‘బతుకమ్మ’ వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు | 'Bathukamma' celebration in Traffic diversion | Sakshi
Sakshi News home page

‘బతుకమ్మ’ వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు

Oct 19 2015 2:19 AM | Updated on Sep 3 2017 11:10 AM

‘బతుకమ్మ’ వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు

‘బతుకమ్మ’ వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు

మధ్య మండల పరిధిలోని ఎల్బీ స్టేడియంతో పాటు అప్పర్ ట్యాంక్‌బండ్‌పై మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి.

* రేపు సాయంత్రం 4 నుంచి రాత్రి 11.30 వరకు
* ట్యాంక్‌బండ్, ఎల్బీస్టేడియం కేంద్రంగా అమలు
సాక్షి, సిటీబ్యూరో: మధ్య మండల పరిధిలోని ఎల్బీ స్టేడియంతో పాటు అప్పర్ ట్యాంక్‌బండ్‌పై మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు ప్రాంతాల కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపు నిబంధన విధిస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

మంగళవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఇవి అమలులో ఉండనున్నాయి. ఆ సమయంలో సికింద్రాబాద్, కట్టమైసమ్మ, కవాడీగూడ, ఇక్బాల్‌మీనార్, ఏఆర్ పెట్రోల్ పంప్, డీజేఆర్ స్టాట్యూ, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, పోలీసు కంట్రోల్ రూమ్, నాంపల్లి, హిమాయత్‌నగర్ వై జంక్షన్, పంజగుట్ట, రాజ్‌భవన్, బుద్ధభవన్ వైపునకు ప్రయాణించే వాహనచోదకులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని కమిషనర్ కోరారు. కార్యక్రమాలకు హాజరయ్యే ఆహుతులు తమకు జారీ చేసిన పాసుల శ్రేణిని బట్టి నిర్ణీత ప్రాంతాల్లో ఆపి దిగిపోవడంతో పాటు కేటాయించిన ప్రాంతాల్లోనే పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

కారు పాసుల్లేని వాహనాలను ట్రాఫిక్ మళ్లింపులు ఉన్న ప్రాంతాలు దాటి రావడానికి అనుమతించరు. చిల్డ్రన్ పార్క్ జంక్షన్ దాటి, ఎల్బీ స్టేడియం నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ మధ్య ఉన్న బషీర్‌బాగ్, లిబర్టీ, అంబేద్కర్ స్టాట్యూ మధ్య వాహనాలను అనుమతించరు. ఆహుతులు తమ డ్రైవర్ నెంబర్లను దగ్గర ఉంచుకుని, కార్యక్రమం ముగిసిన తర్వాత మాత్రమే నిర్ణీత ప్రాంతాలకు కార్లను పిలిపించుకోవాలని పోలీసులు కోరుతున్నారు.  
 
బతుకమ్మ సంబరాలకు భారీ బందోబస్తు
ఖైరతాబాద్: బతుకమ్మ సంబరాలకు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సైఫాబాద్ ఇన్‌స్పెక్టర్ పూర్ణచందర్ తెలిపారు. సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు ఏసీపీలు, 20మంది సీఐలు, 60మంది ఎస్‌ఐలతో పాటు మొత్తం 400 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి జిల్లా నుంచి 200 మంది మహిళలతో పాటు 10 వేల మంది మహిళా పొదుపు సంఘాల మహిళలు మొత్తం 12వేల మంది మహిళలు లాల్‌బహదూర్ స్టేడియంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు. వీరితో పాటు రాజకీయ, ఇతర ప్రముఖులు, నాయకులు పాల్గొనే ఈ కార్యక్రమంలో జిల్లాల వారీగా ప్రత్యేక శకటాలు లాల్‌బహదూర్ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు ప్రదర్శనగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో 20వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి  ప్రత్యేక  బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
 
బతుకమ్మ ఘాట్‌లకు రూ.70లక్షలు
బంజారాహిల్స్:  సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ఎన్‌టీఆర్ మార్గ్, నెక్లస్ రోడ్, ట్యాంక్‌బండ్ పైన ఉన్న బతుకమ్మ ఘాట్‌లలో బతుకమ్మ నిమజ్జనాలు చేసేందుకు ఏడు ఘాట్‌లను సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు రూ.70లక్షల నిధులు వెచ్చిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ సెంట్రల్ జోన్ కమిషనర్ కిషన్ తెలిపారు. ఈ ఘాట్‌లలో పరిశుభ్రమైన నీరు ఉండే విధంగా చెత్తను తొలగిస్తున్నామని రోడ్డు మరమ్మతులు చేపట్టి లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛమైన నీళ్లలో బతుకమ్మ నిమజ్జనం చేసే విధంగా కొన్ని చోట్ల టబ్‌ల నిర్మాణం కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు. సోమవారం సాయంత్రానికి ఘాట్‌ల వద్ద పూర్తి సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement