారు. వారి అనుమతితో మరుసటి ఏడు 2010లో 600 కిలోల లడ్డూను ప్రసాదంగా సమర్పించారు. అదే విధంగా 2011లో 2400 కిలోలు, 2012లో 3500 కిలోలు, 2013లో 4200 కిలోల లడ్డూను మహా గణనాథుడికి ప్రసాదంగా సమర్పించారు. ఇదే ఆనవాయితీని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది 5000 కిలోలు (ఐదు టన్నులు) లడ్డూను సమర్పించనున్నారు. ఈ ప్రసాదం తయారీని ఓ బృందం ఎంతో పవిత్రంగా చేపడతారు. అది ఎలాగంటే.. ప్రసాదం తయారీ ఇలా... యేటా మహా గణపతికి లడ్డూను ప్రసాదం తయారీకి చవితికి పది రోజుల ముందు నుంచే పనులు చేపడతారు. ముహూర్తం చేసుకుని తాపేశ్వరంలోని సురిచి ఫుడ్స్ ఆవరణలో ప్రత్యేక కుటీరాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రసాదం తయారీలో పాల్గొనే సిబ్బందితో పాటు యజమాని మల్లిబాబు కూడా వినాయక మాల ధరించి.. మిఠాయితో విఘ్న నాయకుడి విగ్రహాన్ని తయారు చేసి మండపంలో ప్రతిష్టిస్తారు. అనంతరం పప్పు దినుసులను శుభ్రం చేసి పనులు చేపడతారు. ఇలా ప్రతి సంవత్సరం చీఫ్ కుక్ మల్లి, బెంగాలీ కుక్ ఒప్పితో పాటు 11 మంది సిబ్బంది పాలు పంచుకుంటారు. వీరంతా చవితికి నాలుగు రోజుల ముందు పొయ్యి వెలిగించి తొలుత బూంది తయారు చేస్తారు. లడ్డూకు కావాల్సిన పంచదార, నెయ్యి, జీడిపప్పు, యాలకులు పచ్చ కర్పూరం సిద్ధం చేసి 9 కళాయిల్లో బూంది తీస్తుండగా.. మరో పక్క లడ్డూ చుట్టడం ప్రారంభిస్తారు. సహజ రంగులు, జీడిపప్పు పేస్టుతో లడ్డూపై వినాయకుడి ప్రతిమలను, ఇతర దేవతామూర్తులను రూపొందించి అలంకరిస్తారు. ఈ లడ్డూ సాధారణ వాతావరణంలో ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది. ప్రాణమున్నంత వరకు సమర్పిస్తా.. తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం గ్రామంలో 1939లో మా నాన్న సత్తిరాజు కాజా తయారీ ప్రారంభించారు. దాన్ని వారసత్వంగా నేను సురుచి ఫుడ్స్ ద్వారా అందజేస్తున్నాను. నేను జీవించి ఉన్నంత కాలం మహా గణపతికి లడ్డూను సమర్పించుకుంటానని ఉత్సవ కమిటీకి మాటిచ్చాను. భగవంతుడికి, భక్తుడికి మధ్య ప్రాంతీయ బేధాలు ఉండవు. ఈ సంవత్సరం మహా లడ్డూను నవరాత్రుల తర్వాత భక్తులకు పంచాలని తీసుకున్న నిర్ణయం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. - మల్లికార్జునరావు, సురుచి ఫుడ్స్ ఈ ఏడాది లడ్డూ కోసం వాడిన పదార్థాలు.. శెనగపప్పు 1450 కిలోలు నెయ్యి 1000 కిలోలు పంచదార 2250 కిలోలు బాదం పప్పు 90 కిలోలు యాలకులు 30 కిలోలు పచ్చ కర్పూరం 10 కిలోలు లడ్డూ తయారీ పనులు ఈ నెల 24న ప్రారంభించారు. ఈ లడ్డూ ఐదు టన్నుల బరువు, 6.5 అడుగుల వ్యాసం, 7.5 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనిని 28వ తేదీన ప్రత్యేక వాహనంలో నగరానికి తరలించి 29న వినాయక చవితికి మహా గణపతికి ప్రసాదంగా సమర్పిస్తారు.