మత్తయ్యకు ఏసీబీ నోటీసులు | ACB notices to mattayya | Sakshi
Sakshi News home page

మత్తయ్యకు ఏసీబీ నోటీసులు

Published Sun, Feb 14 2016 2:26 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

మత్తయ్యకు ఏసీబీ నోటీసులు - Sakshi

మత్తయ్యకు ఏసీబీ నోటీసులు

♦ ‘ఓటుకు కోట్లు’ కేసులో కదలిక
♦ వారం రోజుల్లోగా విచారణకు హాజరుకావాలని ఆదేశం
♦ తనకు నోటీసులివ్వడం కోర్టు ధిక్కరణే అంటున్న మత్తయ్య
♦ త్వరలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కూ నోటీసులు!
 
 సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ‘ఓటుకు కోట్లు’ కేసులో కదలిక వచ్చింది. గతేడాది ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తమ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు లంచం ఇవ్వజూపిన విషయం తెలిసిందే. అందులో భాగం గా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సహా పలువురు రెడ్‌హ్యాండెడ్‌గా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి పట్టుబడ్డారు. తాజాగా ఈ కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్యకు ఏసీబీ నోటీసులు జారీచేసింది. హైదరాబాద్‌లో ఉప్పల్‌లోని మత్తయ్య ఇంటికి శనివారం ఏసీబీ అధికారులు వెళ్లి స్వయంగా నోటీసులు అందజేశారు. వారంలోగా ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5లోపు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

 మత్తయ్య హాజరుపై సస్పెన్స్..
 ‘ఓటుకు కోట్లు’ కేసులో మత్తయ్య వ్యవహారశైలి కీలకంగా మారనుంది. ఈ కేసులో ఇప్పటివరకు పదుల సంఖ్యలో అనుమానితులను విచారించిన ఏసీబీ... ఏ-4 నిందితుడిగా ఉన్న మత్తయ్యను మాత్రం విచారించలేకపోయింది. అసలు ‘ఓటుకు కోట్లు’ కుట్ర వెలుగు చూసిన క్షణం నుంచి మత్తయ్య కనిపించకుండా పోయారు. ఏసీబీ తనను అరెస్టు చేయకుండా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. అయితే కేసు దర్యాప్తులో భాగంగా మత్తయ్యను విచారించాలని ఏసీబీ భావిస్తోంది. ఈ మేరకు సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు మత్తయ్యను అరెస్టు చేయబోమని కూడా నోటీసులో పేర్కొంది. కానీ మత్తయ్య మాత్రం తనకు ఏసీబీ నోటీసులు జారీ చేయడాన్ని తప్పుబడుతున్నారు. కేసులో తదుపరి చర్యలన్నింటిపైనా న్యాయస్థానం స్టే విధించిందని, అలాంటప్పు డు నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై తాను మరోసారి కోర్టును ఆశ్రయిస్తానన్నారు. ఏసీబీ అధికారులు మాత్రం   అరెస్టుపై మాత్రమే స్టే ఉందని, విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.

 మాగంటి గోపీనాథ్ పాత్రపై ఆరా..
 ‘ఓటుకు కోట్లు’ కేసు కుట్రలో జూబ్లీహిల్స్ టీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రమేయమున్నట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. మాగంటి ప్రధాన అనుచరుడైన ప్రదీప్ చౌదరిని ఏసీబీ ఇంతకుముందే పలుమార్లు విచారించగా పలు కీలక విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. గతేడాది మే 29, 30 తేదీల్లో రేవంత్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, ప్రదీప్ చౌదరిల మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయి. కాల్‌డేటా ఆధారంగా ప్రదీప్‌ను ప్రశ్నించినప్పుడు డబ్బుకు సంబంధించి పలు కీలక వివరాలు వెల్లడించినట్లు తెలిసింది. దానికి అనుగుణంగా మాగంటిని కూడా కేసులో నిందితుల జాబితాలో చేర్చాలని ఏసీబీ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. మొదటగా ఆయనకు సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద నోటీసులిచ్చి విచారణకు పిలవాలని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత తదుపరి కార్యచరణపై దృష్టిసారించనున్నారు.
 
 నన్ను ఒంటరిని చేశారు

 ‘ఓటుకు కోట్లు’ కేసు లో తనను ఒంటరిని చేశారని ఏ-4 నిం దితుడు జెరూసలెం మత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియా తో మాట్లాడారు. ఏసీబీ నోటీసులు అందిన వెంటనే టీడీపీ కార్యాలయానికి వెళితే ఎవరూ తనను పట్టించుకోలేదని చెప్పారు. నాయకత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా స్పందించడంలేదన్నారు. అరెస్టుపై స్టే ఇప్పించిన అడ్వొకేట్ల దగ్గరికి వెళ్లినా చేదు అనుభవమే ఎదురైందని... మరోసారి తమ వద్దకు రావద్దని, ఫోన్లు కూడా చేయవద్దని చెబుతున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement