
విలేకరులతో మాట్లాడుతున్న డేరంగుల ఉదయ్‌కిరణ్
హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ శాసన సభ హక్కులను కాలరాస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లజ్జగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నా ప్రశ్నించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు నోరు పెగలడం లేదని ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లో విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నించేవాడు ప్రశ్నగా మారితే జనం తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలన్నారు. సినిమా డైలాగులు చెప్పే పవన్ కల్యాణ్ జనాలకు చేసేదేమీ లేదని, అభిమానాన్ని ఆసరాగా తీసుకొని యువతను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు.
ఆయనది నిలకడ లేని మనస్తత్వమని ఎప్పుడు ఏం మాట్లాడతాడో తనకే తెలియదన్నారు. అభిమానులను మోసం చేస్తే వారే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఏపీలో ప్రజలు అనేక సమస్యలతో అవస్థలు పడుతున్నా.. పవన్ ఒక్కదానిపై కూడా పోరాడలేదన్నారు. సమావేశంలో నాయకులు రాంచందర్, కామాచార్యులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.