ఎత్తైన విగ్రహంగా ఖైరతాబాద్ గణేషుడు
1954లో ఖైరతాబాద్‌లో మొదలైన ఉత్సవాలు
1994లో బాలాపూర్‌లో లడ్డూ ప్రసాదం వేలం ప్రక్రియ మొదలు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలంటే ప్రతి ఒక్కరికీ ఠక్కున గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఆ తర్వాత అంతే ప్రాముఖ్యత కలిగిన బాలాపూర్ లడ్డూ వేలం పాట. 1954లో తొలిసారిగా ఒక్క అడుగుతో ఖైరతాబాద్ వినాయకుడిని ప్రతిష్టించారు. ఎత్తైన గణేష్ విగ్రహం (70 అడుగులు) కూడా ఇదే. కాగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి మొదటిసారి 1994లో లడ్డూ వేలంపాట ప్రారంభించింది. తొలి వేలంపాటలో అదే ప్రాంతానికి చెందిన కొలను మోహన్‌రెడ్డి రూ.450 లడ్డూ కైవసం చేసుకున్నారు. ఆయన వరుసగా మూడు సార్లు వేలంపాటలో పాల్గొన్నారు. ఈ లడ్డూను దక్కించుకున్న వారికి మంచి జరిగిందనే ప్రచారంతో కాల క్రమంలో ప్రసాదానికి డిమాండ్ పెరిగింది. 2002 నుంచి లక్షల్లో ధర పలకడం మొదలైంది. ఒకప్పుడు కేవలం బాలాపూర్‌కు మాత్రమే పరిమితమైన ఈ లడ్డూ వేలంపాట ప్రస్తుతం ఇంతింతై అన్నట్లు గ్రేటర్ అంతా విస్తరించింది.
విగ్రహ సంస్కృతి ఇలా..
ఖైరతాబాద్ గణేషుడితో మొదలైన ఈ విగ్రహ ప్రతిష్టాపన సంస్కృతి.. క్రమంగా నగరమంతా విస్తరించింది. ప్రస్తుతం గ్రేటర్‌లో చిన్న, పెద్ద కలిపి మొత్తం రెండు లక్షలకుపైగా విగ్రహాలు నెలకొల్పినట్లు అంచనా. ఇదిలా ఉంటే రెండు మూడేళ్ల క్రితం వరకూ బాలాపూర్ లడ్డూకు మాత్రమే రికార్డు స్థాయిలో ధర పలికేది. 2023లో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్‌సిటీ రిచ్‌మండ్ విల్లాలోని గణనాథుడి చేతిలో ఉన్న లడ్డూ ప్రసాదం బాలాపూర్ లడ్డూ రికార్డును బ్రేక్ చేసింది. ఏకంగా రూ.1.25 కోట్లు పలికి భక్తులందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. నిత్యం రికార్డుల్లో నిలిచే బాలాపూర్ లడ్డూ మాత్రం గతేడాది రూ.27 లక్షలు పలికింది. ఈ యేడాదికి సంబంధించి మంగళవారం ఉదయం 8 గంటలకు నిర్వహించే వేలం పాటలో ఎంత ధర పలుకుతుందో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment