old city girl
-
కుమార్తె వరుసయ్యే బాలిక నగ్న వీడియో తీసి..
సాక్షి, సిటీబ్యూరో : ఢిల్లీకి చెందిన వ్యక్తిగా నమ్మించి హైదరాబాద్‌కు చెందిన మహిళను దుబాయ్‌లో వివాహం చేసుకుని, అక్రమంగా దేశంలోకి ప్రవే«శించడమే కాకుండా కుమార్తె వరుసయ్యే బాలిక పట్ల అభ్యంతరకంగా ప్రవర్తించిన పాకిస్థానీని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఇతడు భారత్‌కు రావడం వెనుక మరేదైనా కారణం ఉందా? నకిలీ ధ్రువీకరణ పత్రాలు అందించింది ఎవరు? తదితర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయింది. సదరు మహిళకు ఇద్దరు కుమార్తెలు. పదేళ్ల క్రితం ఆమె బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లిన ఆమెకు పాకిస్థానీ మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ మహ్మద్ అబ్బాస్ ఇక్రమ్‌తో పరిచయమైంది. తాను భారతీయుడినే అని, స్వస్థలం ఢిల్లీ అని నమ్మించిన అతగాడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్ళకు అసలు విషయం తెలిసిన మహిళ హైదరాబాద్ తిరిగి వచ్చేసింది. 2011లో ఉస్మాన్ సైతం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అప్పట్లో తాను ఆరు నెలల విజిట్ వీసాపై వచ్చానంటూ చెప్పాడు. అయితే వాస్తవానికి దుబాయ్ నుంచి నేపాల్ వరకు విమానంలో వచ్చిన అతగాడు అక్కడ నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో ఢిల్లీ వెళ్లి అట్నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఆరు నెలలకు ఈ విషయం తెలుసుకున్న మహిళ అతడిని దూరంగా ఉంచడం ప్రారంభించారు. దీంతో కక్షకట్టిన అతగాడు ఆమె 12 ఏళ్ల కుమార్తె నగ్న చిత్రాలు తీయడంతో పాటు కొందరికి ఆన్లైన్లో విక్రయించానంటూ ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. తనకు డబ్బు ఇవ్వకపోతే సదరు ఫొటోలను బయటపెడతానంటూ బాధిత మహిళ స్నేహితురాలికీ వాట్సాప్ సందేశం పంపాడు. అతడి వేధింపులు తాళలేక బాధితురాలు సీసీఎస్‌లో ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ ఏసీపీ కేసీఎస్ రఘువీర్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ రమేష్ దర్యాప్తు చేశారు. శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణ నేపథ్యంలో అబ్బాస్ పేరుతో అనేక బోగస్ ధ్రువీకరణలు పొందిన ఉస్మాన్ పాస్‌పోర్ట్ సైతం తీసుకున్నట్లు వెల్లడైంది. సర్టిఫికెట్ల ఆధారంగా కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు చేసినట్లు బయటపడింది. ఈ కోణాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అతడికి ఈ ధ్రువీకరణలు అందించిన దళారుల ఎవరనే కోణంలో ఆరా తీయనున్నారు. ఉస్మాన్ అక్రమ మార్గంలో భారత్‌కు రావడం వెనుక కుట్ర సహా ఇతర కోణాలు ఉన్నాయా? ఇతడిని ప్రేరేపించింది ఎవరు? ఇన్నాళ్ళు హైదరాబాద్‌లో ఇతడి కార్యకలాపాలు ఏంటి? అనే కోణాలను పరిగణలోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తదుపరి విచారణ కోసం ఉస్మాన్‌ను న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. -
బస్తీ మే లేడీ పైలట్!
ఈ రోజుల్లో పిల్లలంతా అయితే ఇంజనీరింగ్.. కాదంటే మెడిసిన్ చదువతామంటారు. కానీ సైదా సల్వా ఫాతిమా మాత్రం పైలట్ అవుతానంది. అది చూసి అందరూ నవ్వారు. పాతబస్తీ గల్లీ నుంచి వచ్చి, పైలట్ అవుతావా అన్నారు. అది కూడా హైదరాబాద్ పాతబస్తీలో ఓ బేకరీ కార్మికుడి కూతురు పైలట్ కావడమేంటని ఎద్దేవా చేశారు. ఆమె మాత్రం తన పట్టుదల కొనసాగించింది.. తాను అనుకున్నది సాధించి అందరికీ చూపించింది. ఆ రకంగా.. ఇంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చి కమర్షియల్ పైలట్ లైసెన్సు పొందిన మొట్టమొదటి ముస్లిం బాలికగా ఆమె రికార్డులు సాధించింది. హైదరాబాద్ నగరంలోని సుల్తాన్షాహి ప్రాంతానికి చెందిన ఫాతిమా.. చిన్నతనం నుంచే గాల్లో విమానం ఎగరేయాలని కలలు కనేది. తొమ్మిదో తరగతి చదివేటప్పుడు వివిధ రకాల విమానాల బొమ్మలు, వైమానిక పరిశ్రమకు సంబంధించిన కథనాలను సేకరిస్తూ ఉండేది. తరగతిలో క్లాస్మేట్లకు ఎవరికి చెప్పినా అందరూ అది అసాధ్యమనే చెప్పేవారని, కానీ అల్లా దయతో తన కల నెరవేరిందని ఫాతిమా చెప్పింది. ఆమె మలక్‌పేటలోని అజీజియా స్కూల్లో చదివింది. ఆమె తండ్రి అష్ఫక్ అహ్మద్‌కు నలుగురు పిల్లలు. వాళ్లలో ఫాతిమాయే పెద్దది. సియాసత్ ఉర్దూ పత్రిక నిర్వహించే ఎంసెట్ కోచింగ్‌కు వెళ్లినప్పుడు.. ఆ పత్రిక ఎడిటర్ జాహిద్ అలీఖాన్ ఆమె ఆశలను గుర్తించారు. విషయం తెలిసి, ఆమె పైలట్ శిక్షణకు అయ్యే ఖర్చంతటినీ భరిస్తానన్నారు. 2007లో ఆమె ఏపీ ఏవియేషన్ అకాడమీలో పేరు నమోదు చేయించుకుంది. తొలిసారి విమానం ఎగరేసినప్పుడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యానని.. అలనాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంది. ఇప్పుడు ఆమె 200 గంటలు విమానం నడిపిన అనుభవాన్ని సొంతం చేసుకుంది. కమర్షియల్ పైలట్ లైసెన్సుతో పాటు ప్రైవేటు పైలట్ లైసెన్సు, ఫ్లైట్ రేడియో టెలిఫోన్ ఆపరేటర్ లైసెన్సు కూడా పొందింది.