ఎస్‌బీహెచ్‌కు ఉన్నత విద్యామండలి తాఖీదు | AP Higher Education council sends notice to SBH | Sakshi
Sakshi News home page

ఎస్‌బీహెచ్‌కు ఉన్నత విద్యామండలి తాఖీదు

Published Thu, Mar 24 2016 7:39 PM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM

AP Higher Education council sends notice to SBH

- సుప్రీంకోర్టు ఉత్తర్వుల ధిక్కరణ
- తెలంగాణ ఉన్నత విద్యామండలికి నిధుల విడుదల


హైదరాబాద్ : ఏపీ ఉన్నత విద్యామండలి హైదరాబాద్‌లోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాంతినగర్ బ్రాంచికి నోటీసులు జారీచేసింది. తమ బ్యాంకు ఖాతాల నుంచి నిధులను తెలంగాణ ఉన్నత విద్యామండలికి విడుదల చేయడంపై ఈ నోటీసులు ఇచ్చింది. ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని ఆ నోటీసుల్లో పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వడంతో పాటు తప్పును సరిదిద్దుకోకపోతే కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కొనాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

గతంలో ఏపీ ఉన్నత విద్యామండలి బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి లేఖలతో ఎస్‌బీహెచ్ ఆ ఖాతాలను ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ఉన్నత విద్యామండలి హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తెలంగాణ ఉన్నత విద్యామండలికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీనిపై ఏపీ ఉన్నత విద్యామండలి సుప్రీం కోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేసింది. ఈలోగానే ఏపీ ఉన్నత విద్యామండలి ఖాతాలను ఎస్‌బీహెచ్ అధికారులు తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యదర్శి పేరిట మార్పు చేశారు.

ఇటీవల సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరిస్తూ ఆ ఖాతాలు ఏపీ ఉన్నత విద్యామండలికే చెందుతాయని, రెండు రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేసుకోవాలని సూచించింది. ఈ తీర్పుననుసరించి ఏపీ ఉన్నత విద్యామండలి తమ ఖాతాలను ఏపీ కార్యదర్శి పేరిట మార్పు చేయాలని ఆయా ఎస్‌బీహెచ్‌తోపాటు అన్ని బ్యాంకులకు లేఖలు రాసింది. ఆ లేఖలతో పాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రతులను జతపరిచింది.

ఇలా లేఖలు రాశాక కూడా ఎస్‌బీహెచ్ శాంతినగర్ బ్రాంచి అధికారులు ఖాతాలను మార్పు చేయకపోవడమే కాకుండా ఆ ఖాతాలోని రూ.15 లక్షలను తెలంగాణ ఉన్నత విద్యామండలికి విడుదల చేయడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఏపీ ఉన్నత విద్యామండలి కార్యదర్శి వరదరాజన్ ద్వారా ఎస్‌బీహెచ్‌కు నోటీసులు జారీచేశామని మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి సాక్షికి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement