
సాక్షి, కోలారు(కర్ణాటక): ఏడేళ్ల కిందట ఇల్లు వదిలి హిజ్రాగా మారిన శివకుమార్ అలియాస్ వందన (30) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గాంధీనగరలో నివాసం ఉంటున్న వందన గురువారం రాత్రి భిక్షాటన చేయగా వచ్చిన డబ్బును పంచుకోవడంలో తోటి హిజ్రాలతో గలాటా జరిగింది. మిత్రులు కూడా అన్యాయం చేశారన్న ఆవేదనకు లోనైన వందన శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. గల్‌పేట పోలీసులు పరిశీలన జరిపి కేసు నమోదు చేశారు.
అడవి ఏనుగు కంటబడి..
మైసూరు: మైసూరు సమీపంలో చామరాజనగర జిల్లా పరిధిలోని బిళిగిరి రంగన బెట్ట ప్రాంతం పుణజనూరు వద్ద అడవి ఏనుగు దాడిలో ఒకరు మృతి చెందారు. చామరాజనగర తాలూకాకు చెందిన చాటి నింగయ్య (52) జాతీయ రహదారిలో నడుచుకుంటూ వెళ్తుండగా కొంతదూరంలో ఓ అడవి ఏనుగు రోడ్డు దాటుతోంది. అది నింగయ్యను చూసి కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన్ని కాళ్ళతో తొక్కి చంపింది. చామరాజనగర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.