తెలంగాణ సీఐడీకి అగ్రిగోల్డ్ నిందితులు
విచారణకు మహబూబ్‌నగర్ కోర్టు అనుమతి
సాక్షి, హైదరాబాద్: చిరుద్యోగులకు, సామాన్యులకు అధిక వడ్డీ ఆశచూపి కుచ్చుటోపీ పెట్టిన అగ్రిగోల్డ్ సంస్థ నిందితులను తెలంగాణ సీఐడీ కస్టడీలోకి తీసుకోనుంది. ఈ సంస్థలో డిపాజిట్లు చేసినవారికి సొమ్ములు చెల్లించకుండా చేతులెత్తేయడంతో ఏపీతోపాటు, రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో రెండు కేసులు నమోదయ్యాయి. అగ్రిగోల్డ్ నిందితులను ఏపీ సీఐడీ అరెస్టు చేయగా, అక్కడి ప్రభుత్వం ఆ సంస్థ ఆస్తులను సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో కూడా కేసులు నమోదవడంతో రాష్ట్ర సీఐడీని కూడా ఈ కేసు దర్యాప్తు చేయాలని వారంకిందట హైకోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ కోర్టులో రాష్ట్ర పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అగ్రి నిందితులను పీటీ వారెంట్ మీద మూడు రోజులపాటు విచారించాలని సీఐడీ పోలీసులు కోరగా న్యాయస్థానం అంగీకరించింది. ఈ క్రమంలో అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, మేనేజింగ్ డెరైక్టర్ శేష నారాయణరావులను విచారించాలని సీఐడీ నిర్ణయించింది. ప్రస్తుతం ఏపీలోని ఏలూరు జైల్లో ఉన్న వారిద్దరినీ తీసుకొచ్చేందుకు సీఐడీ ప్రత్యేక బృందం మంగళవారమే బయలు దేరింది. బుధవారం నుంచి మూడు రోజులపాటు వారిని సీఐడీ అధికారులు విచారించనున్నారు.