
రజితకు పుట్టింది ఆడబిడ్డే
- శిశువుల తారుమారు వివాదానికి డీఎన్‌ఏ రిపోర్ట్‌తో తెర
- రమాదేవికి జన్మించింది మగశిశువే అని తేల్చిన నివేదిక..
సాక్షి, హైదరాబాద్: సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువుల తారుమారు వివాదానికి డీఎన్‌ఏ పరీక్ష రిపోర్ట్‌తో తెరపడింది. చత్రు, రజిత దంపతులకు జన్మించింది ఆడబిడ్డే అని తేలింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన జంగయ్య భార్య రమాదేవి ఆగస్టు 23న మధ్యాహ్నం మగశిశువుకు జన్మనిచ్చింది. ఇదే సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్ మండలం కడ్తాల్‌కు చెందిన చత్రు భార్య రజిత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. లేబర్ రూమ్‌లోని ఆయా సుల్తానా.. రమాదేవి అని పిలువగా పొరపాటున రజిత పెద్దమ్మ మసుర్ వ చ్చి నిలబడింది. వచ్చిన వారు ఎవరో నిర్ధారించుకోకుండా ఆయా ఆ మగబిడ్డను ఆమెకు అప్పగించింది.
శిశువుల అప్పగింతలో తప్పు దొర్లినట్లు గుర్తించిన వైద్యులు వెంటనే అప్రమత్తమై రజిత బంధువులకు అప్పగించిన మగబిడ్డను స్వాధీనం చేసుకుని రమాదేవికి ఇచ్చారు. అయితే తమకు పట్టింది మగ బిడ్డని, ఆస్పత్రి సిబ్బందే శిశువులను మార్చారంటూ చత్రు ఆస్పత్రిలో ఆందోళనకు దిగడంతో పాటు సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఇరువురు దంపతుల నుంచే కాకుండా పుట్టిన ఆడ, మగ శిశువుల నుంచి రక్తపు నమూనాలు సేకరించి డీఎన్‌ఏ టెస్టుకు పంపించారు. బుధవారం రిపోర్ట్ అందడంతో.. ఆ సీల్డ్ కవర్‌ను సుల్తాన్‌బజార్ ఇన్‌స్పెక్టర్ సమక్షంలో ఆసుపత్రి వైద్యులు తెరిచారు.
మగ శిశువు జంగయ్య, రమాదేవి దంపతులకు జన్మించాడని.. ఆడ శిశువు చత్రు, రజితలకు జన్మించిందని డీఎన్‌ఏ నివేదిక తేల్చింది. దీంతో ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్ విద్యావతి, వైద్యులు జంగయ్య, రమాదేవి దంపతులకు మగశిశువును అప్పగించారు. శిశువుల విషయంలో తమకు జీవితాంతం అనుమానం ఉండేదని.. డీఎన్‌ఏ పరీక్షలో నిజం తేలడంతో తాము మనస్ఫూర్తిగా శిశువులను తీసుకుంటున్నామని ఇరు కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి. కాగా ఆసుపత్రి ఆయా సుల్తానా నిర్లక్ష్యంతోనే శిశువులు తారుమారై.. ఇంత వివాదం జరిగిందని భావించిన ఉన్నతాధికారులు ఆమెను విధుల నుంచి తప్పించారు.