బెట్టు సడలించి.. మెట్టు దిగి
- నేటి నుంచి విధుల్లోకి న్యాయాధికారులు
- సస్పెన్షన్లపై తుది నిర్ణయం ఏసీజే కమిటీదే
- సమ్మె విరమించిన న్యాయశాఖ ఉద్యోగులు
- సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ
- నేటి నుంచి కోర్టుల్లో కార్యకలాపాలు యథాతథం
- న్యాయవాదుల ఆందోళనలపై నేడు ప్రకటన!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ న్యాయాధికారులు బెట్టు సడలించారు. మెట్టు దిగొచ్చి విధుల్లో చేరేందుకు నిర్ణయించారు. సెలవులకు ఫుల్‌స్టాప్ పెట్టి గురువారం నుంచే విధుల్లో చేరుతామని ప్రకటించారు. 11 మంది న్యాయాధికారులపై హైకోర్టు విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తేనే విధుల్లో చేరుతామని వారు తొలుత ప్రకటించినా, తరవాత మనసు మార్చుకున్నారు. బేషరతుగా విధుల్లో చేరాల్సిందేనని హైకోర్టు నుంచి స్పష్టమైన సంకేతాలు అందడంతో తీవ్ర తర్జనభర్జనల అనంతరం, సస్పెన్షన్ ఎత్తివేత షరతు లేకుండానే విధుల్లో చేరేందుకు నిర్ణయించారు. తమ సమస్యల పరిష్కారానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హామీ, గవర్నర్ చొరవ, కక్షిదారులకు ఇబ్బందులు కలిగించవద్దన్న హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) ప్రకటనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంఘం నేతలు తెలిపారు.
సమస్యలు తప్పక పరిష్కారమవుతాయన్న నమ్మకం తమకుందని, సస్పెన్షన్ల ఎత్తివేతను పరిశీలిస్తామని ఏసీజే చెప్పారని, ఈ నేపథ్యంలో సెలవుల్లో కొనసాగడం సరికాదన్న అభిప్రాయం తమ సమావేశంలో వ్యక్తం కావడంతో విధుల్లో చేరికకు నిర్ణయించామని వివరించారు. విధులకు హాజరవని కాలాన్ని సెలవులుగా పరిగణించాలని, తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేసినట్లు వారు తెలిపారు.
దీంతో 9 రోజులుగా కొనసాగుతున్న న్యాయాధికారుల నిరసనలకు తెరపడినట్లయింది. న్యాయవాదులు ఆందోళనలను ఇంకా కొనసాగిస్తారా, లేదా అన్నదానిపై స్పష్టత రాలేదు. తదుపరి కార్యాచరణపై వారు బుధవారం ప్రకటన విడుదల చేసే అవకాశముంది. శెట్టి కమిషన్ సిఫారసుల అమలు కోసం సమ్మెకు దిగిన న్యాయశాఖ ఉద్యోగులు కూడా సమ్మెను విరమించినట్లు ప్రకటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో తమ చర్చలు ఫలించినట్లు సంఘం నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో కింది కోర్టులన్నీ బుధవారం నుంచి యథావిధిగా పనిచేయనున్నాయి.
ఉలిక్కిపడ్డ న్యాయవ్యవస్థ
న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపు జాబితాపై నిరసనలు ప్రారంభించిన తెలంగాణ న్యాయాధికారులకు న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు కూడా జత కలిసి వివిధ కార్యక్రమాలు చేపట్టారు. న్యాయాధికారులు గవర్నర్, ఏసీజేలను స్వయంగా కలిశారు. జూన్ 26న ఏకంగా రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. 120 మందికి పైగా న్యాయాధికారులు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. రాజ్‌భవన్‌కు ప్రదర్శనగా వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. వారిలా రోడ్డెక్కి నిరసనలు తెలియచేయడం న్యాయవ్యవస్థ చరిత్రలో అదే మొదటిసారి! దీన్ని క్రమశిక్షణారాహిత్యం, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణించిన హైకోర్టు 11 మంది న్యాయాధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.
సమ్మెకు దిగిన న్యాయశాఖ ఉద్యోగుల్లో 11 మందిని కూడా సస్పెండ్ చేసింది. న్యాయాధికారుల్లో అత్యధికులు మూకుమ్మడి సెలవులపై వెళ్లి హైకోర్టుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. దాంతో కింది కోర్టుల్లో కేసుల విచారణకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. న్యాయ శాఖ ఉద్యోగులు కూడా సమ్మెకు దిగడంతో కోర్టుల్లో తాళాలు తేరిచేవారు కూడా లేకుండాపోయారు. న్యాయవాదుల జేఏసీ బృందం వేర్వేరుగా సీజేఐ జస్టిస్ ఠాకూర్‌ను కలిశారు. న్యాయాధికారుల కేటాయింపు జాబితా సమస్యను పరిష్కరిస్తారని ఆయన హామీ ఇవ్వడంతో నిరసనలు, ఆందోళనల తీవ్రత బాగా తగ్గింది. తరువాత ఏసీజే, మిగతా హైకోర్టు న్యాయమూర్తులు జూలై 1న ప్రకటన విడుదల చేశారు. కక్షిదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నందున వెం టనే విధుల్లో చేరాలని సూచించారు. లేదంటే ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తామన్నారు.
గవర్నర్ చొరవ...
సస్పెన్షన్లు ఎత్తివేస్తే తప్ప విధులకు హాజరయ్యేది లేదని న్యాయాధికారులు, న్యాయవాదులు, ఉద్యోగులు తేల్చి చెప్పడంతో గవర్నర్ నరసింహన్ స్వయంగా చొరవ తీసుకుని న్యాయాధికారులను సోమవారం పిలిపించుకుని మాట్లాడారు. వెంటనే విధుల్లోకి చేరాలని స్పష్టం చేశారు. సీజేఐ, ఏసీజే ప్రకటన, గవర్నర్ చొరవతో వారు మెత్తబడ్డారు. గవర్నర్ సూచన మేరకు సోమవారం రాత్రి న్యాయాధికారుల బృందం ఏసీజే వద్దకు వెళ్లి న్యాయాధికారుల సస్పెన్షన్ వ్యవహారంపై చర్చించింది. సస్పెన్షన్లను ఎత్తివేయాలని కోరగా ఏసీజే హామీ ఇవ్వలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పలు అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. అన్ని విషయాలు తాను చూసుకుంటానని, బేషరతుగా విధుల్లో చేరాల్సిందేనని ఏసీజే వారికి తేల్చి చెప్పారు. న్యాయాధికారులు రోడ్డెక్కడాన్ని హైకోర్టు తీవ్ర క్రమశిక్షణరాహిత్యంగా భావిస్తున్నందునే ఏసీజే హామీ ఇవ్వలేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. దాంతో న్యాయాధికారులు మంగళవారం ఉదయం అత్యవసరంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. విధుల్లో చేరాలని తీర్మానించారు.