అసిస్టెంట్ డైరెక్టర్ మృతిపై అనుమానాలు
భాగ్యనగర్ కాలనీ: సినీ అసిస్టెంట్ డైరెక్టర్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం సీఐ పురుషోత్తమ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లాకు చెందిన విక్రమ్ చైతన్య (32) మూసాపేటలోని రెయిన్‌బో విస్తాలో గత ఏప్రిల్ నుంచి తల్లి విజయకుమారి, తమ్ముడు వివేక్‌తో కలిసి ఉంటూ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి మద్యం తాగి ఆదివారం రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చాడు. తాను ఉంటున్న ఇంటి రెండో అంతస్తుపై నుంచి కిందపడి చైతన్య మృతి చెంది ఉండగా.. రాత్రి 2 గంటలకు సెక్యూరిటీ గార్డు గమనించి మృతుడి తల్లికి తెలియజేశాడు. మద్యం మత్తులో రెండో అంతస్తుపై నుంచి పడిపోయాడా లేక ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నాడా? అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.