వాసవి కాలేజీ విద్యార్థులకు ‘అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ’ అవకాశం
ఉప ముఖ్యమంత్రి కడియం
సాక్షి, హైదరాబాద్: వాసవి జూనియర్ కాలేజీ విద్యార్థులు మే/జూన్‌లో జరిగే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తామని బుధవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. తద్వారా విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చూస్తామని పేర్కొన్నారు. మార్చిలో పరీక్షలు రాయకపోయినా ఆ కాలేజీ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆ విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు హాజరయ్యేందుకు కూడా వెసులుబాటు కల్పిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులని, ప్రభుత్వాన్ని మోసం చేసిన యాజమాన్యంపై కఠిన చర్యలు చేపట్టాలని ఇంటర్ బోర్డు కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.
యాజమాన్యంపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు. పిల్లలను కాలేజీల్లో చేర్పించే ముందు కాలేజీలకు గుర్తింపు ఉందా? లేదా? కాలేజీ ట్రాక్ రికార్డు మంచిదా? కాదా? చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన పర్యావరణ విద్య, ఎథిక్స్, హ్యూమన్‌వ్యాల్యూస్ పరీక్షలకు ఆ విద్యార్థులు హాజరు కాలేదని పేర్కొన్నారు. ప్రాక్టికల్స్ కూడా చేయలేదన్నారు. ఈ రెండు చేయలేదని తెలిసిన వెంటనే స్పందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, విద్యార్థులకు ఉందన్నారు. వీటిని అప్పుడే ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకునేవాళ్లమని తెలిపారు.