
ఏప్రిల్ సవాలే!
సైబరాబాద్ పోలీసులకు ఛాలెంజ్‌గా మారనున్న ఎన్నికల బందోబస్తు
ఏప్రిల్ మాసం సైబరాబాద్ పోలీసులకు ఛాలెంజ్‌గా నిలువనుంది. ఎప్పడూ ఉండే శాంతిభద్రతల విధులతో పాటు అదనంగా వరుసగా వస్తున్న ఐదు ఎన్నికల బందోబస్తు విధులే ఇందుకు కారణం. ఏప్రిల్ 6,8తేదిల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, 13న పంచాయతీ ఎన్నికలు, 30న ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు జరగనుండడంతో సైబరాబాద్ పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
సైబరాబాద్ పరిధిలో గతేడాది జులై 6న 276 పంచాయతీలకు పకడ్భందీ బందోబస్తుతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించారు. అయితే వచ్చే నెలలో వరుసగా ఐదు ఎన్నికలు జరగనుండటంతో బందోబస్తుపై పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పూర్తి దృష్టి సారించారు. ఇప్పటికే తమ వద్ద ఉన్న సిబ్బందికి తోడు అదనపు బలగాలను రప్పించేందుకు డీజీపీని సంప్రదించినట్టు తెలిసింది. జాయింట్ పోలీసు కమిషనర్ వై.గంగాధర్, ఎలక్షన్‌సెల్ డీసీపీ రంగారెడ్డి, ఎల్బీనగర్, మాదాపూర్, మల్కాజిగిరి, శంషాబాద్, బాలానగర్ డీసీపీలతో కమిషనర్ ఆనంద్ ఎన్నికల బందోబస్తుపై చర్చించారు.
అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక ప్రాంతాలపై ఆరా తీశారు. రౌడీషీటర్ల బైండోవర్, లై సెన్స్ తుపాకుల అప్పగింత, వాహనాల తనిఖీల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయా జోన్ల పరిధిలో అదనంగా చేపట్టాల్సిన బందోబస్తు గురించి కూడా ఆరా తీశారు.