
పాపం ఎల్లమ్మ..
♦ అన్నకు రాఖీ కట్టడానికి వచ్చి తప్పిపోయిన 95 ఏళ్ల వృద్ధురాలు
♦ ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
♦ స్థానికుల సాయంతో కుటుంబ సభ్యుల వద్దకు...
హైదరాబాద్: 95 ఏళ్ల పండు ముసలి. అన్నపై ఉన్న మమకారంతో హైదరాబాద్‌కు వచ్చి రాఖీ కట్టి ప్రేమను పంచింది. ఇంతలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటకు వచ్చి తప్పిపోయింది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. చివరకు బుధవారం స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ఆమెను క్షేమంగా అప్పగిం చారు. జనగాం సమీపంలోని కంచెన్‌పల్లికి చెందిన ఎల్లమ్మ.. యాప్రాల్‌లో ఉండే కొడుకు సంజీవ్‌ను తీసుకుని, ముషీరాబాద్‌లోని ఇందిరానగర్‌లో ఉండే రాములుకు రాఖీ కట్టడానికి ఈ నెల 7న వచ్చింది. రాఖీ కట్టిన అనంతరం కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటి నుండి బయటకు వచ్చింది.
అయితే తిరిగి ఇంటిని గుర్తు పట్టక ఎటో వెళ్లిపోయింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో సంజీవ్ ముషీరా బాద్, చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లతో పాటు మరో 3 పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు చేశాడు. రెండు రోజులు ఆగండి.. ఆమె దొరుకుతుందని, లేకుంటే అప్పుడు రండి.. అంటూ పోలీసులు ఫిర్యాదును స్వీకరించలేదు. తప్పిపోయిన ఎల్లమ్మ మంగళవారం రాంనగర్‌లోని ఎస్‌బీఐ సమీపంలో ఉండగా, స్థానిక స్కూటర్ రిపేర్ షాపు అతను బీట్ కానిస్టేబుళ్లకు సమాచారం అందించాడు.
వారు వచ్చి స్టేషన్‌కు తీసుకెళ్లకుండా రూ.50 చేతిలో పెట్టి ఆటో ఎక్కించి రైల్వేస్టేషన్‌కు వెళ్లి రైలు ఎక్కి ఇంటికి వెళ్లాలని సలహా ఇచ్చారు. అయితే రైలు ఎక్కబోతూ కిందపడిన ఆమెను కొందరు గమనించి కాపాడారు. ఆమె మళ్లీ నడుచుకుంటూ రాంనగర్‌లోని మీ సేవా వద్ద గల ఓ హోటల్ వద్దకు చేరుకుంది. ఆ హోటల్‌కు వచ్చిన వారు ఆమెను ఆరా తీయగా తప్పిపోయానని చెప్పింది. దీంతో పక్కనే ఉన్న సంఘ సేవకుడు శ్రీనునాయుడు ఆమె ఊరి అడ్రస్‌ను, ఫోన్ నంబర్‌ను తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అం దించాడు. సంజీవ్ వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. పాపం వృద్ధురాలు.. రెండు రోజుల పాటు తిండిలేక.. వర్షంలో తడిసి నీరసించి పోయింది.