బస్తీ మే లేడీ పైలట్!
ఈ రోజుల్లో పిల్లలంతా అయితే ఇంజనీరింగ్.. కాదంటే మెడిసిన్ చదువతామంటారు. కానీ సైదా సల్వా ఫాతిమా మాత్రం పైలట్ అవుతానంది. అది చూసి అందరూ నవ్వారు. పాతబస్తీ గల్లీ నుంచి వచ్చి, పైలట్ అవుతావా అన్నారు. అది కూడా హైదరాబాద్ పాతబస్తీలో ఓ బేకరీ కార్మికుడి కూతురు పైలట్ కావడమేంటని ఎద్దేవా చేశారు. ఆమె మాత్రం తన పట్టుదల కొనసాగించింది.. తాను అనుకున్నది సాధించి అందరికీ చూపించింది. ఆ రకంగా.. ఇంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చి కమర్షియల్ పైలట్ లైసెన్సు పొందిన మొట్టమొదటి ముస్లిం బాలికగా ఆమె రికార్డులు సాధించింది.
హైదరాబాద్ నగరంలోని సుల్తాన్షాహి ప్రాంతానికి చెందిన ఫాతిమా.. చిన్నతనం నుంచే గాల్లో విమానం ఎగరేయాలని కలలు కనేది. తొమ్మిదో తరగతి చదివేటప్పుడు వివిధ రకాల విమానాల బొమ్మలు, వైమానిక పరిశ్రమకు సంబంధించిన కథనాలను సేకరిస్తూ ఉండేది. తరగతిలో క్లాస్మేట్లకు ఎవరికి చెప్పినా అందరూ అది అసాధ్యమనే చెప్పేవారని, కానీ అల్లా దయతో తన కల నెరవేరిందని ఫాతిమా చెప్పింది. ఆమె మలక్పేటలోని అజీజియా స్కూల్లో చదివింది. ఆమె తండ్రి అష్ఫక్ అహ్మద్కు నలుగురు పిల్లలు. వాళ్లలో ఫాతిమాయే పెద్దది. సియాసత్ ఉర్దూ పత్రిక నిర్వహించే ఎంసెట్ కోచింగ్కు వెళ్లినప్పుడు.. ఆ పత్రిక ఎడిటర్ జాహిద్ అలీఖాన్ ఆమె ఆశలను గుర్తించారు. విషయం తెలిసి, ఆమె పైలట్ శిక్షణకు అయ్యే ఖర్చంతటినీ భరిస్తానన్నారు. 2007లో ఆమె ఏపీ ఏవియేషన్ అకాడమీలో పేరు నమోదు చేయించుకుంది. తొలిసారి విమానం ఎగరేసినప్పుడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యానని.. అలనాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంది. ఇప్పుడు ఆమె 200 గంటలు విమానం నడిపిన అనుభవాన్ని సొంతం చేసుకుంది. కమర్షియల్ పైలట్ లైసెన్సుతో పాటు ప్రైవేటు పైలట్ లైసెన్సు, ఫ్లైట్ రేడియో టెలిఫోన్ ఆపరేటర్ లైసెన్సు కూడా పొందింది.