ఈ నెల 19 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఆయన, గంటా శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 12న విశాఖపట్నం నగరంలో ఆంధ్రప్రదేశ్ తొలి కేబినెట్ భేటీ ఉంటుందని బొజ్జల చెప్పారు. ఆంధ్రయూనివర్శిటీలోని టీఎల్ఎన్ సభా వేదిక తొలి కేబినెట్ భేటీకి వేదిక అవుతుందన్నారు.
రాష్ట్ర ప్రజలను సంతృప్తి పరిచే విధంగా మంత్రుల పనితీరు ఉండాలని తమకు తమ పార్టీ నాయకుడు, సీఎం చంద్రబాబు సూచించారని విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. తమకు ఏ శాఖ ఇచ్చిన ఆనందంగా పని చేస్తామని ఆయన తెలిపారు. ఈ నెల 8వ తేదీన గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదుట ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు, పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.