retail traders
-
3 నెలల కనిష్టానికి పసిడి
అంతర్జాతీయ ప్రభావం న్యూయార్క్/న్యూఢిల్లీ: పసిడి ధర పడిపోతోంది. ఢిల్లీలో మూడు నెలల కనిష్ట స్థాయికి దిగింది. అంతర్జాతీయ అంశాలు దీనికి ప్రధాన కారణం. దీపావళి నేపథ్యంలో... ఆభరణాలు, రిటైల్ వర్తకుల కొనుగోళ్లు మందగించడం కూడా దీనికి కారణం. ఢిల్లీలో 10 గ్రాములకు 24, 22 క్యారెట్ల ధరలు క్రితంతో పోల్చితే రూ.300 తగ్గి రూ.25,950, రూ.25,800 చొప్పున నమోదయ్యాయి. వెండి సైతం ఇదే ధోరణిలో కేజీకి రూ.500 తగ్గి రూ.34,400గా ఉంది. అంతర్జాతీయ బలహీన ధోరణి... న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (కామెక్స్)లో ఔన్స్ (31.1గ్రా) గురువారం ముగింపు 1,084 డాలర్లు. ఒక దశలో 1,074 డాలర్లకు సైతం పడిపోయింది. ఇది ఐదేళ్ల కనిష్ట స్థాయి. అంటే 2010 ఫిబ్రవరి తరువాత ఈ స్థాయికి అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పతనం ఇదే తొలిసారి. ‘ఫెడ్’ ఎఫెక్ట్! అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటును ప్రస్తుత జీరో స్థాయి నుంచి పెంచే అవకాశం ఉందన్న వార్త ప్రధానంగా పసిడి ఫ్యూచర్స్ మార్కెట్‌పై పడుతోంది. ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున బులి యన్ ఆధారిత ఫండ్లను విక్రయించి సొమ్ము చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. గురువారం వరకూ జరిగిన 12 ట్రేడింగ్ దినాల్లో 11 రోజులు ఈ మెటల్ నష్టాలను ఎదుర్కొంటూ వస్తోంది. శుక్రవారం తొలి సమాచారం అందే సరికి మాత్రం అతి స్వల్ప స్థాయి లాభాల్లో ట్రేడవుతోంది. భారత్ ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా ఇదే ధోరణి కనబడుతోంది. దేశంలో టారిఫ్ విలువ కోత అంతర్జాతీయంగా ధర భారీగా తగ్గిన నేపథ్యంలో... పసిడి. వెండి దిగుమతుల టారిఫ్ విలువలను కేంద్రం తగ్గించింది. ఇప్పటి వరకూ 10 గ్రాములకు 373 డాలర్లుగా ఉన్న దిగుమతి టారిఫ్ విలువను 354 డాలర్లకు తగ్గించింది. వెండి (కేజీ) టారిఫ్ విలువను కూడా 517 డాలర్ల నుంచి 470కి తగ్గించింది. అంటే బంగారం టారిఫ్ విలువ 5 శాతంపైగా తగ్గగా, వెండి టారిఫ్ విలువ 9 శాతంపైగా పడింది. ఈ మేరకు కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు (సీబీఈసీ) ఒక ప్రకటన చేసింది. మెటల్స్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధింపునకు ఈ టారిఫ్ విలువ(బేస్ ధర)ను సీబీఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది. టారిఫ్ విలువలో 5% మార్పు ఉంటే ఆ ప్రభావం స్పాట్ బులియన్ మార్కెట్‌పై ఉంటుంది. తాజా నిర్ణయం స్పాట్ మార్కెట్లో పసిడి విలువ మరింత తగ్గడానికి దారితీసే అంశమే. -
‘రిటైల్’ దోపిడీ!
సాక్షి, హైదరాబాద్ : ‘అప్పు చేసి పప్పుకూడు తినరా.. ఓ నరుడా..’ అని ఓ సినీ కవి ఎప్పుడో వక్కాణించారు. పప్పన్నం తినాలంటే అప్పు చేయాల్సి వస్తుందని ఆయన ముందుగా ఊహించారేమో..! ప్రస్తుత పరిస్థితి సరిగ్గా అందుకు తగ్గట్టుగానే ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కందిపప్పు ధర రూ.210కి చేరిందన్న వార్తలతో బుధవారం నగరంలో రిటైల్ వ్యాపారులు పప్పుల ధరల్ని అమాంతం పెంచేశారు. ఫస్ట్, సెకెండ్, థర్డ్ క్వాలిటీల పేరుతో విభజించి ఇష్టారీతిన ధరలు నిర్ణయించారు. నాణ్యమై న కందిపప్పు కిలో రూ. 210లు, రెండోరకం రూ. 200, మూడో రకం పప్పు రూ.190ల ప్రకారం వసూలు చేస్తున్నారు. అయితే... ఇక్కడొక మతలబు ఉంది. కొందరు రేషన్ షాపు డీలర్లు కందిపప్పును కేజీ రూ.80-100ల ప్రకారం గుట్టుగా రిటైల్ వ్యాపారులకు చేరవేస్తుండటంతో వాటిని నాణ్యమైన పప్పులో కలిపి విక్రయిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు వ్యాపారులు 2 క్వింటాళ్ల గ్రేడ్-1 రకం కందిపప్పులో 1 క్వింటాల్ గ్రేడ్-2 పప్పును కలిపి బెస్ట్క్వాలిటీ పేరుతో విక్రయిస్తున్నట్లు సమాచారం. నిజంగా పప్పుల ధరల విషయంలో నగరవాసులను నిలువుగా దోచుకుంటున్నది మాత్రం రిటైల్ వర్తకులే. నగర మార్కెట్లో బుధవారం కందిపప్పు ధర రూ.210లకు చేరుకోవడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ధరల్లో భారీ తేడా పప్పుల్లో రారాజైన కందిపప్పు..ధర విషయంలో కూడా తన హవాను కొనసాగిస్తుండగా... మిగతా పప్పుల ధరలు కూడా కాస్త అటూ ఇటుగా దీన్నే అనుసరిస్తున్నాయి. సాధారణంగా హోల్‌సేల్ ధరకు రిటైల్ ధరకు మధ్య తేడా రూ.3 నుంచి రూ.4 కు మించదు. కానీ వాస్తవ పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. శనగ, మినప, పెసర పప్పుల ధరల్లో హోల్‌సేల్ ధరలతో పోలిస్తే రిటైల్ వ్యాపారుల వద్ద కేజీ కి రూ.10-16 తేడా కన్పిస్తోంది. హోల్‌సేల్‌గానే ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ రిటైల్ వ్యాపారులు వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నారు. హోల్‌సేల్ మార్కెట్లో మినపప్పు కేజీ రూ.175-180లుండగా రిటైల్‌గా కేజీ రూ.200లు వసూలు చేస్తున్నారు. ఇలా ఒక్క మినపప్పేకాదు...పెసరపప్పు, శనగపప్పు, ఎర్రపప్పు, పుట్నాలు, పల్లీల ధరల్లో కేజీకి రూ.10-16ల వరకు అదనంగా పిండుకొంటున్నారు. నగరంలో నిత్యం 50-60 టన్నుల కందిపప్పు వినియోగిస్తుండగా, మినపప్పు 60-70 టన్నులు, శనగ, పెసర పప్పులు కూడా రోజుకు 30-35టన్నులు అవసరం అవుతున్నాయి. జనవరిలో కొత్తపంట చేతికందుతుందని, అప్పటివరకు కందిపప్పు ధర దిగివచ్చే అవకాశం లేదని దాల్మిల్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. రైతుబజార్లలోనూ... నగరంలోని పలు రైతుబ జార్లలో స్వయం సహాయ క సంఘాలు నడుపుతున్న దుకాణాల్లోనూ ఇదే తంతు కొనసాగుతోంది. నాణ్యత లో రెండు, మూడు రకాల పప్పుల పేర్లు చెప్పి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. నిజానికి వీరు అమ్ముతున్నది రెండు, మూడో రకం కందిపప్పే అయినా...మొదటి రకం పప్పు పేరుతో కేజీ రూ.190-195 ప్రకారం వసూలు చేస్తున్నారు. నగరంలో ప్రధానమైన ఎర్రగడ్డ, మెహిదీపట్నం, సరూర్‌నగర్, కూకట్పల్లి, వనస్థలిపురం, ఫలక్‌నుమా రైతుబజార్లలో పప్పుల ధరలు సామాన్యులకు సైతం అందుబాటులో లేవు. రేషన్ డీలర్ల నజర్! కంది పప్పు ధర పెరగడంతో కోటా ఇవ్వాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్ : సాధారణంగా ప్రభుత్వ చౌకధరల దుకాణాల డీలర్లు ప్రతి నెల రూపాయికి కిలో బియ్యం తప్ప..కందిపప్పు తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి కనబర్చరు. కానీ ఇప్పుడు వారే కంది పప్పు కోసం డిమాండ్ చేస్తున్నారు. స్టాక్ ఇవ్వాలంటూ పౌరసరఫరాల అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ధరలు మామూలుగా ఉన్నప్పుడు ఇండెంట్ పెట్టని కారణంగా గ్రేటర్‌లోని రంగారెడ్డి జిల్లా అర్బన్ పరిధిలో గల ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో కంది పప్పు కొరత ఏర్పడింది. సివిల్ సప్లయిస్ గోదాముల్లో కంది పప్పు నిల్వలు ఉన్నప్పటికి రేషన్ షాపులకు పూర్తి స్ధాయిలో సరఫరా కాలేదు. నిబంధనల ప్రకారం గత నెల (సెప్టెంబర్) ఆఖరులో అక్టోబర్ కోటా కోసం డీడీ చెల్లించి ఇండెంట్ పెట్టిన షాపులకు మాత్రమే కంది పప్పు విడుదలైంది. అది కూడా మొత్తం ఇండెంట్లో 60 నుంచి 75 శాతం మాత్రమే రేషన్ షాపులకు సరఫరా జరిగింది. రేషన్ షాపుల్లో కందిపప్పు రూ.50 కిలో చొప్పున లబ్ధిదారులకు ఇవ్వాలి. బహిరంగ మార్కెట్ రేటు కంటే ఇది ఎంతో తక్కువ. కృత్రిమ కొరత.. బహిరంగ మార్కెట్లో కంది పప్పు ధర రెండింతలు కావడంతో డిమాండ్ పెరిగినట్లయింది. పర్యవసానంగా రేషన్‌షాపుల్లో కృత్రిమ కొరత ఏర్పడింది. డీలర్ల చేతివాటంతో అక్టోబర్ మాసానికి సరఫరా అయినా కంది పప్పు నిల్వలు గుట్టుచప్పుడు కాకుండా నల్లబజారుకు తరలి పోయాయి. బహిరంగ మార్కెట్ వ్యాపారులకు క్వింటాలు రూ.1000 నుంచి 1400 చొప్పున కంది పప్పు నిల్వలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మిగిలిన కోటా కోసం గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రాంత రేషన్ డీలర్ల దృష్టి మిగిలిన కంది పప్పు కోటాపై పడింది. గోదాముల్లో నిల్వలు ఉన్న కారణంగా..అక్టోబర్ నెల పూర్తి స్థాయి కోటా సరఫరా చేయాలని అధికారులపై ఒత్తిళ్లు ప్రారంభించారు. -
ఆన్లైన్ అమ్మకాలపై జగదీశ్ మార్కెట్ నిరసన
నగరంలోని జగదీశ్ మార్కెట్ వద్ద జంటనగరాల సిటీ మొబైల్, రిటైల్ వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ మార్కెట్లో నోకియా ఉత్పత్తులను కారుచౌకగా అమ్మేస్తున్నారంటూ వాళ్లు నిరసన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో నోకియా ఉత్పత్తుల అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని వ్యాపారులు డిమాండ్ చేశారు. లేకపోతే నోకియా సహా ఇతర ఉత్పత్తులను తామంతా బహిష్కరిస్తామని వ్యాపారులు హెచ్చరించారు. ఇటీవలి కాలంలో కొన్ని బ్రాండ్ల ఉత్పత్తులను కేవలం ఆన్లైన్లో మాత్రమ విక్రయిస్తున్న విషయం తెలిసిందే. మధ్యలో ఎవరూ లేకపోవడంతో వీటి ధర చాలావరకు తగ్గుతోంది. ఇది రిటైల్ వ్యాపారాలకు ఇబ్బందికరంగా మారింది. అందుకే జగదీశ్ మార్కెట్ వద్ద ఆందోళన జరిగింది. -
సీజన్లోనూ పైపైకి..
తగ్గని కూరగాయల ధరలు ధరలపై నియంత్రణలేని ఫలితం యథేచ్ఛగా వ్యాపారుల దోపిడీ సాక్షి, సిటీబ్యూరో : సీజన్ ప్రారంభమైనా నగర మార్కెట్లో కొన్ని రకాల కూరగాయల ధరలు ఇంకా మండుతూనే ఉన్నాయి. దిగుబడి పెరిగితే ధరలు తగ్గుతాయనుకున్న వినియోగదారులకు నిరాశే మిగిలింది. మొన్నటి వరకు డిమాండ్ సరఫరాల మధ్య అంతరం ఉండడంతో కూరగాయల ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే... ఇప్పుడు అన్నిరకాల కూరగాయల దిగుబడి పెరిగినా... ధరలు మాత్రం తగ్గకపోవడం ఆందోళ కలిగిస్తోంది. ప్రస్తుతం నగరానికి సీమాంధ్ర నుంచేగాక స్థానికంగా ఉత్పత్తి అవుతున్న కూరగాయలు కూడా సమృద్ధిగా సరఫరా అవుతున్నాయి. కానీ రిటైల్ వ్యాపారులు మాత్రం ధరలను తగ్గించేందుకు ఇష్టపడట్లేదు. వీరిపై మార్కెటింగ్ శాఖ నియంత్రణ లేకపోవడంతో పాత ధరలనే కొనసాగిస్తూ వినియోగదారులను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. పచ్చిమిర్చి, బెండ, కాకర, బీర, చిక్కుడు, క్యాప్సికం, ఫ్రెంచి బీన్స్ ధరలు ఇంకా సామాన్యుడికి అందనంత దూరంలోనే ఉన్నాయి. హోల్‌సేల్ మార్కె ట్లో వీటి ధరలు కేజీ రూ.20-39ల మధ్యలోనే ఉన్నాయి. రిటైల్‌కు వచ్చేసరికి రూ.8-14లు అధిక ధర నిర్ణయిస్తూ వినియోగదారుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. బోయిన్పల్లి హోల్‌సేల్ మార్కెట్లో ఆదివారం పచ్చిమిర్చి కేజీ రూ.30లు ధర పలుకగా ఇదే రిటైల్ మార్కెట్లో రూ.44లకు విక్రయిస్తున్నారు. ఇక బెండ, బీర, చిక్కుడు, కాకర, క్యాప్సికం, సొర వంటి వాటికి వ్యాపారులు ఇష్టారీతిన ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారు. హోల్‌సేల్‌గా రూ.25లు ధర పలికిన ఉల్లి రిటైల్ మార్కెట్లోకి వచ్చేసరికి రూ.32లకు చేరింది. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిని నగరానికి కూరగాయల సరఫరా తగ్గిందని ఫలితంగా ధరలు కిందికి దిగిరావట్లేదని వ్యాపారులు సాకుగా చెబుతుండడం గమనార్హం. -
మళ్లీ ఉల్లి లొల్లి
- రోజు రోజుకూ ఎగబాకుతున్న ధర - కేజీ రూ.26 నుంచి రూ.30! నూజివీడు : ఉల్లిధర ఎగబాకుతోంది. 15రోజుల క్రితం స్థిరంగా ఉన్న ఉల్లిధరలు రోజురోజుకు పెరుగుతూపోతున్నాయి. రైతుబజారులో ఉల్లిపాయల ధర సోమవారం రూ.25 నమోదు చేయగా, బహిరంగ మార్కెట్లో సైజును బట్టి కిలో రూ.26నుంచి రూ.30కు విక్రయిస్తున్నారు. తోపుడు బండ్ల వారు డిమాండ్‌ను బట్టి అధిక ధరలకు సొమ్ము చేసుకుంటున్నారు. పదిహేను రోజులుగా కూరగాయల ధరలూ ఆకాశాన్నంటుతుండటంతో వాటినే కొనలేక అవస్థలు పడుతుంటే... ఇప్పుడు ఉల్లిధర పెరగడం ప్రజలను కలవర పెడుతోంది. ఉల్లిపాయలు మూడు గ్రేడ్లలో లభ్యమవుతుండగా, గ్రేడ్-3రకాన్ని తక్కువగా విక్రయించాల్సిన వ్యాపారులు గ్రేడ్-1రకం ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉల్లిపాయలకు ఎక్కువగా కర్నూలు, మహారాష్ట్ర నుంచి ఎగుమతి అవుతాయి. అయితే కర్నూలు ఉల్లిపాయలు ఇంకా రాకపోవడంతో మహారాష్ట్ర దిగుమతులపైనే అందరూ ఆధారపడాల్సి వచ్చింది. జిల్లాలోని 14 రైతుబజారులలో కలిపి రోజుకు 350నుంచి 450క్వింటాళ్ల ఉల్లిపాయలు విక్రయిస్తారు. అలాగే బహిరంగా మార్కెట్లో హోల్‌సేల్ వ్యాపారుల నుంచి 2వేల క్వింటాళ్ల వరకు రిటైల్ వ్యాపారులు ఉల్లిని కొనుగోలు చేస్తారు. వాడకానికి తగ్గట్టుగా ఉల్లిపాయలు దిగుమతి కాకపోవడంతో డిమాండ్- సరఫరా మధ్య అంతరం పెరిగి ఆప్రభావం ఉల్లి ధరలపై పడినట్లు చెబుతున్నారు. సెప్టెంబరు నెల నాటికి ఉల్లికి మంచి ధర లభిస్తుందనే ఉద్దేశంతో అక్కడి ఉల్లిరైతులు గోదాముల్లో నిల్వ ఉంచుతున్నట్లు హోల్‌సేల్ వ్యాపారస్త్తులు పేర్కొంటున్నారు. దీనికి తోడు ఉల్లికొరతను సొమ్ము చేసుకునేందుకు స్థానిక రిటైల్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు తెలుస్తుంది. -
అధునాతన జంతు వధశాలలకు రూ.50 కోట్లు
సాక్షి, సిటీబ్యూరో: అపరిశుభ్రతకు తావులేని, ఆరోగ్యకరమైన మాంసం అమ్మకానికి అధునాతన జంతువధశాలలు అనివార్యమని, అదే సమయంలో స్థానిక రిటైల్ వ్యాపారుల ఉపాధికి ఢోకా లేకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జీహెచ్ఎంసీ మేయర్ మహ్మద్ మాజిద్ హుస్సేన్ అన్నారు. నేషనల్ మీట్అండ్ పౌల్ట్రీ ప్రాసెసింగ్బోర్డు (ఎన్ఎంపీపీ బీ), జీహెచ్ఎంసీల ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడి ఒక స్టార్హోటల్లో జరిగిన ఏడో మేయర్ల సదస్సును ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, ఈ రంగానికి తగిన ప్రాధాన్యతనిచ్చి జీహెచ్ఎంసీ బడ్జెట్లో రూ. 50 కోట్లు అధునాతన వధశాలలు, తదితర సదుపాయాల కోసం కేటాయించామన్నారు. అంబర్‌పేట, న్యూబోయిగూడ, రామ్నాస్పురా, గౌలిగుడాలలో స్లాటర్‌హౌస్‌ల ఆధునికీకరణ పనలకు రూ. 15 కోట్లు మంజూరు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న జియాగూడ స్లాటర్‌హౌస్‌కు కూడా తగిన నిధులు కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఫుడ్‌ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ సెక్రటరీ సిరాజ్‌హుస్సేన్ మాట్లాడుతూ, రహదారులు,పార్కులు, మునిసిపల్ మార్కెట్లు, ఆటస్థలాలు, విద్యాసంస్థలకు తగు ప్రాధాన్యతనిస్తున్న మునిసిపాలిటీలు ఆధునిక జంతువధ శాలల ఏర్పాటును పట్టించుకోవడంలేదన్నారు. దేశంలో ఢిల్లీ, కర్నాటక, హైదరాబాద్, ఈశాన్య రాష్ట్రాలు మాత్రమే ఈ అంశంపై దృష్టి సారించాయంటూ, ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న ఈ అంశంపై అన్ని స్థానిక సంస్థలు శ్రద్ధ చూపాల్సి ఉందన్నారు. రాష్ట్ర పశుసంవర్థకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.మన్మోహన్సింగ్ మాట్లాడుతూ, ఆయా వ్యాధులు సోకకుండా దక్షిణాది రాష్ట్రాల్లోని పశువులన్నింటికీ ఒకేరోజు వ్యాక్సిన్ వేస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.దేశంలోనే ఏకకాలంలో ఐదు అధునాతన పశువధశాలలు ఏర్పాటు చేస్తున్న ఏకైక నగరం ైెహ దరాబాద్ అన్నారు. ఈ గవర్నెన్స్‌తోపాటు హైజీన్ గవర్నెన్స్ కూడా అవసరమని మునిసిపల్ పరిపాలన శాఖ కమిషనర్, డెరైక్టర్ బి.జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ‘నేషనల్ రీసెర్చి సెంటర్ ఆన్ మీట్’ డెరైక్టర్ వీవీ కులకర్ణి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ జేసీ అనురాధప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ‘గ్రీనింగ్ ఆఫ్ మీట్ అండ్ పౌల్ట్రీ ప్రాసెసింగ్ సెక్టార్ ఇన్ ఇండియా’ అనే అంశంపై రూపొందించిన నివేదికను ఆవిష్కరించారు. ఎన్ఎంపీపీబీతో శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ(తిరుపతి), నేషనల్ రీసెర్చి సెంటర్ ఆన్ మీట్లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. పేరుకు మేయర్ల సదస్సు అని పేర్కొన్నప్పటికీ, స్థానిక మేయర్ తప్ప మరే ఇతర నగర మేయర్ సదస్సుకు హాజరు కాకపోవడం విశేషం.