ఉగాది, వినాయక చవితి, దీపావళి.. ఇలా పండుగలకు మాత్రమేనా, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెళ్లిళ్లు ఇలా ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తొచ్చేది మోతీ చూర్ లడ్డూ. అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోయే మోతిచూర్ లడ్డూ (Motichoor laddu) స్వీట్లలో ప్రధానమైంది అనడంలో సందేహమే లేదు. మరి ఈ దీపావళికి ఈజీగా , టేస్టీగా ఈ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా!
మోతీ చూర్ లడ్డూ పేరు వెనుక రహస్యం
హిందీ లో, 'మోతీ' అంటే ముత్యం అని అర్థం. 'చూర్ లేదా చుర్' అంటే చూర్ణం అని. అంటే శనగపిండి ముత్యాలు (బూందీ) తినేటపుడు మృదువుగా వెన్నలా కరిగిపోయేలా ఉండే లడ్డూ అన్నమాట.
సాధారణంగా స్వీట్స్ షాపుల్లో కృత్రిమ రంగుల్లో మోతీచూర్ లడ్డూలు దర్శనమిస్తాయి .కృత్రిమ రంగులతో ఎరుపు లేదా నారింజ, ఆకుపచ్చ రంగులతో తయారు చేస్తారు. మనం కృత్రిమ రంగులను వాడకుండా ఉండటం మంచిది. రంగుకోసం కుంకుమపువ్వును, వాసన కోసం తినే కర్పూరాన్ని వాడుకోవచ్చు.
మోతిచూర్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు:
రెండు కప్పుల సెనగపిండి
రెండు కప్పుల పంచదార
యాలకుల పొడి, బాదం ,పిస్తా, జీడిపప్పు,కిస్‌మిస్
బూందీ తయారీకి నూనె, కొద్దిగా నెయ్యి,
కర్పూరం పొడి
తయారీ:
ఒక గిన్నెలో రెండు కప్పుల సెనగపిండి తీసుకోవాలి. బాగా జల్లించుకుని ఉండలు లేకుండా పిండిని బాగా జారుగా కలుపుకోవాలి. పిండిన పైకి తీసినపుడు గరిటె నుంచి చుక్కలుగా పడేలా ఉండాలి. మంచి రంగు కావాలనుకున్నవాళ్లు ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వును నానబెట్టి కలుపుకోని పక్కన పెట్టుకోవాలి.
పంచదార పాకం
ఇపుడు మందపాటి గిన్నెలో రెండు కప్పుల పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి పాకం తయారుచేసుకోవాలి. ఈ పాకంలో కొద్దిగా యాలకుల పొడిని,కొద్దిగా ఉప్పు కలుపుకోవాలి. అలాగే పంచదార మిశ్రమాన్ని గరిటెతో కలుపుతూ , కొద్దిగా నిమ్మరసం పిండాలి. చివర్లో కర్పూరం పొడి వేసి పాకం వచ్చాక దింపి పక్కన పెట్టుకోవాలి.
బూందీ తయారీ
స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసి వేడెక్క నివ్వాలి. ఈ నూనెలో నెయ్యి వేస్తే బూందీలకు టేస్టీ ఫ్లేవర్ వస్తుంది. ఈ నూనెలో జారుగా కలుపుకున్న శనగపిండితో,బూందీ గొట్టంతోగానీ, అబకతో గానీ బూందీలా నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఈ బూందీలోని నూనె పీల్చేలా కాసేపు పేపర్ నాప్‌కిన్‌పై ఉంచాలి.
తరువాత ఈ బూందీ మిశ్రమాన్ని తయారు చేసుకున్న పాకంలో వేసి కలుపుకోవాలి. ఇందులో బాదం, జీడిపప్పు, కిస్‌మిస్ పిస్తా, మూడు చెంచాల నెయ్యి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనకు కావాల్సిన పైజులో లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి. అంతే ఎంతో ఈజీగా తయారు చేసుకునే మోతిచూర్ లడ్డూ రెడీ
నోట్ : మోతీచూర్ లడ్డూ అనేది అన్ని వయసుల వారు ఇష్టపడే రుచికరమైన వంటకం. అయితే ఈ స్వీట్‌లో చాలా నూనె పంచదార ఉంటుంది కాబట్టి, షుగర్ వ్యాధి గ్రస్తులు, కొంచెం మితంగా తిన తినండి ,రుచిని ఆస్వాదించండి.
Comments
Please login to add a commentAdd a comment