సాక్షి, చెన్నై: తమిళనాట పుట్టి, ఇక్కడే చదువుకుని ఐరోపా, అమెరికాల్లో రాణించి మళ్లీ భారత్‌కు వచ్చిన మూడో కేటగిరి (హిజ్రా)కి చెందిన సంయుక్తా విజయన్‌కు స్విగ్గీలో కీలక పదవి వరించింది. సంయుక్తను ప్రిన్సిపల్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా నియమించారు. ఈ పదవిలో చదువుకున్న మూడో కేటగిరి వారికి ప్రాధాన్యతను కల్పించే విధంగా ముందుకు సాగుతానని సంయుక్తా పేర్కొన్నారు. పురుషులు, స్త్రీలతో సమానంగా ఏ రంగంలో నైనా తామూ రాణిస్తామన్నట్టుగా హిజ్రాలూ దూసుకొస్తున్నారు. మూడో కేటగిరిలో ఉన్న ఈ హిజ్రాలకు ప్రభుత్వాలు సైతం ప్రత్యేక ప్రాధాన్యతను కల్పిస్తున్నాయి. కోర్టులు సైతం అండగా నిలబడుతుండడంతో పట్టభద్రులైన వారు వారికి నచ్చిన ఉద్యోగాల్ని దక్కించుకుంటున్నారు. ఇదే ఉత్సాహంతో ఉన్నత చదువులపై దృష్టి పెట్టే వారు క్రమంగా పెరుగుతున్నారు. మూడో కేటగిరిలో తాము ఉన్నా, ఏ రంగంలోనైనా రాణిస్తామన్న ధీమాతో పరుగులు తీస్తున్నారు. ఆ దిశగా ప్రస్తుతం తమిళనాడుకు చెందిన హిజ్రా సంయుక్తా విజయన్ ప్రముఖ ఫుడ్ డెలివర్ సంస్థ స్విగ్గిలో కీలక బాధ్యతలు చేపట్టడం విశేషం.
మూడో కేటగిరికి ప్రాధాన్యత....
సంయుక్త విజయన్ తమిళనాడు వాసి. పుట్టింది ఇక్కడే. ఇక్కడి పీఎస్‌జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో బీఈ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ పూర్తి చేశారు. తాను హిజ్రాగా ఉన్నా, కుటుంబం నుంచి లభించిన ప్రోత్సాహంతో అడుగుల వేగాన్ని పెంచారు. ఐరోపా, అమెరికాల్లో ఫ్యాషన్ రంగంలోని కొన్ని సంస్థల్లో పనిచేశారు. భారత్‌కు తిరిగి వచ్చిన అనంతరం ఆన్‌లైన్ విక్రయ సంస్థ అమెజాన్‌లో పనిచేశారు. సొంతంగా ఫ్యాషన్ సంస్థతో ముందుకు సాగుతూ వచ్చిన సంయుక్తా విజయన్ ప్రస్తుతం స్విగ్గీలో కీలక బాధ్యతలు స్వీకరించారు. ఆ సంస్థలో ప్రిన్సిపల్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా నియమించబడ్డ సంయుక్త తమిళనాడు వాసి కావడంతో ఇక్కడి మీడియా ఆమె హిజ్రాలకు ఆదర్శంగా పేర్కొంటూ వార్తలను ప్రచూరించడం విశేషం. ఇక, తాను టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా స్విగ్గీలో హిజ్రాలకు ప్రాధాన్యతను కల్పించే దిశగా ముందుకు సాగుతానని సంయుక్తా పేర్కొన్నారు.
మూడో కేటగిరిలో ఉన్న వారికి కార్పొరేట్ సంస్థలు ప్రాధాన్యతను పెంచే విధంగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేటగిరిలో పట్టభద్రులైన వారికి ఉద్యోగ అవకాశాలు మరింతగా మెరుగుపడాలని, అవకాశాలు దరి చేరాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. తనకు కుటుంబం ప్రోత్సాహం ఉండబట్టే ఈ స్థాయికి చేరానని పేర్కొంటూ ఈ కేటగిరిలో ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు ఆదరించాలని, అక్కున చేర్చుకుని ప్రోత్సాహాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అర్హత కల్గిన వారికి తన వంతుగా ఉద్యోగ అవకాశాల కల్పనలో సహాకారం అందిస్తానని, అలాగే, ప్రభుత్వాలు వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ తరగతుల్ని నిర్వహించి మూడో కేటగిరి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment