కజాన్: బ్రిక్ శిఖరాగ్ర సదస్సులో వాడీవేడీ చర్చల కోసం రష్యాలోని కజాన్ నగరంలో ల్యాండయిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఛక్–ఛక్ లడ్డూలు, కొరొవాయ్ కేకులు స్వాగతం పలికాయి. ఈ కొత్తరకం పేర్ల వంటకాలను చూసి నెటిజన్లు ఆన్‌లైన్‌లో వీటి ప్రత్యేకత గురించి తెగ వెతికేస్తున్నారు. ప్రధాని మోదీకి రష్యా స్థానిక మైనారిటీలైన టాటర్ మహిళలు తమ సంప్రదాయ వేషధారణ, వంటకాలతో స్వాగతం పలికారు. ఇందులో ప్రధానంగా ఛక్–ఛక్ లడ్డూ, కొరొవాయ్ కేకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వంటకాల్లో రష్యా సంప్రదాయ, చారిత్రక విశిష్టత దాగి ఉంది. కజాన్ నగరం ఉన్న టాటర్, బష్కిర్ ప్రాంతాల ఆహార, ఆతిథ్య సంప్రదాయాలు వీటిలో సమ్మిళితమై ఉన్నాయి.
ఏమిటీ ఛక్–ఛక్ లడ్డూ?
ఛక్–ఛక్ లడ్డూను ప్రధానంగా గోధుమ పిండితో తయారుచేస్తారు. గోధుమపిండితో చపాతీలు చేసి పెనంపై కాల్చకుండా సన్నగా నిలువుగా, అడ్డంగా చిన్నచిన్న చతురస్రాకారపు గడుల్లా కత్తిరించుకోవాలి. తర్వాత వీటిని నూనెలో బంగారం రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత బెల్లం లేదా చక్కెర పాకం తయారుచేసి అందులో కలుపుకుని గట్టిపడ్డాక లడ్డూలాగా గుండ్రంగా చేసుకోవాలి. అంతే ఛక్–ఛక్ లడ్డూ తయార్. ఛక్–ఛక్ లడ్డూ అంటే ఇక్కడి ప్రాంతవాసులకు ఎంతో ఇష్టం.
దీన్ని రుచిచూడటానికి ఇవ్వగానే మోదీ ఒకింత ఆశ్చర్యపోయారు. ఇది భారత్‌లో తయారుచేసే వంటకంలా ఉందని వ్యాఖ్యానించారు. బిహార్ వంటకం ముర్హీ కా లాయ్, పశ్చిమబెంగాల్ వంటకం మురీర్ మోవా, ఒడిశా వంటకం మువాలా ఉందని సరదాగా అన్నారు. ఛక్–ఛక్ లడ్డూ మూలాలు టాటర్‌స్థాన్, బష్‌కోర్‌టోస్థాన్‌లలో ఉన్నాయని స్థానికులు చెబతున్నారు. టాటర్‌స్థాన్‌లో ఇది జాతీయ మిఠాయిగా ప్రఖ్యాతిగాంచింది.
కొరొవాయ్ కథాకమామిషు..
మోదీ రుచిచూసిన మరో తీపి పదార్థం కొరొవాయ్ కేకు. బేకరీ వంటకమైన ఈ కొరొవాయ్ కేకు అక్కడ ప్రతి పెళ్లి వేడుకల్లో తప్పకుండా ఉండాల్సిందే. అతిథులకు వడ్డించడం కోసమే ప్రత్యేకంగా దీనిని సిద్దంచేస్తారు. తూర్పు స్లావిక్ ప్రాంతవాసులు ఈ బ్రెడ్ కేక్‌ను తయారుచేసేవాళ్లు. అదే ఇప్పుడు సంప్రదాయంగా వస్తోంది. స్లావ్ ప్రాంత ప్రజలు సూర్యుడిని పూజించేవాళ్లు. వృత్తాకార సూర్యుడికి గుర్తుగా ఈ కేకును గుండ్రంగానే తయారుచేస్తారు.
చదవండి: ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి.. అన్నివిధాలా సహకరిస్తాం: మోదీ
పెళ్లయిన జంట భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ పెళ్లిలో అందరికీ పంచిపెడతారు. కొన్ని సార్లు కేకు పిండి ముద్దలను పొడవుగా జడపాయల్లా అల్లి తర్వాత గుండ్రంగా చుట్టి బేక్ చేస్తారు. పూర్వం ఈ కేకులో ఉప్పు కాస్తంత ఎక్కువ వేసేవాళ్లు. ఉప్పు అతిథులతో బంధాన్ని మరింత బలపరుస్తుందని వారి నమ్మకం. బ్రిక్ సదస్సులో మాత్రం అతిథులకు దీనికి తోడుగా తేనెను అందిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment