స్టార్టప్‌లకు మంచి కాలమిది | A good time to Startup | Sakshi
Sakshi News home page

స్టార్టప్‌లకు మంచి కాలమిది

Published Sat, Oct 8 2016 2:30 AM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM

స్టార్టప్‌లకు మంచి కాలమిది

స్టార్టప్‌లకు మంచి కాలమిది

- శాంతా బయోటెక్ అధ్యక్షుడు వరప్రసాదరెడ్డి
- ఔత్సాహికులు అందిపుచ్చుకోవాలని సూచన
- సీసీఎంబీ ఆధ్వర్యంలో ‘ఐహబ్’ ప్రారంభం
 
 సాక్షి, హైదరాబాద్: దేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, యువత వాటిని అందిపుచ్చుకుని సమాజానికి మేలు చేసే వినూత్న ప్రాజెక్టులు చేపట్టాలని శాంతా బయోటెక్ కంపెనీ అధ్యక్షుడు డాక్టర్ వరప్రసాదరెడ్డి సూచించారు. 1992 ప్రాంతంలో తాను దేశంలోనే తొలి బయోటెక్ ఆధారిత వ్యాక్సిన్ తయారీ కంపెనీని ఏర్పాటు చేసేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని, అప్పటితో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందని ఆయన అన్నారు. శుక్రవారం సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సంస్థ బయోమెడికల్, బయో ఇన్ఫర్మేటిక్స్ రంగాల్లో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు సీసీఎంబీ ‘ఐహబ్’ పేరుతో ఓ కేంద్రాన్ని ప్రారంభించింది.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ హెపటైటిస్ బీ వ్యాక్సిన్‌ను భారతీయులు తయారు చేయలేరని, ఒకవేళ తాము టెక్నాలజీ అందించినా దానిని అందిపుచ్చుకునేందుకు భారత శాస్త్రవేత్తలకు రెండు దశాబ్దాల కాలం పడుతుందన్న పాశ్చాత్య దేశాల రెచ్చగొట్టే వ్యాఖ్యలే తనను శాంతా బయోటెక్ కంపెనీ ఏర్పాటుకు పురికొల్పాయని తెలిపారు. చదివింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయినప్పటికీ ప్రభుత్వాలు సహకరించకున్నా తాను పట్టుదలతో కంపెనీని స్థాపించి ముందుకు నడిపించగలిగానని తెలిపారు. ఈ క్రమంలో సీసీఎంబీ తమ కంపెనీ ఆవిర్భావానికి, పరిశోధనలకు ఎంతో సహకరించిందని కొనియాడారు. తన దృష్టిలో ఐటీ రంగంవైపునకు మళ్లుతున్న యువత బాలకార్మికుల కిందే లెక్క అని, సొంతంగా సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను తయారు చేయడం మానేసి... ఇతర దేశాల కంపెనీలు మేధోహక్కులు సంపాదించుకునేందుకు వీరందరూ సహకరిస్తున్నారని అన్నారు.

 ఐహబ్‌తో ఐడియాలకు ఉత్పత్తిరూపం..  
 సీసీఎంబీ ఆధ్వర్యంలో నడిచే ఐహబ్‌లో స్టార్టప్‌లను ఏర్పాటు చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారని సంస్థ డెరైక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. సీసీఎంబీలో పురుడు పోసుకునే ఆలోచనలతోపాటు బయటి వారి ఐడియాలనూ వీలైనంత వేగంగా ఉత్పత్తులుగా మార్చడం ఐహబ్ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. వైద్య, వ్యవసాయ రంగాలతోపాటు బయో ఇన్ఫర్మేటిక్స్ రంగాల్లోని స్టార్టప్‌లు తమ కేంద్రంలోని యంత్రాలు, పరికరాలను వాడుకుని తమ ఆలోచనలను సాకారం చేసుకునే వీలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీహబ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రమా అయ్యర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement