
ఉరుకులు..పరుగులు!
ఆకాశహర్మ్యాల కోసం వేగిరమైన పనులు
జిల్లా కలెక్టర్‌కు చేరిన భూ సర్వే నివేదిక
నేడో రేపో సర్కారుకు సమర్పణ
సిటీబ్యూరో: తెలంగాణ ప్రభుత్వం హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలను నిర్మించాలనే నిర్ణయానికి అనుగుణంగా లక్ష్యాన్ని చేరుకోవటానికి హైదరాబాద్ జిల్లా అధికారయంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది. గత నాలుగైదు రోజులుగా సాగర్ చుట్టూ 26 ప్రాంతాల్లో సర్వే నిర్వహించి, గుగూల్ ఆధారంగా రికార్డులు పరిశీలించిన రెవెన్యూ అండ్ భూ సర్వే అధికారులు 165 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నట్లుగా గుర్తించారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనాకు నివేదికను అందజేశారు. ఈ నివేదికను మరోక సారి క్షుణంగా పరిశీలించి సమగ్రంగా ప్రభుత్వానికి గురువారం సమర్పించేందుకు జిల్లా అధికారయంత్రాంగం కసరత్తు చేస్తున్నది. కబ్జాలో సుమారుగా 50 ఎకరాలకు పైగా ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ కబ్జా భూముల్లో భవన, షెడ్ల సముదాయాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ స్థలమని బోర్డులు ఏర్పాటు చేయటంతో పాటు...ప్రభుత్వ నిర్ణయం వెలువడగానే అందుకు అనుగుణంగా స్వాధీనం చేసుకుంటామని రెవెన్యూ శాఖాధికారులు వివరిస్తున్నారు. కాగా సర్వే అధికారులు కబ్జాల విషయంలో పక్కాగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఒకటికి రెండు సార్లు సర్వే చేసినట్లు తెలిసింది. ఈ సర్వే కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు సర్వేయర్లు సహాకరించారు.
బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో మరో 271 ఎకరాలు
సాగర్ చుట్టూ ఉన్న 26 ప్రాంతాలతో ఖాళీగా ఉన్న 147 ఎకరాల ప్రభుత్వ స్థలంతోపాటు... కోర్టు కేసులు, వివిధ వివాదాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
సాగర్ చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలు ప్రస్తుతం హెచ్‌ఎండీఏ అధ్వర్యంలోని బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో ఉన్నాయి. సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు నిర్మించాలనే ప్రతిపాదనల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పరిధిలో రికార్డుల ప్రకారం ఉన్న భూముల వివరాలను లెక్కగట్టగా 270 ఎకరాలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. సాగర్ చుట్టూ ఉన్న లుంబినీ పార్కు , పరిసర ప్రాంతాల్లో -10 ఎకరాలు, ఎన్టీఆర్ మెమోరియల్ గార్డెన్- 36 ఎకరాలు, డాక్టర్ కార్స్, ఐమాక్స్, ప్యారడైజ్ హోటల్- 10, ఐమాక్స్ ఎదురుగా పార్కింగ్ లాట్-03, లేక్‌వ్యూ పార్కు- 17.5, నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా-03.5, ఈట్ స్ట్రీట్- 10, నెక్లెస్ రోడ్‌లో పార్కింగ్ లాట్స్- 03, జలవిహార్- 12.5, ఆకారం పోచయ్య వెట్ ల్యాండ్ -20, సంజీవయ్య పార్కు- 90, సంజీవయ్య పార్కు ఎదురుగా-10, పీవీ జ్ఞాన భూమి- 03, హెర్బల్, మేజ్ గార్డెన్- 04, సెయిలింగ్ క్లబ్ ప్రాంతంలో- 05 , కిమ్స్ ఎదురుగా ఎకో-పార్కు-32 ఎకరాల చొప్పున మొత్తంగా 271 ఎకరాలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.