అందుబాటులో ధరలు
=సరసమైన రేట్లకే కూరగాయలు
=రైతుబజార్‌లో టమాటా, మిర్చి కిలో రూ.12
సాక్షి, సిటీబ్యూరో : నగరంలో కూరగాయ ధరల చిటపట బాగా తగ్గిపోయింది. గత నెలతో పోలిస్తే... ఇప్పుడు అన్ని రకాల కూరగాయలు సరసమైన ధరలకే లభిస్తుండటం వినియోగదారులకు ఊరట కల్గిస్తోంది. ప్రధానంగా అన్ని వర్గాల ప్రజలు నిత్యం వినియోగించే టమాటా, మిర్చి దిగుబడి అనూహ్యంగా పెరగడంతో ధరలు కూడా కిందికి దిగివచ్చాయి. గత నెల మొదటి వారంలో రైతుబజార్‌లో పచ్చిమిర్చి, టమోటా కిలో రూ.32-35లకు విక్రయించగా, రిటైల్ మార్కెట్లో కేజీ రూ.40లు ధర పలికాయి. ఇప్పుడవి రైతుబజార్‌లో కేజీ రూ.12ల కే లభిస్తున్నాయి. అదే రిటైల్ మార్కెట్లో అయితే ఈ రేట్లకు మరో రూ.4-8లు అదనంగా వసూలు చేస్తున్నారు.
తగ్గిన ధరలు ఒక్క టమాటా, పచ్చిమిర్చికే పరిమితం కాకుండా మిగతా కూరగాయలు కూడా ఇప్పుడు వినియోగదారుడికి అందుబాటులోనే ఉన్నాయి. అలాగే కన్నీళ్లు పెట్టించిన ఉల్లి ధర కూడా అనూహ్యంగా కిందికి దిగివచ్చింది. ప్రస్తుతం నాణ్యమైన ఉల్లి కేజీ రూ.18-20లకే లభిస్తోంది. సీజన్ ప్రారంభం కావడంతో అన్నిరకాల కూరగాయల దిగుబడి రోజురోజుకూ పెరుగుతోంది.
ప్రస్తుతం బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్ హోల్‌సేల్ మార్కెట్లతో పాటు మాదన్నపేట, మీరాలంమండి మార్కెట్లకు రోజుకు 55వేల క్వింటాళ్లకు పైగా అన్నిరకాల కూరగాయలు దిగుమతవుతుండగా, నగరంలోని 9 రైతుబజార్లకు 10వేల క్వింటాళ్ల వరకు కూరగాయలను రైతులు తీసుకువస్తున్నారు. కూరగాయల ధరలు రైతుబజార్లలోనే కాదు బహిరంగ మార్కెట్లలో కూడా కిందికి దిగివచ్చాయి.
తీరిన కొరత
నగర అవసరాలకు సరిపడా కూరగాయలు మార్కెట్‌కు వస్తుండటంతో కొరత అనేది ఎక్కడా కన్పించట్లేదు. రోజుకు 55వేల క్వింటాళ్ల కూరగాయలు కావాల్సి ఉండగా, ఆదివారం 75వేల క్వింటాళ్ల కూరగాయలు దిగుమతైనట్లు మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో నగరంలోని 9 రైతుబజార్లకు 20 టన్నుల వరకు సరఫరా అయ్యాయి. ప్రస్తుతం అన్ని రకాల కూరగాయలు అందుబాటు ధరల్లో ఉండటంతో డిమాండ్-సరఫరాల మధ్య సమతుల్యం ఏర్పడింది. దిగుబడులు అధికం కావడంతో రైతుబజార్‌లో బోర్డుపై రాసిన ధర కంటే మరీ తగ్గించి రైతులు తమ సరుకు అమ్ముకొంటున్నారు.
ఆదివారం కూకట్‌పల్లి, ఎర్రగడ్డ రైతుబజార్లలో చిక్కుడు కేజీ రూ.22లు ధర బోర్డుపై రాయగా రైతులు మాత్రం కేజీ రూ.16లకే విక్రయించారు. అలాగే రూ.27 ధర ఉన్న క్యారెట్ రూ.20లకు, రూ.12లున్న కాలీఫ్లవర్ రూ.8ల ప్రకారం అమ్మారు. మరో వారం రోజుల్లో టమాటా, మిర్చి, బెండ, దొండ, చిక్కుడు, కాకర, బీర వంటి వాటి ధరలు సింగిల్ డిజిట్లోకి (కేజీ రూ.10లోపు) పడిపోయే అవకాశాలున్నాయి.