
‘వాయిదా’ పేరుతో మోసం
రూ.65 లక్షల విలువైన టీవీల స్వాధీనం
పంజగుట్ట: నకిలీ ఐడీప్రూఫ్‌లతో ఎలక్ట్రానిక్ సంస్థల నుంచి ఖరీదైన టీవీలు వాయిదా పద్ధతిలో తీసుకుని మోసాలకు పాల్పడుతున్న నలుగురిని ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.65 లక్షల విలువైన టీవీలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలివీ ... గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సింహాద్రి సాయికిరణ్(24) వనస్థలిపురంలోని హైకోర్టు కాలనీలో ఉంటున్నాడు. అతని స్నేహితులు ఆర్టీఏ ఏజెంట్ వి.యాదగిరి(32), ప్లంబర్ మహ్మద్ అబ్దుల్ వాసీ (46), కాదరి నాగభూషణం(36)తో కలిసి మోసాలను వృత్తిగా ఎంచుకున్నారు. ఎల్‌బీ నగర్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఆపరేటర్‌గా పనిచేసే నరేష్ సాయంతో వివిధ ఐడీ ప్రూఫ్‌లు సంపాదించారు. నకిలీ ఐడీప్రూఫ్‌లు, తప్పుడు చిరునామాలతో నగరంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూంలలో వాయిదా పద్దతిలో ఖరీదైన ఎల్‌ఈడీ టీవీలు తీసుకునేవారు.
రిలయన్స్ డిజిటల్‌లో పనిచేసే సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు మహేష్, రాహుల్, బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో మేనేజర్లు వెంకటనారాయణ, హేమంత్ కుమార్, ఆటోట్రాలీ డ్రైవర్లు అశోక్, ఆరోగ్యంలు వీరికి సహకరిస్తున్నారు. వీరు టీవీలు తీసుకోగానే బజాజ్ ఎలక్ట్రానిక్స్ మేనేజర్లు వెంకటనారాయణ, హేమంత్ కుమార్‌లు 60 శాతం డబ్బులు చెల్లించి... తిరిగి వారే టీవీలు తీసుకుని ఇతరులకు అమ్ముకుంటున్నారు. సంబంధిత సంస్థల ప్రతినిధుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిఘావేశారు. ఖైరతాబాద్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న సాయి కిరణ్, యాదగిరి, అబ్దుల్ వాసీ, నాగభూషణంలను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు... వారిని విచారించగా దొంగతనాల చిట్టావిప్పారు. నిందితులను అరెస్టుచేసి వారి నుంచి వివిధ కంపెనీలకు చెందిన టీవీలను స్వాధీనం చేసుకుని పంజగుట్ట పోలీసులకు అప్పగించారు.