హైదరాబాద్: అగర్వాల్ సమాజ్ సహాయతా ట్రస్ట్‌ను ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు ఆదర్శంగా తీసుకోవాలని వైద్య, ఆరోగ్య మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.60 లక్షలతో నిమ్స్ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డ్ వద్ద ఏర్పాటు చేసిన అత్యాధునిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్, విశ్రాంతి శాల, ప్రైవేట్ గదిని మంత్రి లక్ష్మారెడ్డితో పాటు పశు సంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అగర్వాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాంధీ ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేశారని.. ప్రస్తుతం అది పేద రోగులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించిందని, అనేక ఆసుపత్రులు స్పెషాలిటీ స్థాయికి ఎదిగాయని అన్నారు. తద్వారా ఐపీ , ఓపీ సేవలు 50 శాతం పెరిగాయని తెలిపారు. నిమ్స్‌లో కూడా 500 బెడ్‌లు అదనంగా ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.
అగర్వాల్ ట్రస్ట్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
మంత్రి తలసాని మాట్లాడుతూ అగర్వాల్ సహాయక్ ట్రస్ట్‌ను ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరంతోపాటు జిల్లాకేంద్రాల్లో కూడా సేవలు విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు. ట్రస్ట్ ప్రతినిధులతో కలసి ముఖ్యమంత్రిని కలుస్తామని తెలిపారు.
కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ.శాంతి కుమారి, కమర్షియల్ ట్యాక్స్ అండ్ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కరోడిమల్ అగర్వాల్, నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment