► బదిలీలు పారదర్శకంగా జరుగుతాయి
► 422 వైద్య పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ
► ప్రతి జిల్లా ఆసుపత్రిలో 10 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు
► జిల్లాకు 2 చొప్పున 13 జిల్లాలలో హెల్త్ ఏటీయమ్స్ ఏర్పాటు
► మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడి
ఏపీ ముఖ్యమంత్రి ఆదేశానుసారం శుక్రవారం నుంచి 10 రోజుల పాటు వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల ప్రక్రియ చేపడుతున్నట్లు ఆ శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గురువారం తెలిపారు. బదిలీలు పారదర్శకంగా ఉంటాయన్నారు. డాక్టర్ల పనితీరు, పరస్పర అంగీకారం, భార్య, భర్తలను ఒకే చోట లేదా వీలైనంత దగ్గరగా పనిచేసేలా, ఎంసీఐ నిబంధనలకు లోబడి ఈ బదిలీలు చేస్తామని మంత్రి కామినేని తెలిపారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలతో పాటు ఉచిత సీటీ స్కాన్ పరీక్షలు, తల్లి, బిడ్డ ఎక్స్ ప్రెస్, 108 సేవలు, 102 కాల్ సెంటర్, ఆసుపత్రులలో పరికరాల ఏర్పాటు మొదలైన పథకాల పనితీరు బాగుందని ముఖ్యమంత్రి చెప్పినట్లు మంత్రి కామినేని పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా 35 సంవత్సరాల వయస్సు నిండిన మహిళలకు అన్ని రకాల క్యాన్సర్, థైరాయిడ్, డయాబెటిస్, హర్మోన్, స్త్రీ వ్యాధులకు ఉచిత వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే 13 వేల మంది ఎఎన్ఎమ్ లకు దీనిపై శిక్షణతో పాటు ట్యాబ్స్ ఇచ్చామని మంత్రి తెలిపారు.
ఏపీ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో అత్యాధునిక నేత్ర పరీక్ష కోసం యంత్ర పరికరాల ఏర్పాటు చేశామని, అన్ని జిల్లా ఏరియా ఆస్పత్రులలో బయోమెట్రిక్ హాజరు విధానం అమలుచేసిన తర్వాత హాజరుశాతం పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఆసుపత్రులల్లో ప్రసవించిన మహిళలకు త్వరలో "బేబీ కిట్స్" ఇవ్వబోతున్నామని, దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో ప్రారంబిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక్కొక్క ఆసుపత్రిలో 10 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. జిల్లాకు 2 చొప్పున 13 జిల్లాలలో హెల్త్ ఏటీయమ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆర్బన్ హెల్త్ సెంటర్స్ పనితీరు బాగోలేదని వీటిని ఈయుపీహెచ్‌సీలుగా మార్చి ఆధునీకరిస్తున్నామన్నారు.
422 వైద్య పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని, త్వరలో ప్రభుత్వ వైద్యకళాశాలలో చదివే విద్యార్థులకు ట్యాబ్స్ ఇస్తున్నట్లు మంత్రి కామినేని తెలిపారు. కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించినప్పుడు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాననడం సరికాదని బీజేపీ సభ్యుడిగా పార్టీలోని కార్యకర్తలు, నాయకులను కలుపుకొని వెళ్లడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. మంత్రిగా తన శాఖను, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ పనిచేసే బాధ్యత తనపై ఉందన్నారు. కేంద్రమంత్రులు సురేష్ ప్రభు, స్మృతి ఇరానీల విజ్ఞప్తి మేరకే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశానని, అదికూడా ముందు ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబును సంప్రదించాకేనని చెప్పారు. ప్రత్యేక హోదాపై బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
వైద్యశాఖలో బదిలీలకు గ్రీన్ సిగ్నల్
Published Thu, Jun 9 2016 5:06 PM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM
Advertisement