దళితులపై దాడులు కొనసాగుతుంటే స్వాతంత్ర్యం వచ్చినట్లా? | Are we really freedom, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

దళితులపై దాడులు కొనసాగుతుంటే స్వాతంత్ర్యం వచ్చినట్లా?

Published Tue, Aug 16 2016 1:36 AM | Last Updated on Tue, Oct 2 2018 7:21 PM

దళితులపై దాడులు కొనసాగుతుంటే స్వాతంత్ర్యం వచ్చినట్లా? - Sakshi

దళితులపై దాడులు కొనసాగుతుంటే స్వాతంత్ర్యం వచ్చినట్లా?

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆవేదన
సీఎం చంద్రబాబుకు అమలాపురం వెళ్లాల్సిన బాధ్యత లేదా?
పదో తరగతి పిల్లాడిని కూడా కట్టేసి తీవ్రంగా కొట్టారు
హామీలతో ఓట్లు వేయించుకుని ఆ తర్వాత మోసం చేస్తున్నారు..
రాజ్యాంగాన్నే కాలరాస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు
వ్యవస్థలో మార్పు కోసం అందరం కలసికట్టుగా పోరాడాలి
వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జగన్


సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్రం సిద్ధించిన డెబ్బై ఏళ్ల తర్వాత కూడా దళితులపై దౌర్జన్యాలు, దాడులు జరుగుతూ ఉంటే స్వాతంత్య్రం వచ్చిందనే అనుకోవాలా? అని ఈ దేశ పౌరులుగా అందరూ తమ గుండెలపై చేయి వేసుకుని ప్రశ్నించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. డెబ్బై ఏళ్లవుతున్నా దేశంలోనూ, రాష్ట్రంలోనూ స్వాతంత్య్రం లేని పరిస్థితులే నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని వైఎస్ జగన్ ఆవిష్కరించారు.

అంతకుముందు మహాత్మాగాంధీ, వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు నివాళులర్పించారు. రిజర్వు దళం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో దళితులపై దాడిని ఆయన ప్రస్తావించారు. ‘దాడికి గురైన దళితులను పరామర్శించడానికి నేను తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లా.

ఓ రైతు తన చనిపోయిన ఆవును తీసుకు వెళ్లండి అని కొందరు దళితులను కోరితే వారు ఆ ఆవును శ్మశానానికి తీసుకెళ్లి చర్మం తీసుకుంటుంటే దాడి చేశారు. దాడికి గురైనవారిలో పదో తరగతి చదివే ఒక పిల్లవాడు ఉన్నాడు. పిల్లాడని చూడకుండా నిర్దాక్షిణ్యంగా 300 మీటర్లకు పైగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి కట్టేసి చెప్పులతో కొట్టారు. ఇలాంటి సంఘటనలు ఇంకా చోటు చేసుకుంటూ ఉంటే మనకు స్వాతంత్య్రం వచ్చినట్లా?’ అని జగన్ ప్రశ్నించారు.
 
ముఖ్యమంత్రి భరోసా ఏదీ!
ఇంత జరిగినా ముఖ్యమంత్రి రాజమండ్రికి వెళతారు గానీ, అక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమలాపురానికి మాత్రం వెళ్లరని జగన్ విమర్శించారు. చంద్రబాబు అక్కడికి వెళ్లి ‘మీకు నేను తోడుగా ఉంటాను.. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తాను’ అని ఆ దళితులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆయన వెళ్లరు. అంటే స్వాతంత్య్ర దినోత్సవం రోజు మనం ఎలాంటి సం దేశం పంపుతున్నామో ఆలోచించండి అని జగన్ అన్నారు. దళితులను దళితులుగా చూసే పరిస్థితి లేకుండా పోతోందని, దళితుడు క్రైస్తవుడు అయినంత మాత్రాన ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వబోమని చెబుతు న్న దేశంలో మనం ఉన్నామంటే సిగ్గుతో తల వంచుకోవాలని అన్నా రు. దళితులు ఏ మతంలో ఉంటే ఏంటి? అని జగన్ ప్రశ్నించారు.
 
రాజ్యాంగాన్ని వెటకారం చేస్తున్నారు
‘ప్రపంచంలోనే అతి గొప్పదని చెప్పుకుంటున్న మన రాజ్యాంగాన్ని  వెట కారం చేస్తూ వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను రూ.20 కోట్లు, రూ.30 కోట్లు లంచాలుగా ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అడ్డగోలుగా సంపాదించిన నల్లధనంతో ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారంటే నిజంగా రాజ్యాంగం ఉందా? అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి.

ఒక ముఖ్యమంత్రి  నల్లధనాన్ని సూట్‌కేసుల్లో తీసుకెళ్లి తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ ఆడియో, వీడియో టేపులతో సహా అడ్డంగా దొరికి పోయినా... ఆ ముఖ్యమంత్రి అరెస్టు కాకపోవడం అనేది బహుశా ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. కానీ మన దేశంలో ఇక్కడ జరుగుతోంది. ఇవన్నీ చూసినప్పుడే మనకు స్వాతంత్య్రం వచ్చిందా? లేదా? రాజ్యాంగం ఉందా ? లేదా? అని ప్రశ్నించుకోవాల్సి వస్తోంది. ఈ వ్యవస్థ తీరును చూసి సిగ్గుతో తలదించుకోవాలి. బ్రిటిష్ వారు వెళ్లి పోయారు కదా స్వాతంత్య్రం వచ్చేసిందని అనుకోవద్దు. ఇవాళ్టికి కూడా పాలకుల నుంచి ప్రజలకు స్వాతంత్య్రం రాని పరిస్థితులే ఉన్నాయనే అంశాన్ని మర్చిపోకూడదు.

ఇలాంటి వ్యవస్థలో మార్పు కోసం మనమందరమూ కలసికట్టుగా ఒక్కటై పోరాడుదాం’ అని జగన్ పిలుపునిచ్చారు. పాలకులు తప్పు చేస్తే ప్రజలుగా గట్టిగా నిలదీస్తామని, మాకు (ప్రజలకు) మోసం చేయడం చేతకాదు కానీ మమ్మల్ని మోసం చేస్తే ఊరుకోబోమనే సందేశాన్ని కచ్చితంగా పంపిన రోజే మనకు నిజమైన స్వాతంత్య్రం వస్తుందని అన్నారు. దేశంలోని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి అవ్వకూ,తాతకు, ప్రతి అక్కకు, చెల్లికి, అన్నా తమ్ముళ్లకు పేరు పేరునా జగన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఏపీ శాసనమండలిలో పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఇతర నేతలు భూమన కరుణాకర్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాష్, వాసిరెడ్డి పద్మ, పుత్తా ప్రతాపరెడ్డి, ఎస్.దుర్గా ప్రసాదరాజు, పార్థసారథి, పేర్ని నాని, కరణం పద్మశ్రీ, బి.గురనాథరెడ్డి, కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, హెచ్.ఏ.రెహ్మాన్, మతీన్ ముజద్దీదీ, విజయచందర్ తదితరులు పాల్గొన్నారు.
 
హామీలిచ్చి నెరవేర్చకుండా మోసం చేశారు
‘ఆనాడు అధికార పక్షం (కాంగ్రెస్), ప్రతిపక్షం (బీజేపీ) రెండూ కలసి రాష్ట్రాన్ని విభజించేటప్పుడు పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి, పని అయిపోయిన తరువాత ఇవ్వబోమని మోసం చేస్తున్న పరిస్థితులు చూస్తుంటే అసలు మనకు స్వాతంత్య్రం వచ్చిందా? అన్పిస్తోంది. ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా ఉన్నవారు, ఆ పదవుల కోసం రేసులో ఉన్నవారు ఎన్నికల ముందు ఏదైనా మాట ఇస్తే దాన్ని నెరవేర్చాలి. కానీ ప్రజల చేత ఓట్లు వేయించుకున్న తర్వాత ఇచ్చిన మాటను నెరవేర్చకుండా మోసం చేస్తున్నారు.

జాబు కావాలంటే బాబు రావాలని ప్రచారం చేసుకున్నారు. తాను ముఖ్యమంత్రి అయితే బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి తెప్పిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఉద్యోగాల హామీకి దిక్కు లేదు. నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఇక అక్కా చెల్లెమ్మలను కూడా మోసం చేశారు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎగనామం పెట్టారు. మహిళల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తున్నాయి. అందరికీ ఇళ్లు కట్టిస్తామని చెప్పి మోసం చేశారు. ఇన్నిన్ని మోసాలు చేయొచ్చు. ఇన్నిన్ని అబద్ధాలు చెప్పొచ్చు కానీ.. అడిగే అధికారం ప్రజలకు లేదని పాలకులు మాట్లాడుతూ ఉంటే నిజంగా మనం స్వాతంత్య్రంలో ఉన్నామా? అని అనిపిస్తోంది..’ అని ప్రతిపక్ష నేత పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement