నేడు ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాలు
♦ ఉదయం 11 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్న సీఎం
♦ అభ్యర్థుల సెల్‌ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారానూ సమాచారం
♦ ‘నీట్’ వాయిదాతో ఊపిరిపీల్చుకున్న విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్-2016 మెడికల్, అగ్రికల్చర్ విభాగం ఫలితాలను శనివారం ప్రకటించనున్నారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీటిని విడుదల చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు శుక్రవారం వేర్వేరుగా విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. నీట్‌ను వాయిదా వేస్తూ కేంద్రం ఆర్డినెన్సు ఇవ్వడంతో మంత్రి గంటా శ్రీనివాసరావు సచివాలయంలోని తన చాంబర్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ , వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, నరసింహారావు, సెట్ల అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రత్యేకాధికారి రఘునాథ్, ఆ శాఖాధికారులతో సమావేశమై చర్చించారు.
ఎంసెట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కాకినాడ జేఎన్‌టీయూ అధికారులతోనూ మాట్లాడారు. అనంతరం శనివారం ఉదయం 11 గంటలకు సీఎం చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయనున్నట్లు విలేకరులతో చెప్పారు. వచ్చే ఏడాదిలో నీట్‌కు వీలుగా రాష్ట్ర విద్యార్థులను సన్నద్ధం చేస్తామని, నిపుణులతో చర్చించి రాష్ట్ర సిలబస్‌లో సీబీఎస్‌ఈ తరహాలో మార్పులు, చేర్పులు చేయనున్నామని వివరించారు. కాగా, కృష్ణా జిల్లా కైకలూరులో మంత్రి కామినేని శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ శనివారం విడుదల చేయనున్న ఎంసెట్ మెడికల్ ఫలితాలను అభ్యర్థుల సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారమివ్వనున్నట్లు చెప్పారు. ఫలితాలు సాక్షిఎడ్యుకేషన్.కామ్‌లో అందుబాటులో ఉంటాయి.
ఉత్కంఠతో 98వేల మంది విద్యార్థులు
నీట్ కారణంగా నిలిచిపోయిన ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ ఫలితాల విడుదలకు కొన్ని రోజులుగా విద్యార్థులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఎంసెట్ అగ్రి, మెడికల్ విభాగం పరీక్షకు 1,03,222 మంది దరఖాస్తు చేయగా ఏప్రిల్ 29న జరిగిన పరీక్షకు 98,750 మంది హాజరయ్యారు. వీరిలో ఏపీలోని 13 జిల్లాల్లో 76,159 మంది, తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంలో జరిగిన పరీక్షకు 22,591 మంది ఉన్నారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మెడికల్, డెంటల్ కోర్సులకు సంబంధించినదే అయినా వాటితో పాటు అగ్రికల్చర్, ఫార్మా కోర్సులకు పరీక్ష రాసిన వారి ఫలితాలు కూడా విడుదల కాలేదు. దీంతో శనివారం అగ్రికల్చర్, మెడికల్ ఫలితాలు వెలువడనుండడంతో విద్యార్థులు ఉత్కంఠతో ఉన్నారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్‌కు సంబంధించి 12 ప్రభుత్వ, 14 ప్రైవేటు వైద్య కళాశాలలున్నాయి. ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ కళాశాలల్లో 1,900, ప్రైవేటు కాలేజీల్లో 2వేలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ డెంటల్ కాలేజీలు 2 ఉండగా అందులో 140 సీట్లు, 12 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1,160 సీట్లు ఉన్నాయని ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు తెలిపారు.