
ప్లకార్డులతో మౌన ప్రదర్శన నిర్వహిస్తున్న పలు బ్యాంకుల అధికారులు
* కేంద్ర మాజీ మంత్రికావూరి కుమార్తె శ్రీవాణికి చెందిన సంస్థ ఎదుట ప్రదర్శన
* 18 బ్యాంకులకు రూ. వెయ్యి కోట్ల మేర బకాయి పడినట్లు వెల్లడి
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కుమార్తె శ్రీవాణికి చెందిన ఓ నిర్మాణ సంస్థ నగరంలోని 18 బ్యాంకులకు దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర బకాయి పడింది. దీంతో ఆయా బ్యాంకుల మేనేజర్‌లు, ఏజీఎంలు ఆ సంస్థ ఎదుట సోమవారం ప్లకార్డులతో మౌన ప్రదర్శనకు దిగారు. శ్రీవాణికి చెందిన ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ గత పదేళ్ల నుంచి నగరంలోని ప్రముఖ బ్యాంకులలో రూ.వందల కోట్ల రుణాలు తీసుకుంటూ తిరిగి చెల్లింపులు జరుపుతోంది. అయితే గత నాలుగేళ్లుగా ఆ సంస్థ తాను తీసుకున్న రుణాలను చెల్లించడం లేదు. దీంతో 18 బ్యాంకుల అధికారులు సోమవారం అబిడ్స్ చిరాగ్‌అలీ లైన్‌లోని రాఘవ రత్న టవర్ 7వ అంతస్తులో ఉన్న ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ కార్యాలయం ముందు ప్లకార్డులతో మౌన ప్రదర్శనకు దిగారు. ఉదయం 9.45 గంటల నుంచి 11.45 గంటల వరకు రెండు గంటల పాటు ప్రదర్శనకు దిగి రుణాలు చెల్లించాలని కోరారు. ఆ సమయంలో కార్యాలయంలో ఎవరూ అందుబాటులో లేరు.
ఈ బ్యాంకులకే బకాయిలు...
నగరంలోని కోఠి ఆంధ్రాబ్యాంకు, బ్యాంకు స్ట్రీట్‌లోని యునెటైడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఎస్డీ రోడ్‌లోని కోఆపరేటివ్ ఫైనాన్స్ గ్రూప్, ఎక్స్‌పోర్ట్ అండ్ ఇన్‌పోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏసీ గాడ్స్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాగుట్టలోని ఎస్‌బీహెచ్, బేగంపేట్‌లోని ఐసీఐసీఐ, సికింద్రాబాద్‌లోని ఎస్‌బీఐ, సైఫాబాద్‌లోని కెనరా బ్యాంకు, పబ్లిక్ గార్డెన్స్‌లోని విజయబ్యాంకు, అబిడ్స్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూకో బ్యాంకు, సోమాజిగూడలోని బ్యాంక్ ఆఫ్ బహెరాన్, కువైట్ బ్యాంక్, హిమాయత్‌నగర్‌లోని అలహాబాద్ బ్యాంక్, సికింద్రాబాద్‌లో కార్పొరేషన్ బ్యాంకు, బేగంపేట్‌లోని ఇండస్ట్రియల్ బ్యాంకు, బంజారాహిల్స్‌లోని శ్రీ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ ప్రైవేటు లిమిటెడ్ బ్యాంకులకు ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ దాదాపు వెయ్యి కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది.
కోఠి ఆంధ్రాబ్యాంకుకే రూ. 200 కోట్లు
కోఠి చౌరస్తాలోని ఒక్క ఆంధ్రాబ్యాంకుకే దాదాపు రూ. 200 కోట్ల బకాయిలు ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు మిగతా 17 బ్యాంకులతో కలిపి రూ. వెయ్యి కోట్ల బకాయిలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
నోటీసులు ఇచ్చినా స్పందన లేదు...
వివిధ బ్యాంకులు బకాయిలు చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేదని, దీంతోనే తామంతా ఏకమై మౌన ప్రదర్శనకు దిగామని పలువురు అధికారులు తెలిపారు. వివిధ ప్రాజెక్టుల కోసం రుణాలు తీసుకున్నట్లు వివరించారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎన్‌పీఏ అయిన అనంతరమే తాము నోటీసులు జారీ చేసి చట్టపరంగా ముందుకు పోతామని అధికారులు తెలిపారు. ఈ ప్రదర్శనలో పలు బ్యాంకులకు చెందిన అధికారులు హెచ్.ఆర్. చౌదరి, ఎం. రవి, సీహెచ్. రాజశేఖర్, కమలాకర్‌రావు, హనుమంతరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.