3 నెలల కనిష్టానికి పసిడి
అంతర్జాతీయ ప్రభావం
న్యూయార్క్/న్యూఢిల్లీ: పసిడి ధర పడిపోతోంది. ఢిల్లీలో మూడు నెలల కనిష్ట స్థాయికి దిగింది. అంతర్జాతీయ అంశాలు దీనికి ప్రధాన కారణం. దీపావళి నేపథ్యంలో... ఆభరణాలు, రిటైల్ వర్తకుల కొనుగోళ్లు మందగించడం కూడా దీనికి కారణం. ఢిల్లీలో 10 గ్రాములకు 24, 22 క్యారెట్ల ధరలు క్రితంతో పోల్చితే రూ.300 తగ్గి రూ.25,950, రూ.25,800 చొప్పున నమోదయ్యాయి. వెండి సైతం ఇదే ధోరణిలో కేజీకి రూ.500 తగ్గి రూ.34,400గా ఉంది.
అంతర్జాతీయ బలహీన ధోరణి...
న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (కామెక్స్)లో ఔన్స్ (31.1గ్రా) గురువారం ముగింపు 1,084 డాలర్లు. ఒక దశలో 1,074 డాలర్లకు సైతం పడిపోయింది. ఇది ఐదేళ్ల కనిష్ట స్థాయి. అంటే 2010 ఫిబ్రవరి తరువాత ఈ స్థాయికి అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పతనం ఇదే తొలిసారి.
‘ఫెడ్’ ఎఫెక్ట్!
అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటును ప్రస్తుత జీరో స్థాయి నుంచి పెంచే అవకాశం ఉందన్న వార్త ప్రధానంగా పసిడి ఫ్యూచర్స్ మార్కెట్‌పై పడుతోంది. ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున బులి యన్ ఆధారిత ఫండ్లను విక్రయించి సొమ్ము చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. గురువారం వరకూ జరిగిన 12 ట్రేడింగ్ దినాల్లో 11 రోజులు ఈ మెటల్ నష్టాలను ఎదుర్కొంటూ వస్తోంది. శుక్రవారం తొలి సమాచారం అందే సరికి మాత్రం అతి స్వల్ప స్థాయి లాభాల్లో ట్రేడవుతోంది. భారత్ ఫ్యూచర్స్ మార్కెట్‌లో కూడా ఇదే ధోరణి కనబడుతోంది.
దేశంలో టారిఫ్ విలువ కోత
అంతర్జాతీయంగా ధర భారీగా తగ్గిన నేపథ్యంలో... పసిడి. వెండి దిగుమతుల టారిఫ్ విలువలను కేంద్రం తగ్గించింది. ఇప్పటి వరకూ 10 గ్రాములకు 373 డాలర్లుగా ఉన్న దిగుమతి టారిఫ్ విలువను 354 డాలర్లకు తగ్గించింది. వెండి (కేజీ) టారిఫ్ విలువను కూడా 517 డాలర్ల నుంచి 470కి తగ్గించింది. అంటే బంగారం టారిఫ్ విలువ 5 శాతంపైగా తగ్గగా, వెండి టారిఫ్ విలువ 9 శాతంపైగా పడింది.
ఈ మేరకు కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు (సీబీఈసీ) ఒక ప్రకటన చేసింది. మెటల్స్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధింపునకు ఈ టారిఫ్ విలువ(బేస్ ధర)ను సీబీఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది. టారిఫ్ విలువలో 5% మార్పు ఉంటే ఆ ప్రభావం స్పాట్ బులియన్ మార్కెట్‌పై ఉంటుంది. తాజా నిర్ణయం స్పాట్ మార్కెట్‌లో పసిడి విలువ మరింత తగ్గడానికి దారితీసే అంశమే.