third gender
-
ఢిల్లీలో తొలి ట్రాన్స్‌జెండర్ నామినేషన్
న్యూఢిల్లీ, సాక్షి: దేశ రాజధానిలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్లలో ఆసక్తికర పరిణామం జరిగింది. ఢిల్లీలో తొలి థర్డ్ జెండర్ అభ్యర్థి నామినేషన్ వేశారు. దక్షిణ ఢిల్లీ నియోజకవర్గానికి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.ధోతీ, తలపై టోపీ, బంగారు ఆభరణాలు ధరించి సాకేత్‌లోని దక్షిణ ఢిల్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న 26 ఏళ్ల రాజన్ సింగ్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. థర్డ్ జెండర్ వ్యక్తుల హక్కులతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలతోపాటు అధికారుల దృష్టిని ఆకర్షించేందుకు తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజన్ సింగ్ తెలిపారు.బిహార్‌కు చెందిన రాజన్ సింగ్ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో నివసిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు తన నామినేషన్ థర్డ్ జెండర్ ఉనికిని, హక్కులను తెలియజేసే ప్రయత్నం అని రాజన్ సింగ్ అన్నారు. దేశంలో జంతువులకు కూడా సంక్షేమ బోర్డులు ఉన్నాయి కానీ థర్డ్ జెండర్ వ్యక్తుల పరిస్థితి వాటి కన్నా హీనంగా ఉందని వాపోయారు. తాను గెలిస్తే, థర్డ్ జెండర్ ప్రాథమిక అవసరాలను పరిష్కరిస్తానని రాజన్ సింగ్ చెప్పారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,06,42,333
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,06,42,333కు చేరింది. అందులో 1,53,73,066 మంది పురుషులు, 1,52,51,797 మంది మహిళలు, 2,133 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక రెండో సవరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలను సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు/ కొత్తగా ఓటర్ల నమోదుకు దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 19 వరకు గడువు ఉందని తెలిపారు. సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలు, దరఖాస్తులను పరిష్కరించి అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఈ ఓటర్ల జాబితానే వినియోగించనున్నారు. ఇక రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలుండగా, ముసాయిదా జాబితాలో 3,06,26,996 మంది సాధారణ ఓటర్లతో పాటు మరో 2,742 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, 15,337 మంది సరీ్వసు ఓటర్లున్నారు. 18–19 వయస్సు కలిగిన యువ ఓటర్ల సంఖ్య 4,76,597. కొత్త ఓటర్లు 8,31,520 మంది ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2023లో భాగంగా గత జనవరి 5న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో మొత్తం 2,99,77,659 మంది ఓటర్లు ఉండగా, ఓటర్ల జాబితా నిరంతర నవీకరణలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 8,31,520 మంది ఓటర్లను నమోదు చేశారు. 1,82,183 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఓటు తొలగిస్తే 15 రోజుల్లోగా అప్పీల్ చేయాలి ముసాయిదా జాబితాలో ఎవరిదైన పేరును తప్పుగా తొలగిస్తే బాధిత ఓటర్లు 15 రోజుల గడువులోగా జిల్లా ఎన్నికల అధికారికి అప్పీల్ చేసుకోవాలని సూచించారు. లేకుంటే మళ్లీ కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫారం–6 దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ‘ఓటర్ల’ అధికారుల బదిలీలపై నిషేధం సీఈఓ వికాస్‌రాజ్ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్ల జాబితా రూ పకల్పనలో పాలుపంచుకుంటున్న అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఓటర్ల జాబితా సవరణలో కీలకమైన జిల్లా ఎన్నికల అధికారులు, ఉప జిల్లా ఎన్నికల అధికారులు, ఓటర్ల నమోదు అధికారులు, సహాయ ఓటర్ల నమోదు అధికారులు తదితర స్థాయి అధికారుల బదిలీలపై ఈ నెల 21 నుంచి అక్టోబర్ 4 వరకు నిషేధం అమల్లోకి ఉండనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ సోమవా రం ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ల జాబితా తయారీ బాధ్యతల్లోని అధికారులను బదిలీ చేస్తే జాబితా నాణ్యతపై ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. ఒకవేళ అత్యవసరంగా ఎవరైనా అధికారిని బదిలీ చేయాల్సివస్తే స్పష్టమైన వివరాలు అందజేసి ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి నుంచి బూత్ లెవల్ అధికారుల (బీఎల్ఓ) వరకు బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో ఈ నిబంధన లు వర్తిస్తాయన్నారు. దీర్ఘకాలిక సెలవు ల్లో వెళ్లడానికి ముందు ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందాలని అధికారులను సూచించారు. -
కానిస్టేబుల్ రాత పరీక్షకు "థర్డ్ జెండర్"
వరంగల్: పోలీస్ కానిస్టేబుళ్ల తుది రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. స్టయిఫండరీ ట్రెయినీ కానిస్టేబుళ్ల నియామకంలో భాగంగా అభ్యర్థుల పరీక్ష కోసం వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో 16 సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 12,029 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేయగా 11,910 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో ముగ్గురు థర్డ్ జెండర్లు ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు జరిగిన ఈ పరీక్ష కోసం అభ్యర్థులు ఉదయం 8 గంటల వరకే కేంద్రాలకు చేరుకున్నారు. పోలీస్ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది.. తనిఖీలు నిర్వహించి లోనికి అనుమతించారు. పరీక్ష ప్రశాంతంగా ముగియడానికి కృషిచేసిన పోలీస్ సిబ్బందిని సీపీ రంగనాథ్ అభినందించారు. -
ఒక్క ఫోన్ కాల్.. హిజ్రా ద్రాక్షాయణికి ఉద్యోగం
సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): హిజ్రాగా మారాడన్న కారణంతో బాధ్యతలు అప్పగించకుండా నిర్లక్ష్యానికి గురైన అభ్యర్థి సమస్యకు మంత్రి చొరవతో గంటలో పరిష్కారం లభించింది. తిరువళ్లూరు జిల్లా పూందమల్లికి చెందిన సంతానరాజ్ (42) 2010లో గ్రామ కార్యదర్శిగా ఉద్యోగం పొందాడు. 2016 వరకు కొడువేళి గ్రామంలో విధులు నిర్వహించాడు. అనంతరం సంతానరాజ్ హిజ్రాగా మారి ద్రాక్షాయణిగా పేరు మార్చుకున్నాడు. దీంతో కొడువేళి గ్రామాం బాధ్యతలను మరొకరికి అప్పగించి సంతానరాజ్ను పక్కన పెట్టారు. అప్పటి నుంచి అతనికి బాధ్యతలు అప్పగించలేదు. తనకు న్యాయం చేయాలని బాధితుడు మంత్రి నాజర్‌ను శుక్రవారం కలిశాడు. గంటలో అతనికి పునః నియామక పత్రం సిద్ధం చేయాలని మంత్రి పీడీని ఫోన్లో ఆదేశించారు. ఆవడిలోని మంత్రి నివాసానికి పీడీ పరుగులు పెట్టారు. సంబంధిత ఉత్తర్వులను మంత్రి నాజర్ చేతుల మీదుగా సంతానరాజ్ అందుకుని కొడువేళి గ్రామంలో విధుల్లో చేరారు. మంత్రి చర్యలకు పలువురు సోషల్ మీడియాలో ప్రశంసలు తెలుపుతున్నారు. -
ఏడేళ్ల క్రితం హిజ్రాగా మారిన యువకుడు.. మిత్రులు అన్యాయం చేశారని..
సాక్షి, కోలారు(కర్ణాటక): ఏడేళ్ల కిందట ఇల్లు వదిలి హిజ్రాగా మారిన శివకుమార్ అలియాస్ వందన (30) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గాంధీనగరలో నివాసం ఉంటున్న వందన గురువారం రాత్రి భిక్షాటన చేయగా వచ్చిన డబ్బును పంచుకోవడంలో తోటి హిజ్రాలతో గలాటా జరిగింది. మిత్రులు కూడా అన్యాయం చేశారన్న ఆవేదనకు లోనైన వందన శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. గల్‌పేట పోలీసులు పరిశీలన జరిపి కేసు నమోదు చేశారు. అడవి ఏనుగు కంటబడి.. మైసూరు: మైసూరు సమీపంలో చామరాజనగర జిల్లా పరిధిలోని బిళిగిరి రంగన బెట్ట ప్రాంతం పుణజనూరు వద్ద అడవి ఏనుగు దాడిలో ఒకరు మృతి చెందారు. చామరాజనగర తాలూకాకు చెందిన చాటి నింగయ్య (52) జాతీయ రహదారిలో నడుచుకుంటూ వెళ్తుండగా కొంతదూరంలో ఓ అడవి ఏనుగు రోడ్డు దాటుతోంది. అది నింగయ్యను చూసి కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన్ని కాళ్ళతో తొక్కి చంపింది. చామరాజనగర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. చదవండి: Afghanistan: విమానంలోనే అఫ్గన్ మహిళ ప్రసవం -
అతడి కోసం హిజ్రాగా మారిన యువకుడు!
సాక్షి, గిద్దలూరు(ఒంగోలు): ఆర్మీ జవాన్ వివాహాన్ని హిజ్రాలు అడ్డుకున్న సంఘటన గిద్దలూరు పట్టణంలో చోటుచేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాచర్ల మండలం పాలకవీడు గ్రామానికి చెందిన మగ్బూల్, అర్థవీడు మండలంలోని పాపినేనిపల్లెకు చెందిన వినీత్ క్లాస్మేట్స్ కాకుండా మంచి స్నేహితులు కూడా. అలా వీరిద్దరూ కలిసి ఆర్మీ సెలక్షన్స్‌కు వెళ్లేవారు. ఇద్దరూ నిత్యం మాట్లాడుకువారు. వారిలో మగ్బూల్ ఆర్మీకి ఎంపికవగా, వినీత్ ఎంపిక కాలేదు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం వినీత్ హిజ్రాగా మారి వినీతగా పేరు మార్చుకున్నాడు. అయినప్పటికీ మగ్బూల్‌తో స్నేహం కొనసాగిస్తూ వచ్చాడు. వారిద్దరి స్నేహాన్ని సహజీవనంగా కూడా మార్చుకున్నారు. మగ్బూల్ ఆర్మీలో ఉన్నప్పటికీ వినీతతో తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. సెలవుపై వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి సరదాగా తిరిగేవారు. ఇటీవల సెలవుపై వచ్చిన మగ్బూల్.. గిద్దలూరు పట్టణానికి చెందిన మహిళను వివాహం చేసుకునేందుకు నిశ్చయించుకున్నాడు. శుక్రవారం ఓ కల్యాణ మండపంలో వివాహం చేసుకుంటుండగా, సమాచారం తెలుసుకున్న హిజ్రా వినీత.. పలువురు హిజ్రాలతో కలిసి అక్కడకు చేరుకుని మగ్బూల్ వివాహాన్ని అడ్డుకుంది. తననే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. మగ్బూల్ నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడగా, కర్నూలు జిల్లాలోని నంద్యాల వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం. మగ్బూల్ కోసమే వినీత్ హిజ్రాగా మారినట్లు తెలుస్తోంది. -
ట్రాన్స్‌జెండర్స్‌కు శుభవార్త: ప్రధాని కానుక
వారణాసి: స్త్రీ, పురుషులకు అంటూ ప్రత్యేక టాయిలెట్స్ ఉండగా ట్రాన్స్‌జెండర్స్ ఎటు వెళ్లాలో తెలియక గందరగోళ పడేవారు. దీనిపై సినిమాల్లో కూడా చాలా కామెడీ సీన్స్ పండాయి. అవి నవ్వుకునేందుకు బాగానే ఉన్నా ట్రాన్స్‌జెండర్స్‌కు మాత్రం ఇబ్బందికర పరిస్థితులు. ఇకపై వారికి అలాంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా టాయిలెట్‌ను నిర్మించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ఈ టాయిలెట్ నిర్మించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా వారణాసిలోని కామాచ ప్రాంతంలో ట్రాన్స్‌జెండర్ టాయిలెట్‌ను అధికారులు నిర్మించారు. రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ టాయిలెట్‌ను గురువారం మేయర్ మృదుల జైస్వాల్ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోనే ఇది మొదటి ట్రాన్స్‌జెండర్ టాయిలెట్ అని మేయర్ తెలిపారు. వారికి అవసరమైన ఇతర ప్రాంతాల్లో కూడా టాయిలెట్స్‌ను నిర్మించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. ఈ టాయిలెట్లు ట్రాన్స్జెండర్ల కోసం మాత్రమేనని.. ఇతరులు వినియోగించరాదని వారణాసి మున్సిపల్ కమిషనర్ గౌరంగ్ రతి విజ్ఞప్తి చేశారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో మూడో వర్గానికి మరో నాలుగు టాయిలెట్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ మరుగుదొడ్డి నిర్మాణం పట్ల ట్రాన్స్జెండర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారణాసి మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇన్నాళ్లు తాము పడ్డ ఇబ్బందులు ఇకపై తొలగిపోనున్నాయి. ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా మా కోసం టాయిలెట్స్ నిర్మించాలి’ అని ట్రాన్స్‌జెండర్ రోహణి విజ్ఞప్తి చేశారు. -
అక్షయ్ బాటలో మిలింద్.. తొలిసారి ఆ పాత్రలో!
ప్రముఖ ఫిట్నెస్ ఫ్రీక్, నటుడు, మోడల్ మిలింద్ సోమన్ మరో వెబ్ సిరీస్‌తో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ‘పౌరాష్పూర్’ అనే పేరుతో రూపొందుతున్న వెబ్ సిరీస్‌లో మిలింద్ సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ఈ సిరీస్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అయిన జీ న్యూస్, ఏఎల్టీ బాలాజీలో ప్రసారం కానుంది. ఇక ఈ సీరిస్ చారిత్రక రాజ్యం, కుట్రలు, రాజకీయాలు, లింగ యుద్ధం నేపథ్యం ఆధారంగా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాలో తన క్యారెక్టర్‌ను వెల్లడిస్తూ ఫస్ట్ లుక్‌ను మిలింద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. పౌరాష్పూర్ సినిమాలో మిలింద్ .. థర్డ్‌జెండర్ అయిన బోరిస్ పాత్ర పోషిస్తున్నారు. చదవండి: విభిన్న లుక్‌లో మిలింద్ సోమన్! ఈ పోస్టర్లో మిలింద్ ముఖానికి పెద్దగా కుంకుమ బొట్టు, మెడలో బంగారు అభరణం ధరించి, చేతిలో కత్తి పట్టుకొని పవర్ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. "పౌరాష్‌పూర్‌లోని ట్రాన్స్ జెండర్‌ను ప్రపంచంలో ఇంతకు ముందు ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. శక్తి పోరాటం. గొప్ప తెలివి, మనస్సు, వ్యక్తిత్వం, ఇవ్వన్నీ పౌరాష్‌పూర్‌లోని బోరిస్‌కు సొంతం’. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అలాగే రేపు మధ్యాహ్నం రెండు గంటలకు టీజర్ విడుదల కానున్నట్లు తెలిపాడు. కాగా పౌరాష్‌పూర్‌లో శిల్పా షిండే, షాహీర్ షేక్, సాహిల్ సలాథియా, అన్నూ కపూర్ ముఖ్య పాత్రల్లో నటించారు. చదవండి: బూడిద పూసుకొని నగ్నంగా తిరిగితే తప్పు లేదా.. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning) -
తమిళ హిజ్రాకు కీలక పదవి
సాక్షి, చెన్నై: తమిళనాట పుట్టి, ఇక్కడే చదువుకుని ఐరోపా, అమెరికాల్లో రాణించి మళ్లీ భారత్‌కు వచ్చిన మూడో కేటగిరి (హిజ్రా)కి చెందిన సంయుక్తా విజయన్‌కు స్విగ్గీలో కీలక పదవి వరించింది. సంయుక్తను ప్రిన్సిపల్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా నియమించారు. ఈ పదవిలో చదువుకున్న మూడో కేటగిరి వారికి ప్రాధాన్యతను కల్పించే విధంగా ముందుకు సాగుతానని సంయుక్తా పేర్కొన్నారు. పురుషులు, స్త్రీలతో సమానంగా ఏ రంగంలో నైనా తామూ రాణిస్తామన్నట్టుగా హిజ్రాలూ దూసుకొస్తున్నారు. మూడో కేటగిరిలో ఉన్న ఈ హిజ్రాలకు ప్రభుత్వాలు సైతం ప్రత్యేక ప్రాధాన్యతను కల్పిస్తున్నాయి. కోర్టులు సైతం అండగా నిలబడుతుండడంతో పట్టభద్రులైన వారు వారికి నచ్చిన ఉద్యోగాల్ని దక్కించుకుంటున్నారు. ఇదే ఉత్సాహంతో ఉన్నత చదువులపై దృష్టి పెట్టే వారు క్రమంగా పెరుగుతున్నారు. మూడో కేటగిరిలో తాము ఉన్నా, ఏ రంగంలోనైనా రాణిస్తామన్న ధీమాతో పరుగులు తీస్తున్నారు. ఆ దిశగా ప్రస్తుతం తమిళనాడుకు చెందిన హిజ్రా సంయుక్తా విజయన్ ప్రముఖ ఫుడ్ డెలివర్ సంస్థ స్విగ్గిలో కీలక బాధ్యతలు చేపట్టడం విశేషం. మూడో కేటగిరికి ప్రాధాన్యత.... సంయుక్త విజయన్ తమిళనాడు వాసి. పుట్టింది ఇక్కడే. ఇక్కడి పీఎస్జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో బీఈ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ పూర్తి చేశారు. తాను హిజ్రాగా ఉన్నా, కుటుంబం నుంచి లభించిన ప్రోత్సాహంతో అడుగుల వేగాన్ని పెంచారు. ఐరోపా, అమెరికాల్లో ఫ్యాషన్ రంగంలోని కొన్ని సంస్థల్లో పనిచేశారు. భారత్‌కు తిరిగి వచ్చిన అనంతరం ఆన్లైన్ విక్రయ సంస్థ అమెజాన్‌లో పనిచేశారు. సొంతంగా ఫ్యాషన్ సంస్థతో ముందుకు సాగుతూ వచ్చిన సంయుక్తా విజయన్ ప్రస్తుతం స్విగ్గీలో కీలక బాధ్యతలు స్వీకరించారు. ఆ సంస్థలో ప్రిన్సిపల్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా నియమించబడ్డ సంయుక్త తమిళనాడు వాసి కావడంతో ఇక్కడి మీడియా ఆమె హిజ్రాలకు ఆదర్శంగా పేర్కొంటూ వార్తలను ప్రచూరించడం విశేషం. ఇక, తాను టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా స్విగ్గీలో హిజ్రాలకు ప్రాధాన్యతను కల్పించే దిశగా ముందుకు సాగుతానని సంయుక్తా పేర్కొన్నారు. మూడో కేటగిరిలో ఉన్న వారికి కార్పొరేట్ సంస్థలు ప్రాధాన్యతను పెంచే విధంగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేటగిరిలో పట్టభద్రులైన వారికి ఉద్యోగ అవకాశాలు మరింతగా మెరుగుపడాలని, అవకాశాలు దరి చేరాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. తనకు కుటుంబం ప్రోత్సాహం ఉండబట్టే ఈ స్థాయికి చేరానని పేర్కొంటూ ఈ కేటగిరిలో ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు ఆదరించాలని, అక్కున చేర్చుకుని ప్రోత్సాహాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అర్హత కల్గిన వారికి తన వంతుగా ఉద్యోగ అవకాశాల కల్పనలో సహాకారం అందిస్తానని, అలాగే, ప్రభుత్వాలు వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ తరగతుల్ని నిర్వహించి మూడో కేటగిరి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
థర్డ్ జండర్‌కు ఓటు హక్కు
సాక్షి,నెల్లూరు: భారత ఎన్నికల కమిషన్ పురుషులు, మహిళలతో పాటు థర్డ్ జండర్‌కు ఓటు హక్కు కల్పించింది. 2009 ఎన్నికల ముందు థర్డ్ జండర్‌కు ఓటు హక్కు లేదు. థర్డ్ జండర్లలో అవగాహన పెరగడం, సమాజంలో అందరితో సమానంగా జీవనం సాగిస్తున్నామని వారు అందోళన కార్యక్రమాలు చేశారు. దీంతో థర్డ్ జండర్‌కు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు మంజూరు చేశారు. వాటి ఆధారంగా దరఖాస్తులు చేసుకున్న వారికి ఓటు హక్కు కల్పించారు. 2009 ఎన్నికల నుంచి థర్డ్ జండర్‌కు ఓటు హక్కు కల్పించారు. 2014 ఎన్నికల నాటికి జిల్లాలో 298 మంది ఓటు హక్కు పొందారు. 2019 ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు 338 మంది ఓటు హక్కు పొందారు. -
చనిపోతా.. అనుమతివ్వండి
తిరువనంతపురం : గౌరవప్రదమైన జీవితం పొందలేకపోతున్న కారణంగా కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఓ థర్డ్ జెండర్ త్రిసూర్ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. త్రిసూరుకు చెందిన 51 ఏళ్ల సుజీ అనే వ్యక్తి తాను థర్డ్ జెండర్నని పేర్కొన్నారు. ఈ కారణంగానే తనకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఉద్యోగం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘పేదరికం, ఆకలితో అలమటించడం కన్నా చచ్చిపోవడమే ఉత్తమం. ఆకలితో అలమటిస్తూ నేను బతకలేను. అందుకే చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. కారుణ్య మరణం పొందేలా నాకు అనుమతి ఇవ్వండి’ అని లేఖలో సుజీ పేర్కొన్నారు. ఉపాధి కల్పించమని వేడుకున్నా... నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన సుజీ కొన్నాళ్ల పాటు సౌదీ అరేబియాలో ఉద్యోగం చేశారు. కానీ ఆమె గురించి అసలు నిజం తెలియడంతో ఆస్పత్రి వర్గాలు లింగ నిర్థారణ పరీక్షలకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. అందుకు సుజీ నిరాకరించడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. దాంతో సుజీ కేరళకు తిరిగి వచ్చేశారు. అయితే అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. దీంతో కాలికట్ ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో నర్సింగ్ పూర్తి చేసిన తనకు ఉద్యోగం కల్పించాల్సిందిగా త్రిసూర్ కలెక్టర్‌కు మూడుసార్లు లేఖలు రాశారు. కానీ కలెక్టర్ నుంచి ఎటువంటి సమాధానం లభించలేదు. దీంతో ఆవేదన చెందిన సుజీ.. ఈసారి తనకు కారుణ్య మరణం పొందేందుకు అనుమతివ్వాలంటూ లేఖ రాశారు. తండ్రి మరణంతో కుటుంబానికి దూరంగా... కేరళలోని త్రిప్రాయర్‌కు చెందిన సుజీ తన తల్లిదండ్రులు, ముగ్గురు సోదరులతో కలిసి జీవించేవారు. బాల్యంలో అందరూ తన గురించి హేళనగా మాట్లాడుతున్నప్పటికీ తండ్రి సహకారంతో పాఠశాల విద్యతో పాటు, నర్సింగ్ కూడా పూర్తి చేశారు. అయితే తండ్రి మరణించిన తర్వాత కుటుంబం సుజీని ఇంటి నుంచి వెలివేసింది. 1989లో ఉద్యోగం కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన సుజీ.. అక్కడ సంపాదించిన కొద్దిపాటి సొమ్ముతో కేరళలోని ఇడమట్టంలో చిన్న ఇల్లు నిర్మించుకున్నారు. అప్పటి నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ థర్డ్ జెండర్ అనే కారణంగా ఆమెకు ఎక్కడా ఉద్యోగం లభించలేదు. సహాయం కాదు..ఉద్యోగం కావాలి కారుణ్య మరణం గురించి సుజీ కలెక్టర్‌కు లేఖ రాసిన విషయం మీడియాలో ప్రచారం అయింది. ఇందుకు స్పందించిన పలు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక వేత్తలు ఆమెకు ఎందుకు ఉద్యోగం నిరాకరిస్తున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సుజీ.. ‘యునైటెడ్ నర్స్ అసోసియేషన్ నాకు 25 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పింది. శుక్రవారంలోగా నా ఇంటికి చెక్కు కూడా పంపిస్తామని తెలిపింది. అయితే నాకు కావాల్సింది డబ్బు కాదు. గౌరవప్రదంగా జీవించడానికి ఉద్యోగం కావాలి. ఎంతో మంది నాకు ఉద్యోగం కల్పిస్తామని చెప్తున్నారే తప్ప.. ఆ విషయంగా నన్ను ఎవరు సంప్రదించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
హిజ్రాపై కత్తులతో దాడి
బంజారాహిల్స్(హైదరాబాద్) : ఓ హిజ్రాపై పది మంది యువకులు దాడి చేసి కత్తితో గాయపరిచిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం రాత్రి హిజ్రా శివాని తన సహచరులతో కలిసి ఇందిరానగర్ గడ్డ మీద నిద్రిస్తుండగా పాత బస్తీకి చెందిన నదీమ్, బోరబండకు చెందిన మజ్జ మరో ఎనిమిది మంది ఆటోలో వచ్చి ఆమెను నిద్రలేపి, ఆటోలో అన్నపూర్ణ స్టూడియో కింద ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో వారి నుంచి తప్పించుకునేందుకు యత్నించింది. దీంతో వారు కత్తితో ఆమె మెడపై కోయడంతో అక్కడే కుప్పకూలిపోయింది. బాధితురాలి సహచరులు అక్కడికి చేరుకోగా నిందితులు ఆటోలో పరారయ్యారు. శివానిని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితులి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
వారి కోసం రైల్వే రిజర్వేషన్లో ప్రత్యేక కాలమ్
న్యూఢిల్లీ: లింగమార్పిడి వ్యక్తుల్ని భారతీయ రైల్వే థర్డ్ జెండర్‌గా గుర్తిస్తూ వారి కోసం రైల్వే రిజర్వేషన్, క్యాన్సిలేషన్ దరఖాస్తుల్లో స్త్రీ, పురుషులతో పాటు మూడో కాలమ్ కేటాయించింది. టికెట్ కౌంటర్లతో పాటు ఆన్లైన్ విధానంలోనూ త్వరలో ఇది అమలుకానుంది. హిజ్రాలు, లింగమార్పిడి వ్యక్తుల హక్కుల్ని కాపాడేందుకు వారిని థర్డ్ జెండర్‌గా గుర్తించాలంటూ 2014లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, దీంతో వారికోసం కాలమ్ కేటాయిస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. -
లెస్బియన్లు, గేలు ట్రాన్స్జెండర్లు కారు
సుప్రీం స్పష్టీకరణ న్యూఢిల్లీ: లెస్బియన్లు, గేలు, ద్విలింగ సంపర్కులు సమాజంలో మూడోవర్గం (థర్డ్ జెండర్) కిందకు రారని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని 2014 ఏప్రిల్ 15న ఇచ్చిన తీర్పులోనే స్పష్టంగా చెప్పిన ట్లు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం తెలిపింది. నాటి తీర్పు వచ్చిన అనంతరం ఈ విషయంలో మరింత స్పష్టతనివ్వాలంటూ 2014 సెప్టెంబరులో కేంద్రం సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన విచారణకు అదనపు సొలిసిటర్ జనరల్ మణీందర్ సింగ్ కేంద్రం తరఫున హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ 2014 నాటి తీర్పుననుసరించి లెస్బియన్లు, గేలు, ద్విలింగ సంపర్కులను మూడోవర్గంగా పరిగణించాలా వద్దా అనే విషయంలో త మకు అయోమయం నెలకొందని అన్నారు. ఈ విషయంలో మరింత స్పష్టతనివ్వాలని కోరారు. ట్రాన్స్‌జెండర్ కార్యకర్తల తరఫున విచారణకు హాజరైన న్యాయవాది ఆనంద్ గ్రోవర్ తన వాదన వినిపిస్తూ గత రెండేళ్లుగా కేంద్రం 2014 నాటి కోర్టు తీర్పును అమలు చేయడం లేదని, ట్రాన్స్జెండర్ల విషయంలో తమకు కూడా స్పష్టత కావాలని అడిగారు. ఈ అభ్యర్థనలపై కోర్టు స్పందిస్తూ ‘హిజ్రాలను మూడోవర్గంగా గుర్తించాలని మేం 2014 నాటి తీర్పులోనే చెప్పాం. వారికి చట్టబద్ధ గుర్తింపు కల్పించి, విద్యలోనూ సామజికంగాను వెనుకబడిన వారిగా పరిగణించాలని కేంద్రం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించాం. వారికి విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పాం. వీరి జాబితాలోకి లెస్బియన్లు, గేలు, ద్విలింగ సంపర్కులు రారు’ అని గురువారం నాటి తీర్పులో వివరించింది. -
లింగమార్పిడి వారు మాత్రమే థర్డ్ జండర్
న్యూఢిల్లీ: థర్డ్ జెండర్‌పై గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గురువారం థర్డ్ జండర్ అంశంపై విచారణ జరిపిన ధర్మాసనం.. కేవలం లింగమార్పిడి వ్యక్తులు మాత్రమే థర్డ్ జెండర్ పరిధిలోకి వస్తారని మరోసారి స్పష్టం చేసింది. లెస్బియన్లు, గే లు, బైసెక్సువల్ వ్యక్తులు థర్డ్ జెండర్ పరిధిలోకి రారని ఈ సందర్భంగా మరోసారి గతంలోని ఆదేశాలను నొక్కి చెప్పింది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్న కోర్టు.. 2014 తీర్పుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. -
ఆ కాలమ్ ఎందుకు చేర్చలేదు?
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో థర్డ జెండర్ కాలమ్‌ను చేర్చకపోవడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మంగళవారం జస్టిస్ ముక్త గుప్తా, పీఎస్ తేజీలతో కూడిన న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం, యూపీఎస్ఈలకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై సుప్రీం స్పష్టమైన తీర్పు ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోకపోవడంపై కోర్టు మండి పడింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ట్రాన్స్ జెండర్ల పట్ల వివక్ష తగదని కోర్టు పేర్కొంది. జెండర్ కారణంగా ట్రాన్స్ జెండర్స్‌ను ఎలా అడ్డుకుంటారని కోర్టు ప్రశ్నించింది. కాగా ఆగస్టు 23 న జరిగే ఈ పరీక్షకోసం ఇచ్చిన ప్రకటనలో్ థర్డ్ జెండర్ కాలమ్ లేకపోవడంపై దాఖలైన పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దీనిపై జూన్ 17 లోపు దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని యూపీఎస్సీని ఆదేశించింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు జూన్ 19తో ముగియనుంది కనుక ఈ లోపుగానే వివరణ ఇవ్వాలని కోర్టు కోరింది. కాగా ట్రాన్స్ జెండర్ లను మనుషులుగా గుర్తించాలని, విద్యా, ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలని దాఖలైన పిటిషన్ పై ఏప్రిల్ 15, 2014 సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పును వెలువరించింది. సామాజికంగా,ఆర్థికంగా వెనుకబడిన వారిని వెనుబడిన తరగతులవారికి వర్తించే అన్ని రిజర్వేషన్స్ వర్తింప చేయాలని, వారికోసం ప్రత్యేకంగా థర్డ్ జెండర్ కాలమ్ ను చేర్చాలని కేంద్రం ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొన్ని సంస్థలు స్పందించిన ఈ ఆదేశాలను అమలు చేస్తున్నాయి కూడా. -
ఔను... ఇప్పుడు మాకూ 'గుర్తింపు' ఉంది
-
''స్వలింగ సంపర్కులకు సర్వహక్కులు''
-
స్వలింగ సంపర్కులకు సర్వహక్కులుః సుప్రీం కోర్టు సంచలన తీర్పు
స్వలింగ సంపర్కులు, నపుంసకులు, తృతీయ ప్రకృతికి చెందిన వారిని మిగతా పౌరుల్లాగానే చూడాలని, మిగతావారికి ఉన్న సామాజిక ఆమోదం, సమానావకాశాల వంటి అన్ని హక్కులు వారికి కూడా ఉండాలని సుప్రీం కోర్టు బుధవారం సంచలనాత్మక తీర్పునిచ్చింది. వీరిని తృతీయ ప్రకృతిగా పరిగణించాలని సర్వోచ్చ న్యాయస్థానం పేర్కొంది. న్యాయమూర్తులు కె ఎస్ రాధాకృష్ణన్, ఎకె సిక్రీలతో కూడిన ధర్మాసనం ఈ చరిత్రాత్మక తీర్పునిచ్చింది. తృతీయప్రకృతి పట్ల వివక్షను అంతమొందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది. తృతీయ ప్రకృతిని సామాజికంగా వెనుకబడిన వారిగా గుర్తించాలని కూడ న్యాయస్థానం ఆదేశించింది. డ్రైవింగ్ లైసెన్సులు, రేషన్ కార్డులు, ఎన్నికల గుర్తింపు కార్డు, పాస్ పోర్టుల దరఖాస్తు ఫారాల్లో స్త్రీ, పురుష తో పాటు తృతీయ ప్రకృతి అనే క్యాటగరీని జోడించాలని, వారికి విద్యా సంస్థల్లో, ఆసుపత్రుల్లో ప్రవేశాన్ని కల్పించాలని, వారికి టాయిలెట్ల ఏర్పాటు చేయించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. లక్ష్మీ త్రిపాఠీ అనే తృతీయ ప్రకృతికి చెందిన వ్యక్తి వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు ఈ సంచలనాత్మక తీర్పును వెలువరించింది. లక్ష్మీ త్రిపాఠీ ఈ తీర్పును చరిత్ర గతిని మార్చేసే తీర్పుగా అభివర్ణించింది.