ప్రతి సంవత్సరం మన దేశంలో నిమజ్జనోత్సవాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రకరకాల వేషాల్లో వినాయకుడు సరదాగా ఉన్నాడు. లడ్డూ వేలాలు కోట్లకు చేరుకుంటు న్నాయి. ఇన్ని జరుగుతున్నా, ఇన్ని మారుతున్నా ఒక్కటి మాత్రం మారలేదు – నిమజ్జనం లాంటి సమయాల్లో పోగైన జనాల మధ్యనుంచి స్త్రీలని వేధించే పోకిరీ వేషాలు.
నిమజ్జనాలు మొదలైన మూడో రోజు అనుకుంటా. ఒక మీటింగ్ ముగించుకుని ఊబర్ బైక్‌పై ఇంటికొస్తున్నాను. ట్రాఫిక్ మెల్లగా కదుల్తోంది. మా బైక్‌కి కొంచెం ముందు ఒక చిన్న ట్రాలీ ఆటోలో ఒక బుజ్జి వినాయకుడు. క్యూట్‌గా ఉన్నాడు. వినాయకుడి విగ్రహం కంటే చుట్టూ పెట్టిన సౌండ్ సిస్టం పెద్దదిగా ఉంది. డుబ్ డుబ్ అని డీజే సౌండ్లతో మారుమోగిపొతోంది రోడ్డంతా. ట్రాలీలో ఒక పదిమందికి పైగానే కుర్రాళ్ళు ఫుల్ డాన్స్ చేస్తున్నారు. అంతా బావుంది అనుకుంటుండగా ఆ గుంపులో ఒకడు నన్ను చూసి కన్ను కొట్టాడు. అప్పటివరకూ నేనూ సరదాగా చూస్తున్న ఆ దృశ్యం వికృతంగా మారింది.
అంతటితో అయినపోలేదు. నా వైపు చూసి కన్ను కొట్టినోడు, పక్కనున్న మరొకడి చెవిలో ఏదో చెప్పడు. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఏమో గట్టిగా నవ్వుకుంటూ అప్పటిదాకా నిలబడి చూస్తున్న వీళ్లిద్దరూ డాన్స్ చేస్తున్న కుర్రాళ్లతో కలిసి అదో రకంగా స్టెప్స్ వేయడం మొదలుపెట్టారు. మామూలుగా అయితే నేను మొహం తిప్పేసుకోవడమో లేదా మొబైల్ చూసుకోవడమో చేసేదాన్ని. కానీ ఆ రోజు మాత్రం వాళ్లవైపే గుడ్లురుమి చూస్తుండిపోయాను. ఎంత కోపంగా చూస్తే అంత రెచ్చిపోతున్నారు. ట్రాఫిక్ కదలడం లేదు. కాసేపటికి నేనే తల తిప్పుకున్నాను.
ట్రాఫిక్ కొంచెం మూవ్ అయింది. మా ఊబర్ డ్రైవర్ ఒక కారు వెనక ఆగిపోయాడు. ఆ ట్రాలీ ఆటో ముందుకు వెళ్లిపోయింది. పాట మారింది. అప్పుడే మమ్మల్ని దాటుకొని ఒక స్కూటీ వెళ్లింది. ఆ స్కూటీ నడుపుతున్న అమ్మాయి మీదకి మారింది ఆ కుర్రాళ్ల చూపు. ఆ అమ్మాయిని చూసి కూడా అవే కోతలు, అవే కేకలు, అవే కుప్పి గంతులు. ఆ అమ్మాయి చున్నీ సర్దుకోవడం నాకు కనిపించింది. ఆ అమ్మాయి ఆ ట్రాలీని కూడా దాటుకొని ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్లిపోయింది. ఓయ్ ఓయ్ అని తరిమాయి ఆ పిల్లని ఈ గాలి మాటలు.
ఆ కుర్రాళ్లు ఆ రాత్రికెప్పుడో నిమజ్జనం పూర్తి చేసుకుని, ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుకుని హాయిగా నిద్రపోయుంటారు. కానీ వాళ్ల చేసిన అల్లరికి ఎంతమంది అమ్మాయిలకు ఆ రాత్రి నిద్రపట్టకుండా చేసుంటారో, వాళ్లలో ఎంత భయాందోళనలు కలుగచేసి ఉంటారో వాళ్లకి తెలిసుండదు.
ఏదో దార్లో ఆమ్మాయి కనిపిస్తే జస్ట్ విజిలేసా, అంతే అని మగాళ్లకి అనిపించవచ్చు. అదేం పెద్ద విషయం కాదని మన సినిమాలు నార్మలైజ్ చేసుండొచ్చు. కానీ ఈ రకమైన వేధింపులు స్త్రీలకు తీవ్రమైన మానసిక, శారీరక ఇబ్బందులను కలుగచేస్తాయనేది ఇప్పటికైనా అందరూ తెలుసుకోవాల్సిన విషయం.
ఇదో పెద్ద సమస్యా అని తీసిపారేసే విషయం కాదు. 2014లో న్యూయార్క్ లో సొషానా రాబర్ట్స్ అనే మహిళ 10 గంటల పాటు నడిచినప్పుడు దాదాపు 100 సార్లు ఇలాంటి వేధింపులకు గురైంది. ఆమె ఈ అనుభవాన్ని వీడియోగా చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ అయి, ప్రపంచవ్యాప్తంగా క్యాట్ కాలింగ్‌పై చర్చకు తెరలేపింది.
అంటే ఒకమ్మాయి రోడ్డు మీద గంటసేపు నడిస్తే కనీసం పదిసార్లు ఎవరో ఒకరు ఆమెను అదోలా చూడడమో, ఏదో ఒకటి అనడమో జరుగుతుంది. ఒక్కసారి ఆలోచిస్తే భయంగా లేదా?
సరే ఇది ఒక వైపైతే, నిమజ్జనం చివరి రోజు ఆ జనాల మధ్య ఎంతమంది మగాళ్లు ఆడవాళ్లని తాకరాని చోట తాకుతూ ఎంత హింసకు గురిచేస్తారో, ఈ దేశంలోని ప్రతి మహిళ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి అనుభవానికి గురయ్యే ఉంటారు. ఇది కేవలం నిమజ్జనానికి సంబంధించిన విషయం కాదు. ఎక్కడ ఎప్పుడు జనాలు గుమిగూడినా జరిగే విషయమే.
ఒక్క ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర, కేవలం వారం రోజుల్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న 285 మందిని అరెస్ట్ చేశారంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించండి.
లైంగిక వేధింపు అనేది కేవలం స్త్రీల సమస్య కాదు, ఇది మన సమాజం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య. ఈసారి ఎదురుగా వస్తున్న అమ్మాయిని చూసి ఏదైనా అనాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా అక్కడ మీ అమ్మో, అక్కో, చెల్లో ఉంటే ఏం చేస్తారు అని ఒక్కసారి ఆలోచించమని మై డియర్ మగాళ్లను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాదు ఈ సమస్య బయట వేరేవరో కాదు మీ అక్క, మీ చెల్లి కూడా ఎదుర్కొంటున్నారని ఆలోచించమంటున్నాను.
Comments
Please login to add a commentAdd a comment