khirathabad
-
బిర్యానీ తిని బాలుడి మృతి?
సాక్షి, హైదరాబాద్: చికెన్ బిర్యానీ తెచ్చుకొని కుటుంబ సమేతంగా కలిసి భోంచేసిన ఆ కుటుంబంలో ముగ్గురు హాస్పిటల్ పాలు కాగా..ఓ బాలుడు మృతి చెందిన సంఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఖైరతాబాద్ మారుతీనగర్‌లో నివాసముండే రాంబాబు ప్రైవేటు ఉద్యోగి. ఇతనికి భార్య త్రివేణి, కుమారుడు గౌతం నంద (10), కూతరు నిహారిక ఉన్నారు. ఈ నెల 13వ తేదీ శనివారం ఖైరతాబాద్‌లో మొఘల్ రెస్టారెంట్ నుంచి రెండు సింగల్ చికెన్ బిర్యాని పార్సిల్ తీసుకొని ఇంటికి వెళ్లాడు. రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసి బిర్యాని తిని పడుకున్నారు. మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలైనా ఇంట్లోవారెవ్వరు బయటకు రాకపోవడంతో పక్కింటి వారు తలుపు తట్టి లేపారు. మత్తుగా మేల్కొన్న త్రివేణి తలుపు తీయడంతో పక్కింటి వారు వెంటనే అంబులెన్స్‌లో తండ్రితో పాటు కుమారుడు, కూతుర్ని ప్రభుత్వ హెల్త్ సెంటర్‌కు తీసుకువెళ్లారు. అప్పటికే బాబు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి, కూతుర్ని అమీర్‌పేట్ వెల్నెస్ సెంటర్‌కు తరలించి చికిత్స ఇవ్వడంతో వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. తాము 13 వ తేదీ రాత్రి బిర్యానీ తెచ్చుకుని తిని నిద్రపోయామని, ఆ తర్వాత ఏ జరిగిందో తెలియలేదని త్రివేణి పేర్కొందని, ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. (చదవండి: ప్రేమించలేదని గొంతు కోసుకున్నాడు) -
కార్గో పార్శిల్ హోం డెలివరీని ప్రారంభించిన పువ్వాడ
సాక్షి, హైదరాబాద్: కార్గో పార్శిల్ సేవలు ప్రారంభమై ఏడాది అవుతుందని రవాణా శాఖ మంత్రి అజయ్ పువ్వాడ తెలిపారు. ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్టు భవన్లో కార్గో హోం డెలివరీ సేవలను మంత్రి అంజయ్, అర్జీసీ అధికారులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కార్గో పార్శిల్ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి పన్నెండున్నర లక్షల పార్శిళ్లను చేరవేశామని పేర్కొన్నారు. పదకొండున్నర కోట్ల ఆదాయం ఇప్పటి వరకు వచ్చిందని, ఆ తర్వాత రోజు 25 లక్షల ఆదాయం వస్తుందని వివరించారు. కూకట్పల్లి, జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి హోం డెలీవరి ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. అక్యూపెన్సి కూడా పెరిగిందని, ప్రయాణికులు కూడా పాండమిక్‌ని మర్చిపోయి బస్సులను ఆదిరిస్తున్నారన్నారు. అంతరాష్ట్ర బస్సులు కూడా పూర్తిగా నడుస్తున్నాయని, కష్టకాలంలో రూ. 200 కోట్లు ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆర్టీసీని ఆదుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ మొత్తం 1200 కోట్ల రూపాయలను ఆర్టీసీకి చేయూతనిచ్చారని తెలిపారు. కార్గో ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కసారి కూడా పార్శిల్లు మిస్ కావడం కానీ డ్యామేజ్ కావడం లాంటివి జరగీలేదన్నారు. ప్రస్తుతం కార్గోలో ఎజెంట్స్ కూడా పెరిగారని, మరిన్ని సేవల కోసమే హోం డెలివరీని ప్రారంభించిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా అందిరికి ఇస్తున్నామని.. ఎక్కడ ఇబ్బంది లేదని మంత్రి చెప్పారు. -
సైకిల్‌వాలా జిందాబాద్!
సాక్షి, హైదరాబాద్: త్వరలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఖైరతాబాద్ జోన్లో ప్రత్యేక సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు కానున్నాయి. స్మార్ట్ సిటీస్ కార్యక్రమంలో భాగంగా కేంద్రం చేపట్టిన ‘ఇండియా సైకిల్ 4 చేంజ్ చాలెంజ్ (సీ4సీ చాలెంజ్)’ అమలు చర్యల్లో భాగంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. సైకిల్ ఫ్రెండ్లీ సిటీస్‌గా సీ4సీ చాలెంజ్‌కు నమోదైన 95 నగరాల్లో రాష్ట్రం నుంచి హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్‌లు కూడా ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా ప్రజల్లో సైకిల్ వినియోగాన్ని పెంచేందుకు కూడా ఈ కార్యక్రమాన్ని అనువుగా మలచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ(హుమ్టా) పూర్తి స్థాయిలో తగిన సాంకేతిక సహకారం, సలహాలు అందిస్తాయి. పైలట్ ప్రాజెక్ట్‌గా తొలుత ఖైరతాబాద్ జోన్లో అమలు చేసేందుకు హెచ్ఎండీఏ, హుమ్టా, జీహెచ్ఎంసీలు నిర్ణయించాయి. అందుకుగాను ఆ విభాగాల అధికారులతోపాటు ట్రాఫిక్ పోలీసులు సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటు తదితర అంశాలతో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. జోన్‌లోని 23 కి.మీ.ల పొడవునా(రెండు వైపులా వెరసి 46 కి.మీ.) ఏడు సైకిల్ ట్రాక్‌ల మార్గాల్ని గుర్తించారు. తొలిదశలో పది కి.మీ.ల మేర అమలు చేస్తారు. ఎదురయ్యే సాధకబాధకాలు, ప్రజల స్పందన, ఫలితాన్ని బట్టి మిగతా మార్గాల్లో ఏర్పాటు చేస్తారు. సైకిల్‌ట్రాక్‌లు అందుబాటులోకి తెచ్చే ప్రాంతాల్లో తగిన సైనేజీలు, రోడ్మార్కింగ్లు, బారికేడింగ్, ప్లగ్ ప్లే బొల్లార్డ్ వంటివి ఏర్పాటు చేస్తారు. సైక్లిస్టుల భద్రతకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు పూర్తి సహకారం అందజేస్తారు. దశలవారీగా 450 కి.మీ.ల మేర.. ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం మెట్రో రైలు స్టేషన్లు, ఆర్టీసీ బస్ టెర్మినళ్లు, డిపోలు,ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్ద అందుబాటులో ఉన్న స్థలాల్లో పబ్లిక్ బైసికిల్ షేరింగ్ డాక్స్ (పీబీఎస్) ఏర్పాటు చేస్తారు. భవిష్యత్‌లో దశలవారీగా సైబరాబాద్, హైటెక్‌సిటీ, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, చార్మినార్, మెహదీపట్నం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ నాలెడ్జ్ సెంటర్, కోకాపేట ప్రాంతాల్లో 450 కి.మీ.ల మేర సైకిల్మార్గాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో తక్కువ దూర ప్రయాణాలకు సైకిల్ ప్రయాణం మేలని, అందుకు తగిన మార్గాలు అవసరమని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. చాలెంజ్.. రెండు దశల్లో.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు సీ4సీ కార్యక్రమాన్ని రెండు దశల్లో అమలు చేస్తారు. తొలి దశలో పైలట్‌గా సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటు ప్రణాళిక, ప్రజల్లో అవగాహన కల్పించడం, వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం వంటివి ఉంటాయి. మొదటి దశకు అక్టోబర్ 14 చివరి తేదీ. దీనికి సంబంధించి 95 నగరాల నుంచి అందిన ప్రణాళికలు, అమలు, వ్యూహాలు తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని రెండో దశకు 11 నగరాలను ఎంపిక చేస్తారు. అక్టోబర్ 28 వరకు ఈ ఎంపిక పూర్తిచేస్తారు. ఎంపికైన నగరాలకు కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖ కోటి రూపాయలు చొప్పున అవార్డుగా అందజేస్తుంది. ఎంపికైన నగరాలకు జాతీయ, అంతర్జాతీయ నిపుణులు తగిన సలహాలిస్తారు. రెండో దశ సైకిల్నెట్వర్క్ కార్యక్రమం వచ్చే సంవత్సరం మే నెలాఖరు వరకు పూర్తికాగలదని భావిస్తున్నారు. -
మెట్రో రైలులో ఊడిపడిన సీలింగ్!
సాక్షి, హైదరాబాద్ : అత్యంత రద్దీగా ఉన్న ఓ మెట్రోరైలు బోగీ లోపలి భాగంలోని పైకప్పు(సీలింగ్) ఊడిపడిన సంఘటన శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్‌లో చోటు చేసుకుంది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళుతున్న మెట్రో రైలులో ప్రయాణికులు కిక్కిరిసి ఉండడంతో పలువురు పైకప్పునకు ఉన్న హ్యాండిల్‌ను పట్టుకొని నిలుచున్నారు. పరిమితికి మించి జనం దాన్ని పట్టుకోవడంతో కొంత భాగం ఊడి తమపై పడినట్లు కొందరు తెలిపారు. ఈ ఘటనతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో రైలును కొద్దిసేపు నిలిపినట్లు సమాచారం.అనంతరం రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. బోగీలోపలి భాగాలు అత్యంత తేలికైన ఫైబర్‌తో తయారు చేసినవి కావడంతో ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని తెలుస్తోంది. దీనిపై హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డిని వివరణ కోరగా..మెట్రో బోగీలో ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. -
విలువలు, విజ్ఞాన పరిరక్షణ బాధ్యత అందరిదీ: హరీశ్
ఖైరతాబాద్: భారతీయ విలువలు, విజ్ఞానం కనుమరుగు కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో జేకేఆర్ ఆస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్ 8వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం ఏర్పాటుచేసిన జాతీయ జ్యోతిష్య సదస్సును మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జ్యోతిష్యాన్ని తాను నమ్ముతానని, భూత, భవిష్యత్తులన్నింటినీ ఆ శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చన్నారు. నమ్మకం, విశ్వాసమే సమాజాన్ని నడిపిస్తాయని, ప్రభుత్వాలు చేయలేని ఏ పనైనా జ్యోతిష్యులు చేయగలరన్నారు. దీనిపై పరిశోధనలు జరగడం, వర్సిటీల ఏర్పాటు వంటివి శుభసూచకమన్నారు. జేకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎన్‌వీఆర్‌ఏ రాజా మాట్లాడుతూ నేడు వ్యాపారాత్మకమవుతున్న జ్యోతిష్య శాస్త్రాన్ని అత్యుతన్నత ప్రమాణాలతో, ధార్మిక చింతనతో ముందుకు తీసుకువెళ్లేలా తమ సంస్థ కృషిచేస్తోందన్నారు. ఇందుకు ఉచితంగా జ్యోతిష్య శాస్త్రాన్ని అందిస్తామని తెలిపారు. సాయంత్రం వర్సిటీ (ఫ్లోరిడా–యూఎస్ఏ) 11వ స్నాతకోత్సవం సందర్భంగా పీహెచ్డీ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో యోగ సంస్కృ తం వర్సిటీ చాన్స్‌లర్ బీవీకే శాస్త్రి, కిమ్స్ ఆస్పత్రి సీఎండీ భాస్కరరావు హాజరయ్యారు. జ్యోతిష్యం లో కృషిచేస్తున్న ఆకెళ్ల కృష్ణమూర్తి, సాగి కమలాకర శర్మ, కశ్యప్రభాకర్ తదితరులను సన్మానించారు. -
‘పీపుల్స్ గవర్నమెంట్‌ను తెచ్చుకుందాం’
సాక్షి, హైదరాబాద్ : పీపుల్స్ ఎజెండాతో కాంగ్రెస్ ప్రజల వద్దకు వస్తుందని.. త్వరలోనే పీపుల్స్ గవర్నమెంట్‌ను తెచ్చుకోబోతున్నామని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ శనివారం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ భట్టీ, ఏఐసీసీ కార్యదర్శులు బోస్ రాజు, సలీమ్ అహ్మద్, శ్రీనివాసన్, అంజన్ కుమార్ యాదవ్ పాదయాత్రను ప్రారంభించారు. శనివారం ఉదయం 9 గంటలకు ఖైరతాబాద్ చేరుకుని.. మహంకాళి పోచమ్మ ఆలయంలో భట్టి, ఇతర నేతలు ప్రత్యేకంగా పూజలు చేసి పాదయాత్రను మొదలు పెట్టారు. ఈ సందర్భంగా భట్టీ మాట్లాడుతూ..అమ్మవారి దయంతో ఫ్యూడల్స్‌ను తరిమికొట్టి పీపుల్స్ గవర్నమెంట్‌ను తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. ప్రజల మేలు కోరే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. -
ఖైరతాబాద్ తరలిన తాపేశ్వరం లడ్డూ
తూర్పుగోదావరి: ఖైరతాబాద్ గణనాథునికి మహాలడ్డూను కానుకగా పంపించింది తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్ సంస్థ. అయిదేళ్లుగా వస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ ఏడాది సుమారు ఆరు వేల కిలోల లడ్డూను సిద్ధం చేసి బుధవారం సాయంత్రం ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ తరలించింది. సురుచి ఫుడ్స్ సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబుతోపాటు 15 మంది సంస్థ సిబ్బంది గణపతి మాలధారణతో ఐదు రోజులపాటు శ్రమించి ఈ లడ్డూను తయారుచేశారు. కాజూపేస్ట్ను ఉపయోగించి లడ్డూ పైభాగాన్ని దేవతామూర్తుల రూపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. క్రేన్ సాయంతో లడ్డూను అత్యంత జాగ్రత్తగా ప్రత్యేక వాహనంలోకి చేర్చారు. వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, బాణసంచా కాల్పుల మధ్య గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఖైరతాబాద్ తరలించారు. లడ్డూ తరలింపు ప్రక్రియను తిలకించేందుకు పెద్దఎత్తున స్థానికులు, పరిసర గ్రామాల వారు తరలివచ్చారు. ఐదేళ్లుగా ఆనవాయితీ వినాయక చవితి వేడుకలకు ప్రసిద్ధిచెందిన ఖైరతాబాద్ గణనాథునికి 2010 నుంచి మల్లిబాబు తమ సురుచి ఫుడ్స్ సంస్థ తరఫున లడ్డూను కానుకగా సమర్పిస్తున్నారు. 2010లో 500 కిలోలు, 2011లో 2,400 కిలోలు, 2012లో 3,500 కిలోలు, 2013లో 4,200 కిలోలు, 2014లో 5,200 కిలోల లడ్డూలను మల్లిబాబు కానుకగా సమర్పించారు. గణనాథుని చేతిలో ఈ లడ్డూను ఉంచడం విశేషం. ఖైరతాబాద్ గణనాథుని మహిమతో తమ వ్యాపారం అభివృద్ధిచెందుతూ వస్తోందని ఈ సందర్భంగా మల్లిబాబు తెలిపారు.