అవినీతిలో ఏపీ నంబర్‌వన్
► చంద్రబాబు హయాంలో దక్కిన కిరీటం
► ఎన్‌సీఏఈఆర్ సంస్థ సర్వేలో నిర్ధారణ
► ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తీవ్రంగా ఉందని 74.3 శాతం మంది వెల్లడి
► తర్వాత స్థానంలో తమిళనాడు
► అవినీతి రహిత రాష్ర్టం హిమాచల్
► ఐదు అంశాల ఆధారంగా రాష్ట్రాలకు గ్రేడ్లు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి
అవినీతిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించింది. ఈ విషయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్’ (ఎన్‌సీఏఈఆర్) సంస్థ నిర్ధారించింది. దేశంలోకెల్లా ‘ఆంధ్రప్రదేశ్ అత్యంత అవినీతి రాష్ర్టం’ అని ఈ సంస్థ జరిపిన అధ్యయనంలో తేలింది. కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఎన్‌సీఏఈఆర్ సంస్థ అధ్యయనంలో కూడా అవినీతి రుజువుకావడంతో చంద్రబాబు ప్రభుత్వం లక్షన్నరకోట్లకు పైగా అవినీతికి పాల్పడిందంటూ ప్రతిపక్ష వైఎస్సార్‌కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను నిర్ధారించినట్లయింది.
ఎన్‌సీఏఈఆర్ సంస్థ ఐదు అంశాలపై సమగ్రమైన అధ్యయనం చేసి వివిధ రాష్ట్రాలకు గ్రేడ్లు ఇచ్చింది. ఆయా రాష్ట్రాలలో పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులపై ఈ సంస్థ ప్రధానంగా అధ్యయనం చేసింది. కార్మికులు, మౌలిక వసతులు, రాజకీయ సుస్థిరత, పరిపాలన, ఆర్థిక పరిస్థితి, వ్యాపార వాతావరణం మొదలైన అంశాలపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. దేశంలోని 29 రాష్ట్రాలోనూ ఈ సంస్థ సర్వే నిర్వహించింది.
ఆంధ్రాలో అవినీతి తీవ్ర సమస్యే...
ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత అవినీతి రాష్ర్టంగా ఎన్‌సీఏఈఆర్ జరిపిన సర్వేలో తేలింది. తరువాతి స్థానంలో తమిళనాడు ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తీవ్ర సమస్యగా ఉందని 74.3శాతం మంది చెప్పారు. 17.1 శాతం మంది అవినీతి ఓ మోస్తరుగా ఉందని చెప్పగా 8.6శాతం మంది అవినీతి సమస్య లేదని చెప్పారు. తమిళనాడులో 71.8శాతం మంది అవినీతి తీవ్ర సమస్యగా ఉందని వెల్లడించారు. 28.2శాతం మంది ఒక మోస్తరుగా ఉందని చెప్పగా అవినీతి సమస్య లేదని ఎవరూ చెప్పలేదు. అవినీతి తీవ్ర సమస్యగా ఉందని ఒక్కరూ చెప్పని రాష్ర్టంగా హిమాచల్ ప్రదేశ్‌గా తేలింది. అక్కడ 55శాతం మంది అవినీతి లేదని చెప్పగా ఓ మోస్తరుగా అవినీతి ఉందని 45శాతం మంది చెప్పారు. తెలంగాణలో 26.5 శాతం మంది అవినీతి తీవ్రంగా ఉందని చెప్పగా 61.8 శాతం మంది ఓ మోస్తరుగా ఉందని, 11.8 శాతం మంది అసలు అవినీతి జరగడం లేదని చెప్పారు. అవినీతి విషయంలో పశ్చిమబెంగాల్ మూడో స్థానంలో ఉంది. 64.3శాతం మంది అవినీతి తీవ్రంగా ఉందని చెప్పగా 22.9శాతం మంది ఓ మోస్తరుగా ఉందని, 12.9శాతం మంది అసలు అవినీతి జరగడం లేదని పేర్కొన్నారు.
ఎక్కడిదీ ఎన్‌సీఏఈఆర్ ?
భారతదేశంలో ఆర్ధిక విధానాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేసేందుకు కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ ఇది. 1956లో ప్రారంభమైన ఈ సంస్థ ఈ ఏడాది 60దశాబ్దాలను పూర్తి చేసుకుంది. అనేక ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ వివిధ రంగాలపై అధ్యయనాలు జరపడం, సెమినార్లు నిర్వహించడం, నివేదికలు రూపొందించడం ఈ సంస్థ విధుల్లో భాగాలు. ప్రపంచవ్యాప్తంగా 22 దేశాలలోని 49 ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు ఎన్‌సీఏఈఆర్‌తో కలసి పనిచేస్తున్నాయి.
రెండేళ్లలో లక్షన్నరకోట్ల మేర అవినీతి..
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారపగ్గాలు చేపట్టిన రెండేళ్లలో దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని సాక్ష్యాలతో సహా ‘సాక్షి’ బైటపెట్టింది. రాష్ర్టంలో జరిగిన అవినీతిపై అనేక కథనాలను రంగాలవారీగా ప్రచురించింది. అధికార రహస్యాలను బైటపెట్టబోనన్న ప్రమాణాన్ని గాలికొదిలి రాజధాని విషయంలో ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’కు పాల్పడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. బినామీలతో కలసి దాదాపు లక్ష కోట్ల మేర దోచుకున్నారు. ఇసుక దందాల నుంచి సోలార్ ప్లాంట్ల వరకు, సాగునీటి శాఖ నుంచి విద్యుత్ టెండర్ల వరకు ప్రతి ప్రక్రియ లోనూ ముడుపులు అందేలా పెదబాబు, చినబాబు ఏర్పాట్లు చేసుకున్నారు. అన్ని రంగాలలోనూ అవినీతిని వ్యవస్థీకృతం చేశారు.
అవినీతితో జరగని పని లేదనే స్థితికి తీసుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏ రంగంలో ఎంత మేర అవినీతి జరిగిందనేది వివరిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సాక్ష్యాలతో సహా ఏకంగా ఓ పుస్తకంగా ప్రచురించింది. ఆంగ్లంలో ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’, తెలుగులో ‘అవినీతి చక్రవర్తి’ పేరుతో ఉన్న ఈ పుస్తక ప్రతులను పలువురు కేంద్ర మంత్రులకు, ఎంపీలకు, శాసనసభ్యులకు, వివిధ దర్యాప్తు సంస్థలకు అందజేసింది. చంద్రబాబు అవినీతిపై న్యాయస్థానాల తలుపులూ తట్టాలని యోచిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులంటున్నారు. ఎన్‌సిఎఇఆర్ సర్వే కూడా ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిని నిర్ధారించడంతో ఇపుడు ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు మరింత విశ్వసనీయత చేకూరినట్లయింది.