చేనేత రంగానికి తగిన ప్రాధాన్యత
- 2022 నాటికి అందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు: దత్తాత్రేయ
- సంక్షేమ రంగానికే ఎక్కువ నిధులు: ఈటల
సాక్షి, హైదరాబాద్: చేనేత రంగానికి కేంద్రం తగిన ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. అందులో భాగంగానే చేనేత కార్మికులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, తక్కువ వడ్డీకి రుణాలు, నిరుద్యోగులు పరిశ్రమలు నెలకొల్పేందుకు రూ.కోటి వరకు రుణాలను కేంద్రం అందజేస్తుందన్నారు. హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఆదివారం జరిగిన పద్మశాలి చైతన్య సభలో ఆయన పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో దత్తాత్రేయ మాట్లాడుతూ.. చేతివృత్తుల వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ అందిస్తున్నామన్నారు.
2022 నాటికి దేశంలో అందరికీ ఇళ్లు కట్టించే లక్ష్యంతో మోదీ పనిచేస్తున్నారన్నారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ..2017–18 బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించామన్నారు. అందులో భాగంగానే చేనేత రంగానికి రూ.12 వందల కోట్ల రూపాయలు కేటాయించినట్లు పేర్కొన్నారు. బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో పద్మశాలీలు ఐక్యంగా ఉండి అన్ని పార్టీలనుంచి అధిక స్థానాల్లో పోటీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సీహెచ్ ప్రభాకర్, మాజీ ఎంపీ గుండు సుధారాణి, గుర్రం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.