అధునాతన జంతు వధశాలలకు రూ.50 కోట్లు | Advanced Animal vadhasalalaku Rs 50 crore | Sakshi
Sakshi News home page

అధునాతన జంతు వధశాలలకు రూ.50 కోట్లు

Published Sat, Mar 1 2014 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM

Advanced Animal vadhasalalaku Rs 50 crore

సాక్షి, సిటీబ్యూరో: అపరిశుభ్రతకు తావులేని, ఆరోగ్యకరమైన మాంసం అమ్మకానికి అధునాతన జంతువధశాలలు అనివార్యమని, అదే సమయంలో స్థానిక రిటైల్ వ్యాపారుల ఉపాధికి ఢోకా లేకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జీహెచ్‌ఎంసీ మేయర్ మహ్మద్ మాజిద్ హుస్సేన్ అన్నారు. నేషనల్ మీట్‌అండ్ పౌల్ట్రీ ప్రాసెసింగ్‌బోర్డు (ఎన్‌ఎంపీపీ బీ), జీహెచ్‌ఎంసీల ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడి ఒక స్టార్‌హోటల్‌లో జరిగిన ఏడో మేయర్ల సదస్సును ఆయన ప్రారంభించారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ, ఈ రంగానికి తగిన  ప్రాధాన్యతనిచ్చి జీహెచ్‌ఎంసీ  బడ్జెట్‌లో రూ. 50 కోట్లు అధునాతన వధశాలలు, తదితర సదుపాయాల కోసం కేటాయించామన్నారు.  అంబర్‌పేట, న్యూబోయిగూడ, రామ్నాస్‌పురా, గౌలిగుడాలలో స్లాటర్‌హౌస్‌ల  ఆధునికీకరణ పనలకు రూ. 15 కోట్లు మంజూరు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

పెండింగ్‌లో ఉన్న జియాగూడ స్లాటర్‌హౌస్‌కు కూడా తగిన నిధులు కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఫుడ్‌ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ సెక్రటరీ సిరాజ్‌హుస్సేన్ మాట్లాడుతూ, రహదారులు,పార్కులు, మునిసిపల్ మార్కెట్లు, ఆటస్థలాలు,  విద్యాసంస్థలకు తగు ప్రాధాన్యతనిస్తున్న మునిసిపాలిటీలు  ఆధునిక జంతువధ శాలల ఏర్పాటును పట్టించుకోవడంలేదన్నారు. దేశంలో ఢిల్లీ, కర్నాటక, హైదరాబాద్, ఈశాన్య రాష్ట్రాలు మాత్రమే ఈ అంశంపై దృష్టి సారించాయంటూ, ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న ఈ అంశంపై అన్ని  స్థానిక సంస్థలు శ్రద్ధ చూపాల్సి ఉందన్నారు.

రాష్ట్ర పశుసంవర్థకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.మన్మోహన్‌సింగ్ మాట్లాడుతూ,  ఆయా వ్యాధులు సోకకుండా  దక్షిణాది రాష్ట్రాల్లోని పశువులన్నింటికీ ఒకేరోజు  వ్యాక్సిన్ వేస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.దేశంలోనే ఏకకాలంలో ఐదు అధునాతన పశువధశాలలు ఏర్పాటు చేస్తున్న ఏకైక నగరం ైెహ దరాబాద్ అన్నారు. ఈ గవర్నెన్స్‌తోపాటు హైజీన్ గవర్నెన్స్ కూడా అవసరమని  మునిసిపల్ పరిపాలన శాఖ కమిషనర్, డెరైక్టర్ బి.జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో  ‘నేషనల్ రీసెర్చి సెంటర్ ఆన్ మీట్’ డెరైక్టర్ వీవీ కులకర్ణి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ జేసీ అనురాధప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో భాగంగా ‘గ్రీనింగ్ ఆఫ్ మీట్ అండ్ పౌల్ట్రీ ప్రాసెసింగ్ సెక్టార్ ఇన్ ఇండియా’ అనే అంశంపై రూపొందించిన నివేదికను ఆవిష్కరించారు. ఎన్‌ఎంపీపీబీతో శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ(తిరుపతి), నేషనల్ రీసెర్చి సెంటర్ ఆన్ మీట్‌లు ఒప్పందం కుదుర్చుకున్నాయి.  పేరుకు మేయర్ల సదస్సు అని పేర్కొన్నప్పటికీ, స్థానిక మేయర్ తప్ప మరే ఇతర నగర మేయర్ సదస్సుకు హాజరు కాకపోవడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement