ఖైరతాబాద్ గణపతికి తాపేశ్వరం లడ్డూ
ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం. ఇంకెక్కడో హైదరాబాద్లోని ఖైరతాబాద్. అంత దూరం నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన భారీ లడ్డును శ్రీ కైలాస విశ్వరూప మహాగణపతికి అలంకరించారు. తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు నేతృత్వంలో రూపొందిన ఈ ఐదు టన్నుల లడ్డూను ప్రత్యేకంగా హైదరాబాద్ తీసుకొచ్చి.. ఇక్కడ గణపతి చేతుల్లో అలంకరించారు.
వాస్తవానికి 2010 సంవత్సరం నుంచే ఖైరతాబాద్ గణేశుడి చేతిలో నిజమైన లడ్డూ అలంకరించడం మొదలైంది. అంతకుముందు వరకు మట్టిలడ్డూ పెట్టేవారు. కానీ, 2009లో మల్లిబాబు తన కూతురితో కలిసి ఖైరతాబాద్ గణపతిని సందర్శించుకున్నప్పుడు ఆయన మూడేళ్ల కూతురు మనస్వి దేవుడి చేతిలో మట్టి లడ్డూను చూసి ‘దేవుడికి ఎవరన్నా మట్టి లడ్డూ పెడతారా..!’ అని ప్రశ్నించింది. దాంతో ఆ తర్వాతి నుంచి అసలైన లడ్డూను తాను చేసి పంపుతానని మల్లిబాబు ఉత్సవ కమిటీ పెద్దలను ఒప్పించాడు. 2010లో 600 కిలోల లడ్డూను ప్రసాదంగా సమర్పించారు. అదే విధంగా 2011లో 2400 కిలోలు, 2012లో 3500 కిలోలు, 2013లో 4200 కిలోల లడ్డూను మహా గణనాథుడికి ప్రసాదంగా సమర్పించారు. ఇదే ఆనవాయితీని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది 5000 కిలోలు (ఐదు టన్నులు) లడ్డూను సమర్పించారు.