
పక్కింటి మహిళే కిడ్నాప్ సూత్రధారి?
ఆడుకోడానికి వెళ్లిన ఏడేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యి రెండు రోజులు అవుతున్నా, ఇంతవరకు అతడి ఆచూకీ తెలియలేదు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యనగర్లో ఉండే నరసింహా దంపతుల కొడుకు నవీన్ (7) కుంట్లూరులో రెండో తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం తన ఇంటి ముందు ఆడుకుంటున్న నవీన్ను గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి అపహరించుకుపోయారు. నల్లటి శాంత్రోకారులో వచ్చిన దుండగులు అతడిని అపహరించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే, పక్కింటి మహిళే కోపంతో తమ పిల్లాడిని కిడ్నాప్ చేయించి ఉంటుందని బాలుడి బంధువులు అనుమానిస్తున్నారు.
మంగళవారం నాడు వాళ్ల అబ్బాయి, నవీన్ ఇద్దరూ అడుకోడానికి బయటకు వెళ్లారని, కానీ కొద్ది సేపటి తర్వాత ఆ అబ్బాయి ఒక్కడే వచ్చాడని.. నవీన్ ఎంతసేపటికీ రాకపోవడంతో ఎక్కడున్నాడని అడిగితే అసలు విషయం తెలిసిందని తప్పిపోయిన నవీన్ బాబాయ్ శంకర్ 'సాక్షి'కి చెప్పారు. ఆమె మీదే తమకు అనుమానం ఉందని మరోసారి ఆయన తెలిపారు. ఇద్దరు వ్యక్తులు నల్లటి కారులో వచ్చి నవీన్ను ఎక్కించుకుని వెళ్లిపోయారని అతడితో పాటు ఉన్న మరో బాలుడు చెప్పాడు. దీనిపై తాము అతడి తల్లిని అడిగితే, తనకేం తెలియదని, తననెందుకు అడుగుతారని దబాయిస్తోందని నవీన్ బాబాయ్ శంకర్ చెప్పారు. తనకు పోలీసులు తెలుసని, ఏమైనా చేసుకోండని అంటోందన్నారు.
తమకు కచ్చితంగా ఆమె మీదనే అనుమానం ఉందని ఆయన అంటున్నారు. తొలుత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కూడా ఆమె మీద అనుమానం వ్యక్తం చేశారు. ఆమె ప్రవర్తన బాగోలేదని, అందువల్ల ఆమెతో ఇల్లు ఖాళీ చేయించాలని యజమానులకు చెప్పడం వల్ల కోపంతోనే తమ అన్న కొడుకును ఆమె కిడ్నాప్ చేయించి ఉంటుందని శంకర్ అనుమానం వ్యక్తం చేశారు. అయితే అటు కేసు విచారిస్తున్న పోలీసులకు గానీ, నవీన్ తల్లిదండ్రులకు గానీ ఇంతవరకు నవీన్ గురించి ఎలాంటి సమాచారం అందలేదు.