ఖైరతాబాద్ తరలిన తాపేశ్వరం లడ్డూ
తూర్పుగోదావరి: ఖైరతాబాద్ గణనాథునికి మహాలడ్డూను కానుకగా పంపించింది తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్ సంస్థ. అయిదేళ్లుగా వస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ ఏడాది సుమారు ఆరు వేల కిలోల లడ్డూను సిద్ధం చేసి బుధవారం సాయంత్రం ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ తరలించింది. సురుచి ఫుడ్స్ సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబుతోపాటు 15 మంది సంస్థ సిబ్బంది గణపతి మాలధారణతో ఐదు రోజులపాటు శ్రమించి ఈ లడ్డూను తయారుచేశారు. కాజూపేస్ట్‌ను ఉపయోగించి లడ్డూ పైభాగాన్ని దేవతామూర్తుల రూపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. క్రేన్ సాయంతో లడ్డూను అత్యంత జాగ్రత్తగా ప్రత్యేక వాహనంలోకి చేర్చారు. వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, బాణసంచా కాల్పుల మధ్య గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఖైరతాబాద్ తరలించారు. లడ్డూ తరలింపు ప్రక్రియను తిలకించేందుకు పెద్దఎత్తున స్థానికులు, పరిసర గ్రామాల వారు తరలివచ్చారు.
ఐదేళ్లుగా ఆనవాయితీ
వినాయక చవితి వేడుకలకు ప్రసిద్ధిచెందిన ఖైరతాబాద్ గణనాథునికి 2010 నుంచి మల్లిబాబు తమ సురుచి ఫుడ్స్ సంస్థ తరఫున లడ్డూను కానుకగా సమర్పిస్తున్నారు. 2010లో 500 కిలోలు, 2011లో 2,400 కిలోలు, 2012లో 3,500 కిలోలు, 2013లో 4,200 కిలోలు, 2014లో 5,200 కిలోల లడ్డూలను మల్లిబాబు కానుకగా సమర్పించారు. గణనాథుని చేతిలో ఈ లడ్డూను ఉంచడం విశేషం. ఖైరతాబాద్ గణనాథుని మహిమతో తమ వ్యాపారం అభివృద్ధిచెందుతూ వస్తోందని ఈ సందర్భంగా మల్లిబాబు తెలిపారు.