హిజ్రాపై కత్తులతో దాడి
బంజారాహిల్స్(హైదరాబాద్) : ఓ హిజ్రాపై పది మంది యువకులు దాడి చేసి కత్తితో గాయపరిచిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం రాత్రి హిజ్రా శివాని తన సహచరులతో కలిసి ఇందిరానగర్ గడ్డ మీద నిద్రిస్తుండగా పాత బస్తీకి చెందిన నదీమ్, బోరబండకు చెందిన మజ్జ మరో ఎనిమిది మంది ఆటోలో వచ్చి ఆమెను నిద్రలేపి, ఆటోలో అన్నపూర్ణ స్టూడియో కింద ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో వారి నుంచి తప్పించుకునేందుకు యత్నించింది.
దీంతో వారు కత్తితో ఆమె మెడపై కోయడంతో అక్కడే కుప్పకూలిపోయింది. బాధితురాలి సహచరులు అక్కడికి చేరుకోగా నిందితులు ఆటోలో పరారయ్యారు. శివానిని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితులి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.