వీకెండ్ విధ్వంసం.. టార్గెట్.. సిటీ
►వారాంతంలో పేలుళ్లు, విధ్వంసాలకు ముష్కరుల కుట్ర
► పేలుళ్ల తర్వాత విచ్చలవిడిగా కాల్పులు జరిపేందుకు పథకం
► ఉగ్రవాదుల జాబితాలో 15 టార్గెట్లు.. వాటిలో మూడింటిని ఎంచుకొని ఒకేరోజు ఏకకాలంలో దాడులకు ప్లాన్
► బాంబుల తయారీకి అవసరమైన సామగ్రి అంతా ఇక్కడే కొనుగోలు
► ‘మాల్ తయ్యార్ హై..’ అంటూ సిరియాలోని ఆర్మర్‌తో సంప్రదింపులు
► జూలై 6లోపు ‘ఆపరేషన్’ పూర్తి చేయాలంటూ ఆర్మర్ ఆదేశం
► ఈ వారాంతంలో పేలుళ్లకు స్కెచ్.. ఇంతలోనే భగ్నం చేసిన ఎన్‌ఐఏ
► అరెస్టైన ఐదుగురికి 14 వరకు జ్యుడీషియల్ రిమాండ్
►మిగిలిన ఆరుగురినీ సాక్షులుగా మార్చిన ఎన్‌ఐఏ
ముష్కరులు ఈ వారాంతంలోనే హైదరాబాద్‌లో మారణహోమం సృష్టించేందుకు కుట్రపన్నారా? గురు, శుక్రవారాల్లో బాంబుల్ని తయారు చేసి, శని, ఆదివారాల్లో పేలుళ్లకు పథకం రచించారా? పాతబస్తీతోపాటు సికింద్రాబాద్‌లోని ప్రార్థన స్థలాలు.. ఐటీ కారిడార్‌లోని మాల్స్.. నగరంలోని జనసమ్మర్థ ప్రాంతాలను టార్గెట్ చేశారా? ఔననే అంటున్నాయి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) వర్గాలు. బుధవారం ఎన్‌ఐఏ అరెస్ట్ చేసిన అనుమానిత ఉగ్రవాదుల విచారణ, సాంకేతిక అంశాల విశ్లేషణలో వారి కుట్ర వ్యూహాలు వెలుగులోకి వచ్చాయి. పాతబస్తీలోని 10 ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అనుబంధ సంస్థ అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ)కు చెందిన 11 మందిని అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ వర్గాలు.. వారిలో ఐదుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన ఆరుగురిని సాక్షులుగా మార్చి గురువారం విడుదల చేశారు. - సాక్షి, హైదరాబాద్
అన్నీ ఇక్కడే కొన్నారు..
హైదరాబాద్‌తోపాటు దేశ వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించడానికి సిద్ధమైన ఏయూటీ మాడ్యుల్ అందుకు అవసరమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్థానికంగానే సమకూర్చుకున్నాయి. పాతబస్తీలోని వివిధ మెడికల్ షాపులు, ఫెర్టిలైజర్స్ దుకాణాలు, వాచ్‌షాపులతో పాటు ఇతర దుకాణాల నుంచి తమకు అవసరమైన సామగ్రిని సమీకరించుకున్నారు. యూరియా, పంచదార, మినరల్ యాసిడ్, ఎసిటోన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, మూడు లీటర్ల పెయింట్ కొనుగోలు చేసిన ముష్కరులు.. వాటితో బాంబులు తయారు చేసేందుకు అవసరమైన ఉపకరణాలను సిద్ధం చేసుకున్నారు. ఈ ముఠాకు చీఫ్‌గా వ్యవహరించిన ఇబ్రహీం యజ్దానీ ఇటీవల దుబాయ్ వెళ్లి వచ్చాడు. దీంతో ఇబ్రహీం అక్కడ ఆర్మర్‌కు చెందిన వ్యక్తుల్ని కలసి ఉంటాడని ఎన్‌ఐఏ అనుమానిస్తోంది.
మాల్ తయ్యార్ హై..
అవసరమైన పేలుడు పదార్థాలు సిద్ధం చేసుకున్న ముష్కరులు వాటన్నింటినీ హష్మాబాద్‌లో ఉండే హబీబ్ మహ్మద్ ఇంటి పరిసరాల్లో దాచి పెట్టారు. అక్కడే బాంబులు తయారీకి సన్నాహాలు చేశారు. ఇబ్రహీం యజ్దానీ గతనెలలో సిరియాలో ఉన్న షఫీ ఆర్మర్‌ను ఆన్‌లైన్‌లో సం ప్రదించి.. ‘‘మాల్ తయ్యార్ హై... క్యా కర్ నా?’ అని అడిగాడు. దీనికి ఆర్మర్... బాంబులు ఎలా తయారు చేయాలో చెప్పే వీడియోలు పంపిస్తానని చెప్పాడు. అన్న ప్రకారమే కొన్ని వీడియోలను సోషల్ మీడియా యాప్ ద్వారా పంపించాడు. వాటి ఆధారంగా ఇబ్రహీం నేతృత్వంలో హబీబ్ ఇంట్లో ప్రయోగాలు ప్రారంభించారు. బాంబుల్లో టైమర్లుగా వినియోగించడానికి చిన్న సైజు అలారం గడియారం కూడా కొన్నారు.
6 లోపు పూర్తి చేయాలని ఆదేశాలు
ఆన్‌లైన్ ద్వారా గతవారం ఇబ్రహీంను సంప్రదించిన షఫీ ఆర్మర్.. జూలై ఆరో తేదీ లోపు ఆపరేషన్ పూర్తి చేయాలని ఆదేశించాడు. వీకెండ్స్‌లోనే విధ్వంసానికి సిద్ధం కావాలని చెప్పాడు. అందుకు అవసరమైన నగదు అందకపోవడంతో గత వారం చేపట్టాల్సిన ఆపరేషన్ వాయిదా పడింది. తర్వాత రూ.15 లక్షల నగదు అందుకున్న ఇబ్రహీం ఈ వారాం తంలోనే పేలుళ్లకు ప్రణాళికలు రచించాడు. బుధవారం అరెస్టు కాకుండా ఉండి ఉంటే... గురు/శుక్రవారాల్లో బాంబుల్ని తయారు చేసి, శని/ఆదివారాల్లో పేలుళ్లు జరపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు మిగిలిన నలుగురూ అంగీకరించడంతో సన్నాహాలు ముమ్మరం చేశారు.
షాక్ నుంచి కోలుకొనే లోపు..
ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో వారాంతంలో బాంబు పేలుళ్లకు పాల్పడటంతో పాటు అక్కడున్న జనాలు ఆ షాక్ నుంచి కోలుకునే లోపే విచ్చలవిడిగా కాల్పులు జరిపేందుకు ముష్కరులు కుట్ర పన్నారు. ఇందుకోసం వారు రెండు .9 ఎంఎం సెమీ ఆటోమాటిక్ పిస్టల్స్‌తో పాటు కొన్ని తూటాలను మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి కొనుగోలు చేశారు. కొందరికి పైరింగ్ రాకపోవడం తో హబీబ్ ఇంటికి సమీపంలో ఉన్న బండ్లగూడ గుట్టల్లో ప్రాక్టీస్ చేసేందుకు ఉపక్రమించారు. అయితే వారి వద్ద కొన్ని తూటాలే ఉండటంతో ప్రాక్టీస్ కోసం వాటిని వాడలేదు. దీంతో ఫహద్ వద్ద ఉన్న టెలిస్కోపిక్ ఎయిర్‌గన్‌తో ప్రాక్టీస్ చేశారు. స్థానికంగా కొన్ని పిల్లెట్స్‌ను ఖరీదు చేసి వాటితో ఎయిర్‌గన్ ద్వారా గుట్టల్లో ప్రాక్టీస్ చేశారు.
అన్ని ప్రాంతాల్లో టార్గెట్స్ ఎంపిక
ఏయూటీ మాడ్యూల్ పాతబస్తీతో పాటు ఐటీ కారిడార్‌లోని మాల్స్, ఇతర జనసమ్మర్థ ప్రాంతాల్లో సాయంత్రం 5 నుంచి 7 గం. మధ్య పంజా విసిరేందుకు సిద్ధమైంది. ఈలోపు ఎన్‌ఐఏ అధికారులు వీరి కుట్రను భగ్నం చేయడంతో ఆపరేషన్ ఆగిపోయింది. బుధవారం అరెస్టు చేసిన మహ్మద్ ఇబ్రహీం అలియాస్ ఇబ్బు, హబీబ్ మహ్మద్ అలియాస్ సిర్, మహ్మద్ ఇలియాస్, అబ్దుల్ బిన్ అహ్మద్ అమౌదీ అలియాస్ ఫహద్, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్ లను గురువారం ఎన్‌ఐఏ అధికారులు గురువారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జూలై 14 వరకు వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. తదుపరి విచారణ కోసం ఆ ఐదుగురినీ తమ కస్టడీకి అనుమతించాలని కోర్టులో ఎన్‌ఐఏ పిటిషన్ దాఖలు చేసింది.
20న ఆదేశాలు.. 22న ఎఫ్‌ఐఆర్.. 29న అరెస్టు
కేంద్ర నిఘా వర్గాల ద్వారా ఏయూటీ హైదరాబాద్ మాడ్యుల్ వివరాలు తెలుసుకున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా జూన్ 20న ఎన్‌ఐఏకు ఆదేశాలిచ్చింది. దీంతో హైదరాబాద్ ఎన్‌ఐఏ యూనిట్ 22న ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసింది. ఈ యూనిట్ ఈ ఏడాది నమో దుచేసిన తొలికేసు ఇదే. బుధవారం అరెస్టు చేసిన నిందితులపై ఎన్‌ఐఏ ఐపీసీ 121 (ఎ), 122, ఎక్స్‌ప్లోజివ్స్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్‌లోని 4, 5, అన్‌లాఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్‌లోని 18 , 18 బీ, 38, 39 సెక్షన్లపై దేశద్రోహం తదితర అభియోగాలు నమోదు చేశారు. బుధవారం ఉదయం నుంచే దాడులు, అరెస్టులకు 8 మంది ఉన్నతాధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌తో పాటు కోచి, ముంబైలకు చెందిన అధికారులను ఇందుకోసం రప్పించారు.
రెండు నెలల కిందటే ఆ‘రా’
ఐఎస్ అనుబంధ ఉగ్రవాదుల కుట్రను ఛేదించడంలో రీసెర్చ్ అనాలసిస్ వింగ్ (రా) కీలకంగా వ్యవహరించింది. కుట్రకు సరిగ్గా 2 నెలల కిందట ఫేస్‌బుక్, వాట్సప్ ద్వారా అనుమానాస్పద మేసేజ్‌లు చక్కర్లు కొట్టాయి. దాంతో అనుమానం వచ్చిన ‘రా’ అధికారులు వాటిపై దృష్టిసారించారు. వెంటనే ఆ ఖాతాల ఫేస్‌బుక్ అకౌంట్‌తో పాటు పాస్‌వర్డ్‌లను హైదరా బాద్‌కు పంపించారు. అలా పంపిన వాటి ద్వారా నిత్యం చాటింగ్ చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించి ఇతర నిఘా సంస్థలను హెచ్చరించారు. రంగంలోకి దిగిన కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు అనుమానితులను గుర్తించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి. అనుమానిత కదలికలపై పక్షం రోజులుగా నిఘా వేశారు. ఉగ్రకుట్ర భగ్నం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో తనిఖీలను ముమ్మరం చేశారు.
ఎయిర్‌పోర్ట్‌పై టార్గెట్?
ముష్కరులు మొత్తమ్మీద నగరంలోని 15 ప్రాంతాల్లో రెక్కీ చేసి.. వాటిలో మూడింటిని ఎంచుకుని ఒకే రోజు, ఒకే సమయంలో పంజా
విసిరేందుకు వ్యూహం రచించారు. ఇప్పటికే కొన్ని చోట్ల రెక్కీ పూర్తి చేశారని సమాచారం. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఈ ఏడాది మార్చి 22న విమానాశ్రయంపై దాడి తరహాలోనే ఇక్కడా విరుచుకుపడాలని భావించారు. అందుకు అనుగుణంగానే బ్యాగేజ్ స్కానర్లకూ చిక్కని టీఏటీపీ (ట్రైఎసిటోన్ ట్రై పెరాక్సైడ్)ని వినియోగించాలనుకున్నారు. దీనిపై షఫీ ఆర్మర్‌తో సంప్రదింపులు జరిపారు. అయితే అంతా కొత్తవారు కావడంతో శంషాబాద్ విమానాశ్రయం వంటి అత్యంత కట్టుదిట్టమైన ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించడం సాధ్యం కాదంటూ ఆర్మర్ వారించినట్లు తెలిసింది. ఎన్‌ఐఏ అరెస్టు చేసిన ఐదుగురి నుంచి హైటెక్ సిటీ, ఆ పరిసర ప్రాంతాల్లో నిత్యం రద్దీగా ఉండే 2 రోడ్లకు సంబంధించిన మ్యాప్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఆరుగురితో ‘164’ స్టేట్‌మెంట్
అరెస్టయిన ఐదుగురితో పాటు అదుపులోకి తీసుకున్న మహ్మద్ ఇర్ఫాన్, సయ్యద్ నైమతుల్లా హుస్సేనీ, మహ్మద్ అథుల్లా రెహ్మాన్, అల్ జిలానీ అబ్దుల్ ఖదీర్ మోసిన్ మహ్మద్, ఏఎం అజర్, మహ్మద్ అరబ్ అహ్మద్ పూర్వాపరాలను ఎన్‌ఐఏ క్షుణ్ణంగా పరిశీలించింది. వీరు ఇబ్రహీం తదితరులతో సంబంధాలు కొనసాగించినా... అరెస్టు చేయదగ్గ పాత్ర లేదని ప్రాథమికంగా తేల్చింది. ఈ నేపథ్యంలోనే ఈ ఆరుగురిని సాక్షులుగా పరిగణిస్తూ మేజిస్ట్రేట్ ఎదుట సీఆర్పీసీలోని 164 సెక్షన్ ప్రకారం వాంగ్మూలం నమోదు చేసి విడిచిపెట్టారు. ఇది నిందితులపై నేరం నిరూపించడానికి బలమైన ఆధారంగా మారనుంది.
టార్గెట్లు ఇవే..
1. చార్మినార్‌కు ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మీ దేవాలయం
2. సికింద్రాబాద్‌లోని గణేశ్ దేవాలయం
3. ఐటీ కారిడార్‌లో ఉన్న హైటెక్ సిటీ, ఇనార్బిట్ మాల్
4. దిల్‌సుఖ్‌నగర్ , బేగంబజార్‌లోని మార్కెట్లు
5. కొందరు ప్రముఖులతోపాటు ప్రభుత్వ ఆస్తులు, పోలీసుల భవనాలు